విజయవాడలో ఆవిర్భవించిన నవ్యాంధ్ర రచయితల సంఘం

విజయవాడ బందరురోడ్డులోగల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకలు సెప్టెంబరు 8వ తేదీ ఉదయం 10 గంటలకు మొదలయ్యాయి. రెండు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో మొదటిరోజు వేడుకలకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనం చేసి వేడుకల్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ- ఈ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరూ సమర్థులేనన్నారు. ఒకరు శబ్దమైతే, ఇంకొకరు నిశ్శబ్దమన్నారు. ఇతరుల దుఃఖాన్ని కవిత్వం చేసే రచనలు రావాలని, అటువంటి రచనలు చేసే కవుల్ని, రచయితల్ని తయారు చేయాల్సిన బాధ్యతను నవ్యాంధ్ర రచయితల సంఘం భుజానికెత్తుకోవాలని అన్నారు. ప్రతిది వ్యాపార లక్షణాల్ని పులుముకుంటున్న నేటి తరుణంలో కవులు స్పందించాల్సిన అవసరం వుందన్నారు. క్రమశిక్షణ లేనివారు పరిపాలకులుగా వస్తే దేశం నాశనమవుతుందన్నారు. నాన్న నాకిచ్చిన నిన్నటి సూటు నాకు పనికిరానప్పుడు వేల సంవత్సరాలనాటి ఆచారాలు నేటికీ ఆదర్శాలుగా తీసుకోవడం నిరంకుమన్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం సూచించే వ్యక్తులుగా కవులు ఎదగాలన్నారు.


తెలంగాణ రచయిల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ-తెలుగు రాష్ట్రం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నేపథ్యంలో నవ్యాంధ్ర రచయితల సంఘాన్ని పునరుద్ధరణ సంఘంగా భావిస్తున్నానన్నారు. నిర్మాణాత్మకమైన ఉద్యమంగా ఈ సంఘాన్ని నడపాలని, నవ్యాంధ్రను జల్లెడ పట్టే రచనలు చేసే యోధులుగా రచయితల్ని, కవుల్ని తయారు చేయాలని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ మాట్లాడుతూ- అక్షర యోధులతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని, అలాంటి అక్షర యోధులైన కొత్త కవుల్ని, రచయితల్ని తయారు చేసే కార్ఖానాగా నవ్యాంధ్ర రచయితల సంఘం పనిచేస్తుందన్నారు. కవి విశ్వయాత్రికుడని చెబుతూ, కవి ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని, ఒక సాహితీ సంఘంలో సభ్యుడైనంత మాత్రాన మరొక సాహితీ సంఘం చేసే కార్యక్రమాలకు హాజరు కాకూడదని ఏ చట్టంలో లేదన్నారు. సాహిత్యం విశ్వజనీనమైనదన్నారు. అలా వెళ్ళద్దని చెప్పే సాహితీ సంఘాల నియంతృత్వ పోకడల్ని ఆయన ఖండించారు. సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ- సంఘం ఏర్పాటు నేపథ్యాన్ని వివరించారు. ఈ సంఘంలో సభ్యులుగా చేరిన వారికి ఎక్కడా లేనివిధంగా ప్రమాద భీమా ఏర్పాటు చేశామన్నారు.

మరొక అతిధి పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ- రచయితల సంఘాలు ఎన్ని వున్నప్పటికీ భాష, సాహితీ సేవ చేసేందుకు కొత్త సంఘాల అవసరం తప్పక వుంటుందన్నారు. ఆ దిశగా ఏర్పడిందే ఈ సంఘమని నా వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
మరొక అతిధి నవలా రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ- తెలుగు భాషోద్యమానికి భౌగోళిక ఎల్లలను చెరిపేసి ఒక మహోన్నత ప్రయత్నం జరగడాన్ని ఆహ్వానిస్తున్నానన్నారు. తెలుగు భాష ప్రమాదంలో పడిన, తెలుగు భాషలోని రచనలను చదివే గుణం క్షీణిస్తున్న ప్రమాదకర తరుణంలో అందరి లక్ష్యం భాషాభ్యుదయమే అయినప్పుడు ఎన్ని సంఘాలు ఏర్పడినా తప్పు లేదన్నారు.
మరొక అతిధి లయన్ విజయకుమార్ మాట్లాడుతూ- రచయితలు, కవులు మేధావి వర్గానికి చెందినవారన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ సభలో పాల్గొనటం సంతోషంగా వుందన్నారు. మనిషి తనకు కావలసినంత తన దగ్గర వుంచుకుని మిగతాది దానం చేయాలన్నారు. అప్పుడే మనుషుల్లో మానవత్వం, సమానత్వం పెరుగుతుందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ చైర్మన్ కాంతికృష్ణ మాట్లాడుతూ- తెలుగుభాషను ఒక ఉద్యమంగా నడిపిన గిడుగు రామ్మూర్తి వారసురాలిగా నేను ఈ సంఘాన్ని ఆహ్వానిస్తున్నానన్నారు. తెలుగు భాషకు ఈ సంఘం సంపూర్ణ సేవ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంఘం సీఈవో చిన్ని నారాయణరావు మాట్లాడుతూ- వేయి పూలు వికసించనీ అన్న కవి మాటలు ఆచరణీయమన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం ఏర్పాటుతో సాహితీరంగానికి, కవులకు, రచయితలకు మరింత మేలు జరుగుతుందన్నారు. సంఘం ఉపాధ్యక్షులు శ్రీరామకవచం సాగర్ మాట్లాడుతూ- సంఘం ఎన్నో మంచి ఉద్దేశాలతో, మంచి లక్ష్యాలతో పాల్గొనటం సంతోషంగా, కవులు మేధావి వరానికి గతాది దానం చేరచయితల సంక్షేమాన్ని కోరుతూ ముందడుగు వేస్తుందన్నారు. అధ్యక్ష కార్యదర్శులు నిబద్ధత అందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సాయంత్రం జరిగిన సభకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజామాస్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ- కవుల పుస్తకాల కొనుగోలు విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ఈ సభలో బిక్కి కృష్ణ చిన్ని నారాయణరావు, శ్రీరామకవచం సాగర్, కలిమిశ్రీ పాల్గొన్నారు నవ్యాంధ్ర రచయితల సంఘం…మహోదయం’ అంటూ బిక్కి కృష్ణ రాసిన నవ్యాంధ్ర రచయితల సంఘం ఉద్యమ గీతాన్ని డా.యం.బి.డి.శ్యామల పాడి అందర్నీ ఆకర్షించారు. ఈ సందర్భంగా 300 కవితల పండుగలో భాగంగా తొలిరోజు 125 మంది కవులు తెలుగుభాషపై రాసిన తమ కవితల్ని వినిపించారు. ఎవరో ఒకరి పక్షపాత వహించకుండా మంచి సాహిత్యం రాదు నవ్యాంధ్ర రచయితల సంఘం ఆవిర్భావ వేడుకల రెండవరోజు సభలో జి.లక్ష్మీనరసయ్య వేడుకల రెండవరోజు ఉదయం జరిగిన సభకు ముఖ్య అతిధిగా సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనరసయ్య. హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ- చేతికి మట్టి అంటకుండా పంట పండించడం ఎలా సాధ్యం కాదో ఎవరి మనసును నొప్పించకుండా, ఎవరో ఒకరి పక్షపాతం వహించకుండా మంచి సాహిత్యం రాదన్నారు. రెండు వర్గాలుగా చీలిపోయిన సమాజంలో కవి పీడితుల పక్షాన వుండాలన్నారు. కవులు, రచయితలు సమాజాన్ని మౌలికంగా మార్చుకోవాల్సిన అవసరం వుందన్నారు. మీదైన అలజడి, ఆందోళనల నుండి అక్షరాలు బయటికి రావాలని కవులకు ఆయన సూచించారు. మరో అతిధి రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ- నవ్యాంధ్ర రచయితల సంఘం సవ్యాంధ్రగా సాగాలన్నారు. ప్రగతి శీల భావజాలాన్ని, సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళే దిశగా ఈ సంఘం అడుగులు వేయాలన్నారు. అక్షరం ఆయుధంగా, ఆశయం కేతనంగా ముందుగా సాగాలని ఆయన సూచించారు. నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ మాట్లాడుతూ- వర్క్ షాపుల పునాదుల పై గొప్ప కవుల నిర్మాణాలను రూపొందిస్తామన్నారు. డా. రావిరంగారావు మాట్లాడుతూ- కవిత్వ వ్యక్తీకరణలో దృష్టికోణంలో మార్పు తెచ్చే దిశగా కవుల్ని తయారు చేయడంలో సంఘం గొప్పతనం వుందన్నారు. ఏపీజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు మాట్లాడుతూ- కవులు తమ రచనల ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపాలన్నారు. సంఘం సీఈవో చిన్ని నారాయణరావు సభకు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ సభలో రచయిత ఎం.వి.జె.భువనేశ్వరరావు, డా. రావి రంగారావు, తూమాటి సంజీవరావు, గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కాంతికృష్ణ, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, నవలా రచయితలు పి.చంద్రశేఖర అజాద్, శ్రీరామకవచం సాగర్, కె.శాంతారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన 300 కవితల పండుగలో అనంతపురం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, ప్రొద్దుటూరు, చిత్తూరు మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కవులు తెలుగుభాష ప్రాశస్త్యం పై తమ కవితల్ని వినిపించారు.

SA: