భరత్ భూషణుడికి అవమానం ?

(తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తన కెమెరా ద్వారా, తన చిత్రకళ ప్రతిభ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసాడు భరత్ భూషణ్)

నేను డబుల్ బెడ్ రూమ్ లను తక్కువ చేయడం లేదు. డబుల్ బెడ్ రూమ్ లు ప్రభుత్వం కేటాయిస్తున్నది అట్టడుగు నిరుపేద వర్గాల వారికి. అందులో ఒక ఫోటో ఉద్యమకారుడు, తెలంగాణ చిత్రపటాన్ని కెమెరాలో బంధించి ప్రపంచానికి చూపించిన మేధావి భరత్ భూషణ్ ను ఆ నిరుపేద ల్లోకి చేర్చి గొప్ప మెహర్బాని చేసిన బిల్డ్ అప్ నచ్చడం లేదు. ఒకవైపు క్యాన్సర్ తో పోరాడుతూనే తెలంగాణ రాష్ట్రం కోసం దునుమాడిన ఫోటో జర్నలిస్ట్ ఆయన. పైగా ఆయన ఇప్పుడు లేరు. వారి కుటుంబానికి గౌరవంగా ఎక్కడో చోట స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇస్తే ఏం పోయింది?

పద్మశ్రీ వచ్చిన కళాకారులు ఇద్దరూ కష్టాల్లో ఉన్నారని తెలిసి స్థలం కేటాయించి, ఇంటి నిర్మాణం కోసం కోటి రూపాయలు కేటాయించారుగా. భరత్ భూషణ్ ఏం తక్కువ? తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కెమెరా ద్వారా, తన చిత్రకళ ప్రతిభ ద్వారా తన వంతు ప్రపంచానికి పరిచయం చేసాడుగా. బతుకమ్మ అంటే, బోనాలు అంటే…ఇప్పుడు కాదు, గత నాలుగు దశాబ్దాలుగా భరత్ భూషణ్ ఫొటోలే గుర్తుకు వస్తాయి. తెలంగాణ పల్లెలు అంటే ఆయన తీసిన ఇంటి దర్వజాలే జ్ఞప్తికి వస్తాయి. తెలంగాణ మట్టిని, తెలంగాణ సోయిని, తెలంగాణ బతుకు ను ఆయన కెమెరాలో బంధించాడు. తెలంగాణ ఉనికిని చాటి చెప్పాడు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమ ఛాయా చిత్రాలకు సాక్ష్యంగా నిలిచాడు.

భరత్ భూషణ్ చివరి దశలో ప్రభుత్వం స్పందించి కొంత ఆర్ధిక సాయం అందించింది. ఆసుపత్రి ఖర్చులు భరించింది. సాంస్కృతిక శాఖ రెండు మూడు దఫాలు అతని ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ధికంగా ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ కేటాయించి ఒక గొప్ప పోరాట ఛాయా చిత్రకారుడ్ని అవమానించింది. అలా అని నేను డబుల్ బెడ్ రూమ్ లను, అవి అందుకున్న లబ్ది దారులను తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు కానీ, ఒక మహోన్నత ఉద్యమ కారుడ్ని అవమానించారని బాధ పడుతున్న. కాస్త గౌరవంగా స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సహకారం అందించి ఉంటే ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని ప్రతి ఒక్కరూ అభినందించి ఉండే వారు. మరి, డబుల్ బెడ్ రూమ్ చాలు అని ఎవరు సలహా ఇచ్చారో వారికో దండం.
భరత్ భూషణ్ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండే వారు. ఏదొక ఫంక్షన్ లో నాకు తెలియకుండా నా ఫోటోలు తీసి మరుసటి రోజు పంపించి సర్ ప్రైజ్ చేస్తుండే వారు. ఆయన విలక్షణ ప్రేమికుడు. సలక్షణ ఫోటో పాత్రికేయ రచయిత. ఫోటోగ్రఫీ అంటే ఆయన దృష్టిలో మహా చిత్రకళ. తెలంగాణ సంస్కృతిని ఫోటోల రూపంలో అందించి చరిత్ర సృష్టించారు.

డా. మహ్మద్ రఫీ

SA: