ఆనందం కోసమే కార్టూన్స్ వేస్తున్నా-సాయిరాం

సాయిరాం పేరుతో కార్టూన్లు గీస్తున్న వీరి పూర్తి పేరు పొన్నగంటి వెంకట సాయిరాం. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు తాలూకా, చిన్నపడుగుపాడు వీరి స్వస్థలం. అన్నపూర్ణ, కృష్ణమూర్తి దంపతులకు ఆగస్టు 7, 1957 సంవత్సరములో జన్మించారు. నెల్లూరు నందలి వి.ఆర్.కాలేజ్ నుండి బి.కామ్., మరియు బి.ఎల్., డిగ్రీలు పొందియున్నారు.
1973 వ సంవత్సరం నుండి కార్టూన్స్ వేస్తున్న వీరి మొట్టమొదటి కార్టూన్, జ్యోతి మాస పత్రిక నందు ప్రచురితమైనది. ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారికి ఏకలవ్య శిష్యునిగా చిరపరిచయస్తుడు. శ్రీ జయదేవ్ గారు నాడు పత్రికల్లో అచ్చవుతున్న, తన కార్టూన్లు చూసి ముచ్చటపడి, మరిన్ని నాణ్యమైన కార్టూన్లు వేయడానికి, వీరికి సలహాసూచనలిస్తూ, మద్రాసు నగరం నుండి పోస్టు ద్వారా యెన్నో సలహాలు తనకందించే వారని సగర్వంగా చెప్పుకుంటారు. శ్రీ జయదేవ్ గారు ఇప్పటికీ తనకు కార్టూన్ల విషయమై యెన్నో సలహాలిస్తూనేవుంటారని, వారికి ఆజన్మాంతం ఋణపడివుంటానని అంటారు. కారణాంతముల వలన, 1989వ సంవత్సరము నుండి కార్టూన్లకు విరామం ఇచ్చారు. మళ్ళీ 2019 నుండి సామాజిక మాద్యమాలలో తన కార్టూన్లుతో దర్శనమిస్తున్నారు. 1973-89 మద్య కాలంలో, జ్యోతి, స్వాతి, యువ, ఆంధ్ర ప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర సచిత్ర వార పత్రిక, ఆంధ్రభూమి, విజయ, నీలిమ, హాస్యప్రభ, చార్వాక, మిలియన్ జోక్స్, ముత్యాలసారం తోపాటు తెలుగుభాషలో విడుదల అవుతున్న అన్నీ పత్రికల్లో తన కార్టూన్స్ లతో అలరించారు. అప్పట్లో సీనియర్ కార్టూనిస్ట్లు జయదేవ్, చంద్ర, బాలి, మోహన్, మల్లిక్, రామకృష్ణ, ప్రభంజన్, రుక్మిణీ, శశిధర్, శంకు, రాగతిపండరి, సుభాని, అరుణ్, శేఖర్, ప్రసాద్ కాజ, బాచి కార్టూన్స్ మద్య ఆరోగ్యకరమైన కార్టూన్స్ వేసినందుకు ఆనందంగా వుందని అంటారు.
తను 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి దశనుండి చిత్రలేఖనం లో జాతీయ స్థాయి బహుమతులు అందుకున్నారు. రంగులుతో విందులు చేయాలని వున్నా, చిత్రమైన వంకరటింకర లైన్లతో నవ్వులు పూయించే కార్టూన్స్ అంటే ఇష్టం పెరిగి కార్టూన్స్ గీయడం మొదలైంది. కార్టూన్ రంగంలో అప్పట్లో కాంపిటేషన్లు తక్కువగా వున్నను, పలుమార్లు విజేతగా నిలిచారు.
సింహపురి క్రోక్విల్లర్స్ పేరున, నెల్లూరు నుండి రాంప్రసాద్, కోలపల్లి, శ్రీధర, రవి, సుకుమార్, రాంశేషు, సీనియర్ శ్రీధర్, మాంట్ క్రిస్టో, పెండేలా, పెరుగు రామకృష్ణ, కే.సి. లలిత మరియు కోవూరు నుండి తోటి కార్టూనిస్టులు, లక్ష్మి భాస్కర్, దొరశ్రీ, తమ్ముడు సాయికృష్ణ, కృష్ణ, పడాల, వి.రామకృష్ణ లతో కార్టూన్ అసోసియేషన్ గా యేర్పడి పలుమార్లు “కార్టూన్ షో” అని కార్టూన్ ఎగ్జిబిషన్ 3 పర్యాయాలు నిర్వహించి జయదేవ్ గారి ఆధ్వర్యంలో, సోదర కార్టూనిస్టులతో కలసి బహుమతులు పంపిణీ చేసినట్లు తెలియ చేశారు.
ప్రస్తుతం, గురుత్యులు జయదేవ్ గారు, తమ్ముడు సాయి, దొరశ్రీ ఇతర మిత్రులు ఉత్సాహాన్ని నింపగా మళ్ళీ తన ఆనందం కోసం కార్టూన్స్ వేస్తున్నానని తెలియ చేశారు.
-కళాసాగర్

SA:

View Comments (4)

  • Namasthe Sai garu...! Mi Cartoons chaala baavuntaayi. Congratulations....Bachi

  • మీ పరిచయం, వ్యాసం చాలా బాగుంది సాయిరాం గారూ..అభినందనలు మీకు.

  • సాయిరాం గారు మీ పోర్ట్రిస్,కార్టూన్స్ బాగుంటాయి