ఎందరో యువ కళాకారులకు స్ఫూర్తి – కృష్ణ’మూర్తి’

(అక్టోబర్ 11 న నరసాపురంలో కన్నుమూసిన ‘మూర్తి ఆర్ట్స్’ కృష్ణ’మూర్తి’ గారి గురించి…)

కమర్షియల్ ఆర్ట్ అంటే ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉండేది. ప్రతీ పట్టణానికి ఇద్దరు – ముగ్గురు కమర్షియల్ ఆర్టిస్టులు వుండేవారు. నగరాల్లో అయితే పదుల కొద్దీ వుండేవారు. షాపులకు సైన్ బోర్డుల దగ్గర నుండి వాల్ పబ్లిసిటీ, బేనర్ల వరకూ వీరే రాసేవారు. వినియోగదారుల్ని ఆకర్షించే విధంగా రకరాకాల స్టైల్స్ లో అక్షరాలను వ్యాపారానికి తగ్గ దేవుళ్ళ బొమ్మలతో సైన్ బోర్డులను రూపొందించేవారు. ఇందులో కొందరు అద్భుతమైన పనితం చూపించేవారు. అలా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 1970 ప్రాంతంలో కమర్షియల్ ఆర్ట్ ను కొత్తదారులు పట్టించిన ఆర్టిస్ట్ కీళ్ళ కృష్ణమూర్తి గారు. మూర్తి ఆర్ట్స్ పేరుతో నాలుగు దశాబ్దాల పాటు ఒక నరసాపురంలోనే కాకుండా పక్క జిల్లాలలోనూ గుర్తింపు తెచ్చుకున్న మూర్తి గారు ఎందరో యువకులకు స్పూర్తిగా నిలిచి వారిని ఉత్తమ చిత్రకారులుగా తీర్చిదిద్దారు. వారిలో ప్రముఖ సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు, ‘ఈనాడూ దిన పత్రిక చీఫ్ ఆర్టిస్ట్ రవి కిషోర్ గారు, మరో సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ నాగబాబు గారు వున్నారు.

కడలి సురేష్ గారు పదేళ్ళ వయసులోనే మూర్తిగారి దగ్గర శిష్యరికం చేశారు. రవి కిషోర్ గారయితే నరసాపురంలో ఇంటర్మీడియేట్ చదువుతూ మూర్తి గారి దగ్గర సినీ స్లైడ్స్ రూపొందించడంలో మెళకువలు, లెటరింగ్ నేర్చుకున్నారు.
16 జనవరి 1944 సం. నరసాపురంలో జన్మించిన కీళ్ళ కృష్ణమూర్తి గారు లంక ముత్యంగారి దగ్గర కమర్షియల్ ఆర్ట్ లో శిక్షణ పొందారు. మూర్తిగారు పోట్రైట్స్ చిత్రణలో అద్భుతమైన ప్రతిభ కనపరిచేవారు. చిలకలపూడి నగల వ్యాపార ప్రకటనలు రూపొందించదానికి మచిలీపట్నం వేళ్ళేవారు. వీరికి నలుగురు కుమారులు. మూర్తిగారు 2018 సం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం నారా చంద్ర బాబునాయుడుగారి చేతుల మీదుగా, గాయకులు ఎస్.పి. బాలు గారు – నరసాపురం ఎం.ఎల్.ఏ. బండారు మాధవ నాయుడు గారి చేతుల మీదుగా బాపు పురస్కారం అందుకున్నారు.

-కళాసాగర్
(పైన చిత్రంలో మూర్తిగారితో పి.ఎస్.బాబు, కడలి సురేష్, పినిసెట్టి గార్లు.)

SA:

View Comments (1)