పుస్తకాల పండుగ

(జనవరి 3 నుండి 12 వరకు విజయవాడ పుస్తక ప్రదర్శన సందర్భంగా)

జనవరి!
– అనగానే మనకు జ్ఞాపకం వచ్చేవి – నూతన సంవత్సరాది, సంక్రాంతి, రిపబ్లిక్ దినోత్సవం – జాతీయ స్థాయి పండుగలే !
కాని, జనవరి అనగానే విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక ప్రత్యేకమైన – విశిష్టమైన – “పండుగ” జ్ఞాపకం వస్తుంది! అది – పుస్తక మహోత్సవం! తక్కిన పండుగలు ఒక రోజో రెండు రోజు మహా అయితే మూడు రోజులో వుంటాయి. కాని, ఈ పండుగ పదకొండు రోజులపాటు జరుగుతుంది. దేశంలోని వివిధ గ్రంథ విక్రయ సంస్థలు తమ పుస్తకాలను ఈ మహోత్సవంలో ప్రదర్శిస్తాయి.
ఈ పుస్తక మహోత్సవం విద్యార్థులకు, విజానార్డులకు కల్ప వృక్షం వంటిది. ప్రతి సంవత్సరం జనవరి 1వ (ఈ సంవత్సరం జనవరి 3 న ) తేదీన ప్రారంభమయ్యే ఈ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో అడుగిడగానే వివిధమైన ‘బుక్ స్టాల్స్’ కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఎక్కడా లభ్యం కాని – ఎక్కడో కాని లభించని – అపురూప గ్రంథాలు ఇక్కడ లభిస్తాయి. తమ విజ్ఞానాన్ని, వివేచనను పెంపొందించుకొనగోరే వారికి ఈ “పుస్తకాల దర్బార్” కొంగు బంగారం లాంటిది.
నా మటుకు నేను నా విజ్ఞానాన్ని ఏ కొంచమైనా పెంచుకున్నానంటే, అందుకు ఈ పుస్తకాల దర్బార్‌లో ప్రతి సంవత్సరం కొన్ని సాయం సమయాలు గడపడమే కాక, కొన్ని అమూల్యమైన నా కలానికి, గళానికి తోడ్పడే పుస్తకాలను సేకరించడమే కారణం.
టి.వి.లు వచ్చిన తరువాత, ఇంటర్నెట్ లో సోషల్ మీడియా మాధ్యమం ప్రవేశంతో పుస్తక పఠనం కొంత తగ్గే అవకాశం వున్నది కాని, విజయవాడలో 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ వార్షిక పుస్తకాల దర్బార్ ప్రజలలో పుస్తక పఠనాసక్తిని పెంపొందిస్తున్నది. పుస్తక ప్రియుల విజ్ఞాన పిపాసను చాలా వరకు తీరుస్తున్నది. పుస్తక మహోత్సవంలో కొన్ని కొత్త గ్రంథాల ఆవిష్కరణోత్సవాలు, ప్రఖ్యాత సాహితీవేత్తలు, రచయితల జయంత్యుత్సవాలు జరగడం ఒక ఆకర్షణ అయితే, జనవరి 7వ తేదీన జరిగే పుస్తక ప్రియుల పాదయాత్ర మరో పెద్ద ఆకర్షణ. నవరాత్రులకు కొన్ని వస్తువుల ధరల తగ్గింపు వలె పుస్తక మహోత్సవాలలో అన్ని పుస్తకాల కొనుగోలుదార్లకు ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వడం వేరొక ఆకర్షణ.
గడచిన 30 సంవత్సరాలుగా ఈ పుస్తకాల దర్బార్‌ను జయప్రదంగా, పుస్తక ప్రియుల మానసోల్లాసంగా నిర్వహిస్తున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.
– తుర్లపాటి కుటుంబరావు

SA: