చరితార్థులకు అరుదైన నీరాజనం

నల్లగొండ సోదరుడు, శ్రీ కొండేటి నివాస్ తెలంగాణా రాష్ట్రావతరణ సందర్భంగా భాషా సాంస్కృతిఖ శాఖ సోజన్యంతో తెలంగాణా వైతాళికులకు అపురూపంగా నీరాజనం పలికడం విశేషం.

ఈ యువకుడు ఇప్పటికే గ్రానైట్ ఫలకాలపై రూప చిత్రాలు చెక్కడంలో పేరు పొందాడు. కాగా మనం సమైక్యాంధ్రలో ఉండగా వివిధ రంగాల్లోని మన పెద్దమనుషులు తగిన విధంగా పేరు, ప్రఖ్యాతి సంపాదించు కోకుండా చరిత్రలో సైతం విస్మ్రుతంగా ఉండిపోవడం మనకు తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం తిరిగి మన అస్తిత్వాన్ని సమున్నతంగా ఎలుగెత్తడం మొదలైంది. మన వైతాళికులను చెదిరిపోని విధంగా స్మరించుకోవడమూ ఆరంభమైంది. ఆ దిశలో సీనియర్ చిత్రకారులు శంభాజీ గారు తెలుగు మహా సభల సందర్భంగా రచించిన చిత్రలు లేదా భాషా సాంస్కృతిక శాఖా కార్యాలయంలో పెట్టిన చిత్ర రాజాలు..దాశరథి, జయశంకర్ సార్లవే తీసుకోండి అవి మనల్ని విస్మయానికి గురిచేస్తై. మిత్రులు అహోబిలం ప్రభాకర్ కాన్వాసుపై చిత్రించిన చిత్రాలు సాహిత్య అకాడమీలో కొలువు తీరడం, అవి క్యాలండర్ గా కూడా ఇంటింటికి చేరడం కూడా మరో గొప్ప ఆనందం. తాజాగా కొండేటి నివాస్ గ్రానైట్ ఫలకాలపై చిత్రించిన ఈ రూప చిత్రాలు మరో అరుదైన ఆవిష్కరణ.

అత్యంత శ్రమకోర్చి, ఎంతో నైపుణ్యంతో నివాస్ వేసిన దాదాపు నలభై రూపచిత్రాలు చక్కగా నల్లటి గ్రానైట్ ఫలకాలపై తెల్ల తెల్లగా మెరుస్తూ, కాల గమనంలో ‘మనదే విజయం’ అన్నట్టు నిశితంగా, హుందాగా మనల్ని చూస్తున్నట్టు ఉన్నాయ్.

ఈ ఫోటోలోని రూప చిత్రం మన కళా తపస్వి కాపు రాజయ్య గారిది. ఇలా ఒక్కో చిత్రాన్ని అపురూపంగా చెక్కి వాటిని అందంగా, ఈసిల్స్ పై ప్రదర్శనకు పెట్టాడు నివాస్. వాటిని మెల్లగా…ఒక్కో చిత్రాన్ని ఒక్కో నిమిషం అయినా చూడాలి. చూస్తే, అవి మన మనోఫలకాలపై చిరకాలం ముద్రితం అవుతాయా అనిపించేత బాగున్నాయి. ఇవన్ని దేశ విదేశీయులు, రాష్ట్ర ముఖ్యులు తరచూ కలుసుకునే చోటు, శాసనసభ లేదా సచివాలయం వంటి ఏదైనా ప్రతిష్టమైన స్థలంలో శాశ్వతంగా ప్రదర్శనకు ఏర్పాటు చేస్తే మరీ మంచిది.

రవీంద్ర భారతిలోని ఐ సి ఐ సి ఐ ఆర్ట్ గ్యాలరీలో కొలువు దీరిన ఈ ప్రదర్శనను జూన్ 2వ తేదీ సాయంత్రం టూరిజం శాఖా మాత్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించారు. జూన్ 6 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది అన్నాడు నివాస్. మరి ఒక సారి చూడండి. మన వైతాళికులకు నీరాజనం పలకండి. చిత్రకారుడి అరుదైన ప్రయత్నాన్ని అభినందించండి.

-కందుకూరి రమేష్ బాబు

SA: