నమోస్తు భారతావని

అఖండ భారతావని మురిసిపోతోంది
మన నిబద్ధత, నిజాయితీ చూసి
జాతీయ పతాకం రెపరెపలాడుతోంది
మన నిశ్చలత,నిర్వికారతను చూసి…

ఎప్పుడో స్వాతంత్య పోరాటంలో చూసాం
వందేమాతర నినాదం తో దేశం ఏక తాటిపైకి రావటం
ఇప్పుడు స్వీయ నిర్భంధం తో చూస్తున్నాం
అంతస్సూత్రం ఒకటే స్వేచ్ఛ…

అప్పుడు శత్రువు కంటి ముందు ఉన్నాడు
బ్రిటీషు వాడి రూపంలో
ఇప్పుడుకాలు కదపనివ్వని,చేయి చాపనివ్వని
ఈ మహమ్మారి ఎంత టక్కరి
కంటికి కనిపించకుండా కట్టేసింది కరోనా రూపంలో…

ఐనా భారతీయుని ఆత్మశక్తి ముందు
ఏ మాయా పని చేయదు
విశ్వం ప్రశ్నించినప్పుడల్లా ఈ భూమి
సమాధానమై నిలిచింది
కావాలంటే చరిత్రను తిరగేయండి…

లోకంలో లక్షల్లో ప్రాణాలు హరీ అంటోంటే
మన నేలపై రెండకల్లో ఆగిపోయాయంటే
మన వైద్యుల అపార మేధస్సు, దీక్షాదక్షత
దైవ రూపంలోని నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల
వెలకట్టలేని సేవ, ప్రేమాభిమానాలు చిరస్మరణీయాలు…

త్యాగం,శాంతి, పచ్చదనంతో శోభిల్లే
మన భూమి పై ఏ విషకణం బ్రతకజాలదు
ఈ కరోనా ఎంత?

ఎంత అదృష్టవంతులం మిత్రులారా
యుద్ధం చేసే సువర్ణ అవకాశం ఇది
కాలనాగులా బుసలు కొడుతున్న భూతాన్ని
మన స్వేచ్ఛ ను హరిద్దామని చూస్తున్న దెయ్యాన్ని
భూస్థాపితం చేద్దాం..విశ్వ విజేత గా నిలుద్దాం.

-అట్లూరి వెంకటరమణ (ఖమ్మం)

చిత్రాలు: ఎన్.ఆర్. కుమార్

SA: