కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు

*రాధ రాజారెడ్డి దంపతులకు అకాడమీ రత్న పురస్కారం
ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ 2022, 2023 సంవవత్సరాలకు అకాడమీ రత్న ఫెలోషిప్, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు, బిస్మిల్లాఖాన్ యువ ప్రతిభ అవార్డులు ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 16 మంది కళాకారులకు పురస్కారాలు లభించాయి. ఫెలోషిప్ అకాడమీ రత్న పురస్కారం విఖ్యాత కూచిపూడి నాట్య గురువులు పద్మభూషణ్ రాధ రాజారెడ్డి దంపతులకు లభించింది. ఈ పురస్కారం కింద మూడు లక్షల రూపాయలు నగదు, తామ్రపత్రం అందిస్తారు.
2022వ సంవత్సరానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాలు ప్రముఖ నాట్య గురువులు మంజుల రామస్వామి (భరతనాట్యం), డా. భాగవతుల సేతురామ్ (కూచిపూడి), మందా సుధారాణి (సంగీతం), ఉస్మాన్ మీర్ (సృజనాత్మక ప్రయోగ సంగీతం) లకు లభించాయి.

2023వ సంవత్సరానికి ప్రముఖ నాట్య గురు డా. మద్దాలి ఉషా గాయత్రి (కూచిపూడి), ఎల్.వి. గంగాధర్ శాస్త్రి (భక్తి సంగీతం), పేరిణి ప్రకాష్ (పేరిణి నాట్యం) లకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డులు ప్రకటించారు. నాటక రంగం నుంచి రాజీవ్ వర్మ, మేకప్ రంగం నుంచి బి. మల్లికార్జునరావు లకు లభించాయి. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నగదు, తామ్రపత్రం బహూకరిస్తారు.

బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలను 2022వ సంవత్సరానికి గాత్రం లో శ్వేత ప్రసాద్, కె. గాయత్రిలకు ప్రకటించారు. కూచిపూడి నాట్య రంగం నుంచి టి. రెడ్డి లక్ష్మి ఎంపికయ్యారు. 2023వ సంవత్సరపు బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం ఎం. సురేంద్రనాథ్(కూచిపూడి) ఎంపికయ్యారు. జానపద రంగం నుంచి అంగడి భాస్కర్ (డప్పు)కు ప్రకటించారు. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు నగదు అందిస్తారు.

డా. మహ్మద్ రఫీ

SA: