శృంగారదేవత… జీనత్ అమన్

*ఆమె శృంగారానికి మారుపేరు. మిస్ ఇండియా పోటీలో *గెలుచుకున్న ఆ అందాలభామే జీనత్ అమన్. తల్లితో కలిసి ఉండాలని జర్మనీ వెళ్లేందుకు సన్నద్ధమౌతున్న తరుణంలో నవకేతన్ ఇంటర్నేషనల్ వారి ‘హరేరామ హరేకృష్ణ’ సినిమా ద్వారా ఆమెను బాలీవుడ్ చిత్రరంగానికి పరిచయం చేసిన ఘనత నటుడు దేవానంద్ ది. జీనత్ అమన్ విద్యాధికురాలు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చదువుకున్న యువతి. 1976-80 మధ్యకాలంలో హేమామాలినితో సమానంగా పారితోషికం రాబట్టిన ఆకర్షణీయ తార. నటుడు సంజయ్ ఖాన్ తో వివాహబంధమనే చట్రంలో ఇమడలేక విలవిల్లాడిన చిగురుటాకు. కట్టుకున్న భర్త మజ్హర్ ఖాన్ అమానుష చర్యలకు శారీరికంగా, మానసికంగా బలహీనపడిన ఆబల. షో మ్యాన్ రాజకపూర్ ‘సత్యం శివం సుందరం’ ద్వారా ప్రతిఫలింపజేసిన అరుదైన నటి. ఇన్ని ప్రత్యేకతలున్న జీనత్ అమన్ సినీ ప్రస్థానం ఒక సంచలన సినిమా లాంటిది. నవంబరు 19 న 70 వ పుట్టినరోజు జరుపుకుంటున్న జీనత్ అమన్ గురించి కొన్ని విశేషాలు…

జర్నలిస్ట్, మోడల్ మహిళగా…
జీనత్ అమన్ నవంబరు 19, 1951 న బొంబాయిలో జన్మించింది. తండ్రి అమానుల్లా ఖాన్ ఇస్లాం మతస్తుడు. తల్లి సింధియా వర్ధిని కర్వాస్తే హిందూ మతస్తురాలు. ఆమె మహరాష్ట్రియన్. నటుడు రాజా మురాద్ ఆమెకు పినతండ్రి. తండ్రి అమానుల్లా ఖాన్ భోపాల్ పాలకుల వంశస్తుడు….మంచి రచయిత. ‘అమన్’ అనే కలం పేరుతో మొఘల్-ఎ-ఆజం, పాకీజా వంటి చారిత్రాత్మక సినిమాలకు స్క్రిప్టు రూపొందించినవాడు. ‘అమన్’ పేరునే జీనత్ తన ఇంటిపేరుగా మార్చుకుంది. జీనత్ కు పదమూడేళ్ళ వయసు నిండగానే తండ్రి కాలం చేశాడు. తరవాత జీనత్ తల్లి హేయిన్జ్ అనే ఒక జర్మన్ దేశస్తుణ్ణి పెళ్ళిచేసుకుంది. దాంతో జీనత్ తల్లితోబాటు జర్మనీ వెళ్ళిపోయింది. పద్దెనిమిదేళ్ళ వయసులో బొంబాయికి వచ్చి పంచాగ్ని పాఠశాలలో చదువు కొనసాగించింది. తరవాత పై చదువుకోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్ళింది. సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేస్తూ, మధ్యలో వదిలేసి బొంబాయి చేరుకుంది. ‘ఫెమినా’ అనే మహిళా జర్నల్ కు కొంతకాలం కాలమిస్టుగా పనిచేసింది. తరవాత ‘మోడలింగ్’ వైపు మొగ్గుజూపింది. 1966లో ‘తాజ్ మహల్’ బ్రాండ్ టీ మొదలైన ఆహార ఉత్పత్తులకు మోడల్ గా పనిచేసింది. ‘మిస్ ఇండియా’ పోటీల్లో రన్నర్-అప్ గా నిలిచి 1970లో ‘మిస్ ఆసియా పాసిఫిక్’ కిరీటం గెలుచుకుంది.

దమ్మారో దమ్ తో బాలీవుడ్ లో…
ప్రముఖ నటుడు నిర్మాత, దర్శకుడు, కథకుడు ఓ.పి. రల్హన్ 1971లో తమిళంలో హిట్టయిన కామెడీ చిత్రం ‘అనుబవమ్ పుదుమై’ ను హిందీలో ‘‘హల్ చల్’ పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమాద్వారా జీనత్ అమన్ బాలీవుడ్ వెండితెరకు పరిచయమై ఒక చిన్న పాత్రలో నటించింది. జీనత్ తోబాటు కబీర్ బేడి కూడా ఈ చిత్రం ద్వారానే బాలీవుడ్ తెరకు పరిచయమయ్యాడు. తరవాత ఎస్.ఎం.అబ్బాస్ దర్శకత్వంలో వచ్చిన ‘హంగామా’ (1971) అనే మరో కామెడీ సినిమాలో జీనత్ అమన్ కిషోర్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద విఫలం కావడంతో జీనత్ జర్మనీ వెళ్లిపోఎందుకు మూట ముల్లె సర్దుకుంది. అప్పుడే నవకేతన్ ఇంటర్ నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ మీద దేవానంద్ ‘హరేరామ హరేకృష్ణ’ (1971) సినిమా నిర్మిస్తూ, అందులో పాశ్చాత్య నాగరిక సమాజంలో వేళ్ళూనిన హిప్పీ సంప్రదాయపు యువతిగా, దేవానంద్ చెల్లెలుగా నటించేందుకు తగిన నటికోసం అన్వేషిస్తున్నాడు. తొలుత ‘ప్రేమ్ పూజారి’ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటించిన జహీదాకు ఇవ్వజూపితే, ఆ పాత్ర ప్రధాన్యతను తెలుసుకోకుండానే హీరోయిన్ పాత్ర అయితే చేస్తాననడంతో ఆమెను దేవానంద్ ప్రక్కన పెట్టారు. హీరోయిన్ పాత్రను ముంతాజ్ కు ఇచ్చారు. అప్పుడు జీనత్ అమన్ దేవానంద్ దృష్టికి వచ్చింది. కొత్తతార కాబట్టి చెల్లెలు పాత్ర బాగా పండుతుందని దేవానంద్ కు నమ్మకం కుదిరింది. అలా జీనత్ అమన్ కు ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలో దేవానంద్ చెల్లెలుగా నటించే అవకాశం దక్కింది. ఆ సినిమాలో జీనత్ అమన్ కోసం రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరచిన “దమ్మారో దమ్ మిఠ్ జాయే ఘమ్” సూపర్ హిట్ గా నిలిచి ఆమెకు మంచి పేరు వచ్చేలా చేసింది. ఈ పాట ఆలపించిన ఆశా భోస్లే కు ఉత్తమగాయనిగా ఫిలింఫేర్ బహుమతి లభించింది. జీనత్ అమన్ కు ఉత్తమ సహాయనటి గా ఫిలింఫేర్ బహుమతి లభించింది. బెంగాల్ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వారు జీనత్ అమన్ కు ఉత్తమ నటి బహుమతి ప్రదానం చేశారు. తరవాత దేవానంద్ సరసన జీనత్ అమన్ హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. వాటిలో ‘హీరాపన్నా’(1973), ‘ఇష్ఖ్ ఇష్ఖ్ ఇష్ఖ్’(1974), ‘ప్రేమ్ శాస్త్ర’(1974),‘ వారంట్’(1975),’ డార్లింగ్ డార్లింగ్’(1977), ‘కాలాబజార్’ (1977) ముఖ్యమైనవి. వీటిలో ‘వారంట్’ సినిమా బాక్సాఫీస్ హిట్టయింది.

Zeenat Aman

చురాలియా పాటతో…
1973 లో దర్శక నిర్మాత నాసిర్ హుసేన్ ‘యాదోం కి బారాత్’ అనే మసాలా సినిమా నిర్మించారు. సలీం-జావేద్ రచన చేసిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఇందులో ధర్మేంద్ర ముఖ్య హీరో. విజయ్ ఆరోరాకి జతగా జీనత్ అమన్ నటించింది. జీనత్ అమన్ కు, నీతూ సింగ్ కు కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన సినిమాగా ఇది రికార్డుల్లో నిలిచిపోయింది. గిటార్ ను పట్టుకొని డ్యాన్సింగ్ బోర్డు మీద “చురాలియా హై తుమ్ నే జో దిల్ కో” అనే పాటకు జీనత్ అమన్ స్టెప్పులు వేస్తుంటే ఆరోజుల్లో కుర్రకారు వెర్రెక్కిపోయారు. ఆరోజుల్లోనే ఈ సినిమా ఆరు కోట్లు వసూలు చేసింది. 70 దశకంలో యే సినీ మ్యాగజైన్ చూసినా ముఖచిత్రం జీనత్ అమన్ దే వుండేది. 1974 డిసెంబర్ లో ‘సినీ బ్లిడ్జి’అనే పత్రిక ప్రారంభ సంచిక కు ముఖచిత్రంగా జీనత్ అమన్ ఫోటో వేశారు. జీనత్ అమన్ ఆరోజుల్లో ప్రముఖ బ్యానర్లన్నిటిలో నటించింది. రాజకపూర్, బి.ఆర్. చోప్రా, మన్మోహన్ దేశాయ్, ఫిరోజ్ ఖాన్, నాసిర్ హుసేన్, మనోజ్ కుమార్, ప్రకాష్ మెహ్రా, శక్తి సామంత, రాజ్ ఖోస్లా నిర్వహించిన సంస్థల్లో జీనత్ అమన్ హీరోయిన్ గా నటించి రాణించింది. రాజకపూర్ నిర్మించిన ‘సత్యం శివం సుందరం’ (1978) సినిమాలో జీనత్ అమన్ ను సెక్సీగా చూపించి సినీ పండితుల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కున్నారు. అర్ధనగ్నంగా వుండే జీనత్ ఫొటోలతో భారీ పబ్లిసిటీ ఇచ్చిన సినిమా ‘సత్యం శివం సుందరం’. దీనిని ఒక ఆర్టిస్టిక్ సినిమాగా అభివర్ణిస్తూ జీనత్ అమన్ పేరును ఉత్తమ నటి బహుమతికోసం నామినేట్ చేశారు. జీనత్ తోబాటు రాఖీ (త్రిశూల్), రేఖా (ఘర్), రజితా (అఖియోం కే ఝారోఖోం సే) పోటీ పడినా ఆ బహుమతి మాత్రం ‘మై తులసి తేరే అంగన్ కి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన నూతన్ కు దక్కింది. అదే సంవత్సరం క్రిషన్ షా దర్శకత్వంలో భారీ బడ్జట్ చిత్రం ‘షాలిమార్’ విడుదలైంది. అందులో ధర్మేంద్ర తోబాటు హాలీవుడ్ నటుడు రెక్స్ హారిసన్, జాన్ సాక్సన్, సిల్వియా మైల్స్ నటించారు. బాలీవుడ్ నుంచి షమ్మికపూర్, ప్రీమ్ నాథ్ నటించగా జీనత్ అమన్ కాన్వెంట్ స్కూల్ గాళ్ గా పొట్టి డ్రస్సుల్లో నటించింది. ఈ చిత్రాన్ని ఇంగ్లీషులో ‘రైడర్స్ ఆఫ్ ది సేక్రెడ్ స్టోన్’ గా డబ్ చేశారు. అయితే ఇండియా తోబాటు అమెరికాలో కూడా ఈ సినిమా విజయానికి నోచుకోలేదు. శశికపూర్ హీరోగా అశోక్ రాయ్ దర్శకత్వం వహించిన కామెడీ చిత్రం ‘హీరాలాల్ పన్నాలాల్’ లో జీనత్ హీరోయిన్ గా నటించింది. అలాగే విజయ్ సాధన్ దర్శకత్వంలో నిర్మించిన ‘చోర్ కే ఘర్ చోర్’ సినిమాలో జీనత్ రణధీర్ కపూర్ సరసన నటించింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ హిట్లే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి: సినిమాటోగ్రాఫర్ నారిమన్ ఇరాని నిర్మాతగా మారి 1972లో ‘జిందగీ జిందగీ’ అనే సినిమా నిర్మించి భారీగా నష్టపోయాడు. కోటి రూపాయలు పైగా అప్పుల్లో మునిగాడు. మనోజ్ కుమార్ చిత్రం ‘రోటి కపడా అవుర్ మకాన్’(1974) కు నారిమన్ ఇరాని సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రం నిర్మాణదశలో వుండగా అమితాబ్ బచన్, జీనత్ అమన్, సహాయ దర్శకుడు చంద్ర బారోత్, మనోజ్ కుమార్ నారిమన్ ఇరాని ని అప్పుల ఊబినుంచి బయట పడేయాలని నిర్ణయించి అతనికోసం ఒక సినిమా ఉచితంగా చేసిపెట్టాలని నిర్ణయించారు. అలా రూపొందిన సినిమా సలీం-జావేద్ రూపొందించిన ‘డాన్’ సినిమా. నారిమన్ అదృష్టంకొద్దీ ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో అతడి అప్పులన్నీ తీరిపోయాయి. పెద్ద నటీనటులెవ్వరూ పారోతోషికం తీసుకోలేదు. అయితే ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్ళు పట్టింది. తీరిక సమయాల్లో నటీనటులు వచ్చి షూటింగ్ లో పాల్గొనేవారు. అందులో జీనత్ అమన్ కూడా వుంది. ఆ సంవత్సరం విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు రికార్డు చేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచి గోల్డన్ జూబిలీ చేసుకున్న చిత్రం ‘డాన్’. ఈ చిత్రానికి మూడు ఫిలింఫేర్ బహుమతులు లభించాయి. ఉత్తమ నటన ప్రదర్శించిన అమితాబ్ బచ్చన్ కు, ఉత్తమ గీతం ‘ఖైకే పాన్ బనారస్ వాలా”(మేల్) ఆలపించిన కిషోర్ కుమార్ కు, ఉత్తమ పాట (ఫిమేల్) “ఏ మేరా దిల్ యార్ కా దీవానా” ఆలపించిన ఆశా భోస్లేకు అవార్డులు దక్కాయి. జీనత్ అమన్ నటించిన ‘ధరమ్ వీర్’ (ధర్మేంద్రతో), ‘చైలా బాబు’ (రాజేష్ ఖన్నాతో), ‘ది గ్రేట్ గ్యాంబ్లర్’ (అమితాబ్ బచ్చన్) సినిమాలు కమర్షియల్ హిట్లయ్యాయి. ఎనభయ్యో దశకంలో ఎక్కువగా మల్టి-స్టారర్ సినిమాలు రావడం మొదలైంది. దాంతో జీనత్ అమన్ ను ఒక సెక్స్ అప్పీల్ వుండే పాత్రలకోసమే వాడుకోవడం ఆరంభమైంది. అయితే బి.ఆర్. చోప్రా 1980లో నిర్మించిన ‘ఇన్సాఫ్ కా తరాజు’ (తెలుగులో ఏది న్యాయం? ఏది ధర్మం?? గా 1982లో వచ్చింది)లో లైంగిక వాంఛకు గురైన మహిళ పాత్రలో జీనత్ అమన్ అద్భుత నటన ప్రదర్శించింది. ఫిలింఫేర్ ఉత్తమ నటి బహుమతికి జీనత్ అమన్ పేరు నామినేట్ అవగా బహుమతి మాత్రం ‘ఖూబ్ సూరత్’ సినిమాలో ఉత్తమ ప్రదర్శనకు రేఖాకు దక్కింది. ముక్కోణపు ప్రేమకథాంశంతో ఫిరోజ్ ఖాన్ నిర్మించిన ‘ఖుర్బాని’ (1980) చిత్రంలో డిస్కో డ్యాన్సర్ పాత్రను జీనత్ అమన్ పోషించింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో నాజియా హసన్ ఆలపించిన “ఆప్ జైసా కోయి మేరి జిందగీ మే ఆయే తో బాత్ బన్ జాయే” సూపర్ హిట్ కాగా, ఆ పాటకు డిస్కో డ్యాన్ చేసిన జీనత్ అమన్ కు చాలా మంచి పేరొచ్చింది. బినాకా గీత్ మాలా వార్షిక రేటింగు లో ఈ పాటకు నాలుగవ స్థానం కూడా దక్కింది. తరవాత జీనత్ అమన్ ఎఫ్.సి. మెహ్రా నిర్మించిన ‘ఆలీబాబా అవుర్ 40 చోర్’, రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన ‘దోస్తానా’, ప్రకాష్ మెహ్రా నిర్మించిన ‘లావారిస్’ సినిమాలలో నటించి విజయం సాధించింది. జీనత్ అమన్ హీరోయిన్ పాత్ర పోషించిన చివరి చిత్రం ‘గవాహి’ (1989) అనే కోర్టు రూమ్ డ్రామా. పదేళ్ళ విరామం తరవాత జీనత్ అమన్ ‘భోపాల్ ఎక్స్ ప్రెస్’ సినిమాలో కామియో పాత్ర పోషించింది. ఆ తరవాత ‘బూమ్’ (2003), ’చౌ రాహేన్’ (2007), ‘అగ్లీ అవుర్ పగ్లి’ (2008) సినిమాలలో సహాయక పాత్రల్లో నటించింది. B4U అనే టెలివిజన్ చానల్ లో ‘ఇన్ కాన్వర్జేషన్ విత్ జీనత్’ అనే దారావాహికం నిర్వహించింది.

విలక్షణ పాత్రల్లో…
జీనత్ కొన్ని వైవిధ్య పాత్రల్లో నటించి మెప్పుపొందింది. ’అజనబీ’ లో తన ఎదుగుదలకోసం గర్భస్రావం చేయించుకునేందుకు వెనుకాడని మహిళగా, ‘ప్రేమశాస్త్ర’ లోతన తల్లి ప్రేమించిన వ్యక్తితో ప్రేమలో పడిన వనితగా, ‘డూండ్’ లో వివాహేతర సంబంధం పెట్టుకున్న గృహిణిగా, ‘హరేరామ హరేకృష్ణ’ లో హిప్పీ సంస్కృతి కి బలైన అమ్మాయిగా జీనత్ అమన్ ఎంతగానో రాణించింది. 2008లో అటు ఫిలింఫేర్ వారి జీవన సాఫల్య పురస్కారాన్ని మరోవైపు జీ సినీ వారి జీవన సాఫల్య పురస్కారాలను జీనత్ అమన్ అందుకుంది.

వ్యక్తిగతం…
నటుడు ఫిరోజ్ ఖాన్ తమ్ముడు సంజయ్ ఖాన్ అంటే జీనత్ అమన్ కు వల్లమాలిన ప్రేమ. అయితే 1966లోనే సంజయ్ ఖాన్ కు జరైనీ ఖాన్ తో పెళ్లయింది. వారికి ముగ్గురు సంతానం కూడా. సంజయ్ ఖాన్ నిర్మిస్తున్న ‘అబ్దుల్లా’ సినిమా షూటింగ్ కోసం జీనత్ అమన్ రాజస్థాన్ లోనిన్ జైసల్మేర్ వెళ్ళింది. ఇద్దరి మధ్య ప్రేమ ముదరడంతో 1978లో అక్కడే ఇద్దరు సాక్షుల సమక్షంలో సంజయ్ ఖాన్ ను జీనత్ రహస్య వివాహం చేసుకుంది. సంజయ్ మాత్రం వారి పెళ్ళి విషయాన్ని దాటవేసినా, జీనత్ మాత్రం ఆ రహస్యాన్ని బహిరంగ పరచింది. అది రుచించని సంజయ్ తమ వివాహబంధాన్ని నవంబరు 24, 1979 న, అంటే… సంవత్సరం లోపే రద్దు చేసుకున్నాడు. అయినా సంజయ్ జీనత్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. జీనత్ ను ఎప్పుడు అనుమానిస్తూ అవమానానికి గురిచేసేవాడు. ‘అబ్దుల్లా’ సినిమా కథా చర్చల్లో పాల్గొనేందుకు హోటల్ కు రప్పించి అక్కడ స్నేహితుల సమక్షంలో ఆమెను కిరాతకంగా కొట్టాడు. దెబ్బలతో బాధపడుతున్న జీనత్ ను హోటల్ సిబ్బంది ఆసుపత్రి లో చేర్చారు. సంజయ్ మీద జీనత్ కేసు పెట్టింది. తనకు ఆసరా కరవైన పరిస్థితుల్లో టెలివిజన్ నటుడు మజర్ ఖాన్ ఆమెకు పరిచయమయ్యాడు. నిరాశకు గురైన జీనత్ 1985లో నటుడు మజర్ ఖాన్ ను వివాహమాడింది. ఈ సంబంధం జీనత్ తల్లికి కూడా ఇష్టం లేదు. మజర్ స్త్రీలోలుడని, వ్యసనాలకు బానిస అని అమన్ తెలుసుకునేలోపే ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లయింది. 1997 లో అతడినుంచి విడాకులు తీసుకుంది. అతనితో గడపిన 12 యేళ్ళ సంసార జీవితం నిస్సారమైనదిగా సిమి గారెవాల్ కు ఇచ్చిన ఒకానొక ఇంటర్వ్యూలో జీనత్ పేర్కొనడం గమనార్హం. 1998 లో మజర్ ఖాన్ మూత్రపిండ వ్యాధితో మరణించాడు. ఇంత వ్యధ భరించినా, జీనత్ అమన్ సంజయ్ ఖాన్ ను గాని, మజర్ ఖాన్ ను గాని, సమాజాన్ని కాని విమర్శించలేదు సరికదా, పల్లెత్తుమాట కూడా అనకపోవడం ఆమె ఎంతటి క్షమాగుణంగల మహిళో అనే విషయాన్ని తెలియజేస్తోంది. జీనత్ అమన్ కు జన్మదిన శుభాకాంలు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap