పదునైన జ్ఞాపకం ఆఫ్సర్ కొత్త పుస్తకం

(ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది)
ఆలోచనాత్మక లోతైన రచయిత, పదునైన కత్తిలాంటి కవి ఆఫ్సర్. ఆయన పదేళ్ల పాటు శ్రమించి వెంటాడే అద్భుత పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది 1948 పోలీసు చర్యకు దర్పణం. మిలిటరీ ఆక్రమణ హింసకు సాక్ష్యం. ఇటీవల లా మకాన్ లో ఈ పుస్తకం పై ఆసక్తికర చర్చ జరిగింది. అమెరికా ఫిలడెలఫీయాలో ఉంటున్న ఆఫ్సర్ జూమ్ స్క్రీన్ లో చర్చలో పాల్గొన్నారు. మిత్రులు పాఠకులతో తన పుస్తకం వెనుక భావాలను వెల్లడించారు సూటిగా. 1948 హింస బాధితుల సాక్షులు, వారి కుటుంబ సభ్యుల కథనాలు ఈ తరానికి వాస్తవ కోణాన్ని ఆవిష్కరించాయి.

ఆనాటి పోలీస్ దుశ్చర్య ముస్లిం ల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో కళ్ళకు కట్టించారు. ఎందరో ముస్లిం లను రజాకార్లు గా ముద్ర వేయడంతో ఉపాధి కోల్పోయిన వైనం ఆఫ్సర్ జల్లెడ పట్టి మరీ చూపించారు. విస్తృత దక్కనీ చరిత్ర ఇది. 330 పేజీల ఈ పుస్తకాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించడం విశేషం.
2002 గుజరాత్ అల్లర్ల తరువాత ఆఫ్సర్ ముస్లిం జీవితాలపై, వారి త్యాగాలపై పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే అతనికి 1948 పోలీసు చర్య బాధితులు తారస పడ్డారు. అవి దాచేస్తే దాగని వాస్తవాలు. ఆ నిజాలను ఆ తరానికి గుర్తు చేయాలని, ఈ తరానికి తెలియచేయాలని పుస్తకం గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లకు పుస్తకం వెలుగులోకి వచ్చింది. 1948 సెప్టెంబర్ 13నుంచి 17 వరకు జరిగిన పోలీస్ చర్య. ఆనాటి ఐదు రోజుల క్రూరమైన యుద్ధం, బాధితుల కథనాలతో అద్భుతంగా వెంటాడే చరిత్రను పుస్తకంగా అందించారు. అందరూ చదవాల్సిన పుస్తకం. ప్రతి ఇంట్లో దాచుకుని రానున్న తరానికి కూడా అందించి చరిత్రను గుర్తు చేయాల్సిన పుస్తకం ఇది.

Remaking History
…1948 Police Action and the Muslims of Hyderabad. ఈ పుస్తకం ఇంకా హైదరాబాద్ లో విడుదల కాలేదు. విడుదల చేయడానికి జనవరిలో రానున్నట్లు ఆఫ్సర్ తెలిపారు. అమెజాన్ లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది కొనుక్కోవచ్చు. ధర 1225 రూపాయలు. కేంబ్రిడ్జి ప్రెస్ డిస్ట్రిబ్యూటర్స్ కు bookwellpub@gmail.com కు mail రిక్వెస్ట్ చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

డా. మహ్మద్ రఫీ

SA: