కొత్త తరం కార్టూనిస్ట్ లను ప్రొత్సహించాలి-జాకీర్

“జాకిర్” గా కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు మహమ్మద్ జాకీర్ హుస్సేన్. పుట్టినది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అక్కన్నపేట (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) లో.. నాన్న అబ్దుల్ సత్తార్ గారు గ్రామ పోలీసు పటేల్, పోస్ట్ మాస్టర్ కూడా. అమ్మ చాంద్ బీ గృహిణి.. హైస్కూల్ చదివే రోజుల్లో ఊరు మొత్తానికి మా ఇంటికే పేపరు వచ్చేది. అది ఈనాడు. ఆ పేపరు కోసం వూళ్ళో చాలా మంది మా ఇంటికే రావటం, అందులోని వార్తలని గురించి చర్చించుకోవటం చేసేవారు. చాలా మంది వార్తలకంటే కూడా అందులో ‘పాపా‘ గారు వేసే కార్టూన్ గురించే ఎక్కువగా మాట్లాడుకోవటంతో కార్టూన్ కు అంత విలువ ఉందా అనిపించేది అలా కార్టూన్స్ పట్ల ఇష్టం ఏర్పడింది.

చిన్నతనం లో చందమామలో బొమ్మలు, పేపరులో వచ్చే సినిమా బొమ్మలు చూసి వేయడం చేసేవాడిని. కార్టూన్ల పై ఇష్టం ఏర్పడ్డాక 8 వ తరగతి నుంచే కార్టూన్స్ వేయడం మొదలెట్టాను. కానీ పత్రికలకు ఎలా పంపాలో తెలియక పోయేది. కార్టూన్స్ యే పెన్ను, ఇంక్ తో వేయాలి, పేపర్ ఏది వాడాలి, కొలతలు చెప్పేవాళ్ళు ఎవరూ తెలియదు… పదవ తరగతి చదివేటప్పుడు మా ఊరి నుండి కరీంనగర్ కు రావడం జరిగింది.. స్థానిక నవత పత్రిక వారి దగ్గిరకి వెళ్ళి కార్టూన్లు వేస్తానని అప్పటికి నోట్ బుక్ లో వేసిన కార్టూన్స్ చూపించాను. అవి వారికి నచ్చి..వాళ్ళు కొన్ని వ్యాసాలకి కార్టూన్లు వేయమనటం, మరుసటి రోజే నేను వేసి తీసుకువెళ్లటం,వారికి నచ్చి అవి ప్రచురించటమే కాక మరిన్ని అవకాశాలు ఇవ్వటం జరిగింది.అప్పట్లో offset ప్రింటింగ్ రాలేదు అంతగా.. కార్టూన్స్ ను, బొమ్మలను “బ్లాక్” లు గా చేసి అచ్చులో వాడేవారు.. నా కార్టూన్ అచ్చులో చూసినదానికన్నా.. నా కార్టూన్ బ్లాక్ ను చూసి ఎక్కువగా మురిసిపోయాను.. అలా పొలిటికల్ కార్టూనిస్ట్ గా నా ప్రస్థానం మొదలయ్యింది.

Cartoonist Zakir

1983 లో హాస్యప్రియ లో కార్టూన్లు ప్రచురించబడినాయి. కరీంనగర్ నుండి వెలువడే జీవగడ్డ పత్రిక లో కార్టూన్స్, illustrations, కవితలు, వ్యాసాలు రాసాను. జీవగడ్డ పత్రిక ఒక యూనివర్సిటీ లాంటిది.. ఎందరో మహామహులు శ్రీయుతులు అలిశెట్టి ప్రభాకర్, BS రాములు, అల్లం రాజయ్య, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, వారాల ఆనంద్, జింబో లాంటి వారి అడ్డా జీవగడ్డ అనవచ్చు… 1983-1992 మధ్య ఎక్కువ కార్టూన్లు వేసాను.. .
స్ట్రిప్ కార్టూన్,సబ్జెక్ట్, చీకటి కార్టూన్, అబ్సర్డ్ కార్టూన్, కవితా కార్టూన్, మడత కార్టూన్లు ఇలా అన్నీ ప్రక్రియల్లో కార్టూన్స్ వేసాను.
ఆదివారం వారపత్రికలో రెండున్నరేళ్లు కవితా కార్టూన్ శీర్షికన కవిత మరియు కార్టూన్ వేశారు.
1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డు అందుకున్నాను. 1986 లోనే సాధన సమితి వారిచే కూడా ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డు అందుకున్నాను. ఇవి కాక అనేక బహుమతులు అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీలలో బహుమతులు అందుకున్నాను.
నా కార్టూన్లు దాదాపు అన్ని తెలుగు పత్రికలలో వచ్చాయి. ది వీక్,కారవాన్, ఫ్రంట్ లైన్,నక్కీరన్, కన్నడ కస్తూరి, న్యూస్ టైమ్ డైలీ లలో కూడా నా కార్టూన్లు ప్రచురించబడ్డాయి.
బ్యాంక్ లో మేనేజర్ గా పని వత్తిడి వల్ల1992 నుండి కార్టూన్స్ వేయడం పూర్తిగా మానేసాను. కార్టూన్స్ వేయడం మానేసినా కూడా జిల్లా సంఘం ఆధ్వర్యంలో, సహా కార్టూనిస్ట్, సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల రాజమౌళి గారితో కలిసి కార్టూన్ ఎక్సిబిషన్ లు ఏర్పాటు చేయడం మాత్రం మానలేదు.

1996 లో కరీంనగర్ జిల్లా కార్టూనిస్టుల సంఘం ఏర్పాటు చేయడం. ఆ సంఘం అధ్యక్షుడిగా సంఘం తరఫున అనేక కార్టూన్ ప్రదర్శనలు కరీంనగర్, వరంగల్, హైదరాబాదు,విజయవాడ, ఢిల్లీ, సింగపూర్, మలేసియాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్సాహమే జిల్లాలో ఎందరో కొత్త కార్టూనిస్టులు రావటానికి అవకాశం కలిగింది. ఇప్పటికీ ఉభయ రాష్ట్రాల్లో ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో (40 పైన) కార్టూనిస్టులు ఉన్నారు. సంఘం తరపున క్రమం తప్పకుండా exhibitions నిర్వహించడమే అందుకు కారణం.
2017 లో కొండా రవిప్రసాద్ నన్ను Heartoonists వాట్సప్ గ్రూప్ లో జాయిన్ చేయడంతో మళ్ళీ కార్టూన్ వైపు ఆసక్తి కలిగింది.. కొండా రవిప్రసాద్, రావుగారి అబ్బాయి కిరణ్, వేముల గార్లు నన్ను మళ్లీ కార్టూన్స్ వేయమని ప్రోత్సహించడం, బాచి గారి బలవంతంతో తిరిగి కార్టూన్స్ మొదలెట్టాను.

Cartoonist Zakir

2017 లో బెంగుళూరులో తెలుగు కార్టూనిస్టుల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన “తెలుగు కార్టూనోత్సవం” తో కార్టూనిస్టు గా రెండవ ఇన్నింగ్స్ మొదలెట్టాను. అప్పటికి అందరూ రంగుల్లో కార్టూన్స్ వేస్తున్నారు, నాకు ఫోటోషాప్ రాకపోవడం వల్ల కొంత ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాను. కేవలం 30 నిమిషాల్లో ఫోటోషాప్ లో కార్టూన్స్ కలర్స్ వేయడం నేర్పించిన మిత్రులు శ్రీగద్దే శంకర్ గారు.. కేవలం 3, 4 టూల్స్ వాడడం మాత్రమే వచ్చు ఇప్పటికీ.

2018 లో ‘తెలంగాణ రాష్ట్ర కార్టూనిస్టుల సంక్షేమ సంఘం’ ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం, సంఘం ఆవిర్భావం తద్వారా అనేక కార్యక్రమాలు చేపడ్డడం జరిగింది. ప్రస్తుతం ఆ సంస్థకు అధ్యక్షుడిగా వున్నాను. ఆ సంస్థ సభ్యులందరూ కరోనాపై ఎక్కువ కార్టూన్లు వేయటమేకాక దాన్ని వీడియోగా కూడా రూపొందించాము.ఇది దేశంలోనే మొదటి వర్చువల్ ఎక్సిబిషన్ గా గుర్తింపు పొందింది. ప్రభుత్వం నుంచీ కార్టూనిస్టులకు గుర్తింపు కార్డులు సాధించాము. దేశంలోనే మొదటి సారిగా మాజీ ప్రధాని శ్రీ పీ వీ నరసింహా రావు గారి కెరికేచర్ పోటీ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం. ఆ చిత్రాలతో త్వరలో ప్రభుత్వ సహకారంతో హైదరాబాదులో ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నాము.

వార్త దినపత్రిక ఆదివారం అనుబంధానికి మూడేళ్ళనించీ కార్టూన్లు వేస్తున్నాను. ఇప్పటికీ మూడు కధలు, 50 కు పైగా వ్యాసాలు, 1000 కు పైగా కవితలు, 8000 లకు పైగా కార్టూన్స్ ప్రచురించబడ్డాయి.
నేను వేసిన ఒక కార్టూన్ పై ఒక వెబ్ సైట్ లో ఒక చర్చ కూడా జరిగినది. మరో కార్టూన్ ఒక అంతర్జాతీయ వెబ్ పత్రికలో 40 వారాలు వరుసగా ప్రదర్శించబడింది. అనేక కార్టూన్లు అంతర్జాతీయ స్తాయిలో అత్యధిక ప్రజాదరణ పొందాయి.
కార్టూనిస్టులని ప్రోత్సహించాలి, కొత్త కార్టూనిస్టులను తీర్చిదిద్దాలి అనేది నా ధ్యేయం. పోటీలలో కూడా కొత్త కార్టూనిస్టుల కే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. 80 వ దశకం లో వేసిన కార్టూనిస్టు లే ఇప్పుడూ వేస్తున్నారు.. కొత్త తరం కార్టూనిస్ట్ లు చాలా తక్కువ.

కొత్తగా ఈ రంగాన్ని ఎంచుకునే వారికి సహకారం, ప్రోత్సాహం అందించడం సీనియర్ కార్టూనిస్ట్ ల అందరి బాధ్యత.
-జాకిర్

Cartoonist Zakir
Cartoonist Zakir
Cartoon prize receiving

4 thoughts on “కొత్త తరం కార్టూనిస్ట్ లను ప్రొత్సహించాలి-జాకీర్

  1. Very nice to know more about you Zakir bhayya…and thank you very much for mentioning my name and my Hearty Congratulations for your great achievements in your Cartoon life….Bachi 9848992433.

  2. Very nice to know more about you Zakir bhayya…and thank you very much for mentioning my name and my Hearty Congratulations for your great achievements in your Cartoon life….Bachi 9848992433.

  3. జాకీర్ గారూ!
    మీ పరిచయం బాగుంది. మీకూ మిమ్మల్ని ఇలా పరిచయం చేసిన కళాసాగర్ గారికీ అభినందనలు.

  4. కొత్త కార్టూనిస్ట్ లకు ప్రోత్సాహం అందించాలన్న మీ ఆలోచన ఆహ్వానించదగినది. అభినందనలు జకీర్ సాబ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap