దివ్య లోకాలకేగిన ‘ద్వివేదుల’

చిత్రకారుడు, రచయిత ద్వివేదుల సోమనాథ శాస్త్రి నవంబర్ 8 వ తేదీన విశాఖపట్నం లో కన్నుమూశారు.

అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆంధ్ర జానపద చిత్రకారుడు అంట్యాకుల పైడిరాజు ప్రియశిష్యులు ద్వివేదుల సోమనాథ శాస్త్రి. వీరు విజయనగరంలో 1932లో జన్మించి చదువుతూనే అంట్యాకుల వద్ద చిత్రలేఖనం నేర్చుకొన్నారు. 1953లో డ్రమ్ రిపేరు, హాంవర్టుడినే వీరి చిత్రాలు లండన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఆర్టులో ప్రదర్శింపబడ్డాయి. 1954లో రైల్వే ఉద్యోగం రావడంతో కలకత్తా వెళ్లారు. వృత్తిపరంగా చిత్రకళకు, ఉద్యోగానికి సంబంధం లేకపోయినా, చిత్రకల పై ఆసక్తితో అక్కడ ప్రఖ్యాత చిత్రకారులు జమినీరాయ్, అతుల్ బోస్, కళ్యాణ్ సీన్ తదితరుల్ని కలుసుకొని చిత్రకళారీతుల్ని తెలుసుకొన్నారు. తర్వాత మద్రాసు వెళ్లి దేవిరాయ్ ప్రసాద్ చౌదరి, పిలకాదంపతులు, శ్రీనివాసులతో పరిచయం చేసుకొన్నారు. రైల్వే సంస్థ ప్రతిసంవత్సరం నిర్వహించే వారోత్సవాల్లో పాల్గొంటూ ఢిల్లీ, కలకత్తా, విశాఖ, విజయనగరం, రాయ్ పూర్, ఖర్గపూర్ లో వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు.

Painting by Sastry

1960లో రైల్వే నిర్వహించిన భద్రతా చిత్రాల పోటీలో జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతి గెలుపొందారు. వీరి చిత్రాలు భారతి, గృహలక్ష్మి, ఆంధ్రప్రభ పత్రిక తదితర పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వీరు చిత్రకారులేకాదు. రచయిత కూడా. 250 కథలు, ఐదు నవలలు, 16 నాటికలు, అనేక వ్యాసాలు రచించారు. వీరి కథలకు కథా సంపుటాలకు అనేక బహుమతులు వచ్చాయి. 1987 లో వీరిని విజయనగరంకు చెందిన వెలుగు, భావన సంస్థలు, 1997లో అబ్బూరి కళాక్షేత్రం విశాఖ, 2000లో విశాఖ కల్చరల్ అకాడమీ, 2002లో చిత్రకళాపరిషత్ విశాఖ తదితర సంస్థలు సత్కరించాయి. అమెరికాలో తెలుగు అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్లో జరిగిన చిత్రకళా ప్రదర్శనలో వీరిని ఘనంగా సన్మానించింది. వీరు రచించిన అంట్యాకుల పైడిరాజు గారి జీవిత చరిత్రను ‘పిపాసి’ పేరుతో రాయగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించారు.

-సుంకర చలపతిరావు

సోమనాథ శాస్త్రి గారితో సుంకర చలపతిరావు
SA: