అపర్ణ కుంచెకు అర్థాలెన్నో… !

వేసవి వచ్చి ఖాళీ అయిన వసంతంలా, ఉత్సాహం కరువైన స్త్రీలో ఎడారి పాలైన స్త్రీత్వంలా, ఒక వింతైన నిరాశక్తి నిర్వచనంలా ఉంటాయి అపర్ణా కౌర్ చిత్రాలు. స్వయంకృషితో కళాకారిణి అయిన అపర్ణ శిల్పకళ ద్వారా కళాప్రపంచానికి చేరువైంది. ఆమె తల్లి అజీత్ కౌర్ సాహితీవేత్త ఆమె రాసిన ‘హోమ్స్’ అనే పంజాబీ నవలకి పురస్కారం లభించింది. తల్లి నుంచి అందిన కళాప్రేమ ఈమెలో చిత్రకళ పట్ల మక్కువ పెంచింది. ఒంటరివారైన తల్లీకూతుళ్ళు ఢిల్లీలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో కూడా కొంతకాలం ఉన్నారు. చిన్నతనాన చూసిన జీవితం నిరాశ నిస్పృహలకి నిర్వచనం నేర్పినా, తల్లి సాహిత్య సాంగత్యంలో 17, 18వ శతాబ్దాల కళలతో పరిచయం ఏర్పడింది. అందమైన పహారి పెయింటింగ్ శైలికి, కబీర్ దోహి తత్వం చేర్చి మరో అర్థాలు సృష్టించింది అపర్ణ.

అపర్ణ చిత్రాలు, తన స్వంత అనుభవాలను, సాంఘిక అవస్థను కలిపి చెప్తున్న వ్యాఖ్యల్లా ఉంటాయి. మన శరీరానికి ఎన్నో రకాల అర్థాలుంటాయని తెలిపింది. కబీర్ కవితకు మల్లే మన శరీరం ఒక వస్త్రం వంటిదనీ, మనం వస్త్రం మార్చినట్టే…. మన జన్మలూ మారుతాయనీ చెప్పింది. మన శరీరం కూడా ఈ సమాజం వంటిదే అంటాయి అపర్ణ చిత్రాలు.
వలస వచ్చి స్థలాలు మారుతూ, భవన నిర్మాణాలు చేసి నివశించే మనుషులకు మల్లే ఆలోచనలు, అనుభవాలూ, మన శరీర ఆధారంపై కాపురముంటాయి.

artist Aparna

స్త్రీని, చిన్నపిల్లగా, నడి వయస్కురాలిగా, విధవరాలిగా, ప్రకృతి – భూమితో పోల్చి చూపింది. కృష్ణుడి కోసం వేసి చూసే గోపికలు అనే భారతీయ సంప్రదాయ లఘు చిత్రాల ఆధారంగా వేసిన ఈమె చిత్రంలో, నడి వయసు విధవరాళ్ళు, మెలికలు తిరిగి వంక పోయిన బృందావనంలోని చెట్ల వైపు ఎదురు చూస్తుంటారు. ‘నారీ కుంజరం’ అనే మరో సాంప్రదాయ చిత్రం ఆధారంగా వేసిన ఈమె చిత్రంలో బాధగా మెలి తిరిగిన శరీరంతో ఒక స్త్రీ ఈ సమాజపు బరువు బాధ్యతలని తానుగా మోస్తుంది.
ఈమె తన చిత్రాల ద్వారా కొన్ని ప్రశ్నలు కురిపించింది. ఒక ముసలి దర్జీ అయినా సరే, అతని పనికి పారితోషికం వుంటుంది. అదే పనిని స్త్రీలు ఎంతో ఓపికగా చేసినా వారి పనికి గుర్తింపు వుండదు. ఎంబ్రాయిడరీకి మరో అర్ధాలు చెప్పింది. అలంకరణ, మన మనసులోని బాధకి, భావాలకి రంగు పూసి కనపడనీయదు. ఎంబ్రాయిడరీని అలంకరణకి గుర్తుగా చూపిస్తుంది. తన చిత్రాల్లోని రంగులకూ అర్థాలున్నాయంటుంది.

1954లో పుట్టి, స్వయంకృషితో అంతర్జాతీయంగా పేరుపొందింది అపర్ణ. తన తల్లితో కలిసి ఢిల్లీలో ‘ఫై అండ్ లిటరేచర్ అకాడమీ’ పెట్టి, అందులో అవసరమున్న వారికి ఎంతో సాయం చేస్తుంది. అర్ధ శతాబ్దపు హిరోషిమా గుర్తుగా జపాన్ ప్రభుత్వం ఈమెని వారి మ్యూజియంకి ఆహ్వానించింది.

  • ఎం. బాలామణి
Aparna Painting
Aparna Painting
SA: