ఆయనో క్రియేటివ్ డాక్టర్ …!

(సెప్టెంబర్ 29 గురవారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలతో … )

క్రియేటివ్ డాక్టర్ అన్నాను కదా అని ఆయన శస్త్ర చికిత్సలు క్రియేటివ్గా చేస్తాడు అనుకునేరు, క్రియేటివిటి ఆయన వృత్తిలో కాదు, నిత్య జీవితంలో చూపిస్తారు. అంకిత భావంతో వృత్తిని నిర్వహిస్తారు. ఆయనో మాజీ సి.యం. కు అల్లుడు, ప్రముఖ సినీ దర్శకుడికి తోడల్లుడు. ఆయనే సన్ ‘షైన్ హాస్పిటల్’ స్థాపకులు డాక్టర్ గురవా రెడ్డి.

గురవారెడ్డి గా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వైద్యుడు, రచయిత. ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు. హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు. అంతకు మునుపు ఇంగ్లండులో పదేళ్ళు, అపోలో ఆసుపత్రిలో కొంత కాలం పనిచేశాడు. కిమ్స్ ఆసుపత్రిని స్థాపించిన వారిలో ఆయన కూడా ఒకడు. ఒక్క ఏడాదిలో 4000 శస్త్రచికిత్సలు చేసి ఆసియా రికార్డు నెలకొల్పాడు. ఆయన అనుభవాలను ‘గురవాయణం’ అనే పేరుతో పుస్తకం రాశాడు. ఆయన భార్య భవాని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాం కుమార్తె. ఆమె కూడా వైద్యురాలే. కుమార్తె కావ్య ‘లిటిల్ సోల్జర్స్’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు అయిన గుణ్ణం గంగరాజు ఈయనకు తోడల్లుడు.

వైద్య వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన అభిరుచికి అనుగుణంగా ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నారు. కళలను,కళాకారులను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన గురువారెడ్డి గారికి తెలుగు భాషన్న, తెలుగు సంప్రదాయాలన్న అమితంగా ఇష్టపడతారు. అందుకే తన పిల్లల పెళ్ళిళ్ళను కూడా తెలుగు  సంప్రదాయకంగా జరిపారు. తన హాస్పిటల్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాలు కూడా ఎన్నో సాహితీ కార్యక్రమాలకు వేదిక అయింది అంటే, వారి సాహిత్య అభిలాషను మనం అర్థం చేసుకోవచ్చు.

రచయితగా:
ఆయన పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచి భాషమీద మమకారం ఉండేది. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా సాధించాడు. వైద్యకళాశాలలో ఉన్నపుడు తెలుగు పత్రికకు సంపాదకుడిగా కూడా ఉన్నాడు. అందులో స్నేహితుల ప్రోత్సాహంతో కథలు రాసేవాడు. తరువాత సాక్షి లాంటి వార్తా పత్రికల్లో కూడా కొన్ని వ్యాసాలు రాశాడు. ఆయన అనుభవాలను ‘గురవాయణం’ అనే పేరుతో గ్రంథస్థం చేశాడు. ఆయనకు సంగీతంలో కూడా ఆసక్తి ఉంది. రోజూ రాత్రి రేడియోలో పాతపాటలు వినడం ఆయనకు అలవాటు.

సోషల్ మీడియాలో:
ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ చేరువకావడంతో తన భావాలను వ్యక్తం చేయడానికి, తన స్నేహితులను పరిచయం చేయడానికి ‘యూట్యూబ్’ వేదికగా చేసుకొని Dr Gurava Reddy పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు రెండేళ్ల క్రితం. ఈ ఛానల్ కు ప్రస్తుతం తొమ్మిది వేలమంది సబ్ స్క్రైబర్స్ వున్నారు.

ఇందులో పండుగలు సంగీతం-సాహిత్యం, సినిమాలు, క్రీడలు, కుటుంబం, విహార యాత్రలు, వైద్యం  ఇంకా అనేక సామాజిక అంశాల గురించి సుమారు 40 వీడియోలు రూపొందించారు. ఇటీవలే పీవీ సింధు కుటుంబాన్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. కింద ఇచ్చిన లింక్ లో ఆ వీడియోలో చూడవచ్చు

బాల్యం, విద్యాభ్యాసం:
ఆయన గుంటూరులో పుట్టాడు. తల్లి రాజ్యలక్ష్మి. తండ్రి సత్యనారాయణ రెడ్డి బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్యుడు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం బాపట్లకు తరలి వెళ్ళింది. ఆయన పదోతరగతి దాకా బాపట్ల మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అక్కడే ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తయింది. బాపట్లలోని యార్లగడ్డ కృష్ణమూర్తి అనే వైద్యుడి స్ఫూర్తితో ఆయన కూడా వైద్యుడు కావాలనుకున్నాడు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే వైద్య ప్రవేశ పరీక్ష రాశాడు కానీ అందులో ఆయనకు వచ్చిన మార్కులకు వైద్య కళాశాలలో సీటు లభించలేదు. ప్రత్యామ్నాయ మార్గంగా తండ్రి బోధిస్తున్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీయెస్సీలో చేరి ప్రవేశ పరీక్ష మరో మూడు సార్లు రాసి చివరి ప్రయత్నంలో గుంటూరు వైద్య కళాశాలలో ప్రవేశం దక్కించుకున్నాడు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పుణె లో కీళ్ళవైద్యంపై పీజీ చేశాడు.

వైద్యవృత్తి:
పుణెలో పీజీ చేసిన తర్వాత గుంటూరులో ఆసుపత్రి ప్రారంభించాలనుకున్నాడు కానీ మిత్రుడైన డాక్టర్ సతీష్ కుట్టి సహకారంతో ఇంగ్లండు వెళ్ళాడు. పదేళ్ళపాటు అక్కడే పనిచేశాడు. అక్కడ మోకాలు శస్త్రచికిత్సలు చేస్తూనే మూడు ఎఫ్.ఆర్.సి.యస్ లు, ఎం.ఆర్.సి.యస్ చేశాడు. 1999 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కొద్ది రోజులు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో పనిచేశాడు. 2004 లో ఆయన తోడల్లుడు డాక్టర్ భాస్కరరావుతో కలిసి కిమ్స్ ఆసుపత్రి ప్రారంభించాడు. స్వల్ప వ్యవధిలోనే ఆ ఆసుపత్రికి మంచి పేరు వచ్చింది.

ఆర్ధోపెడిక్స్ కు సంబంధించి ఇంకా మంచి ఆసుపత్రిని ప్రారంభించాలనే ఉద్దేశంతో కిమ్స్ నుంచి బయటకు వచ్చి 2009 లో సన్ షైన్ ఆసుపత్రి ప్రారంభించాడు. అది 2016 నాటికి 450 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. జాతీయ స్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుంది. ఆయన రోగులను చూడటమే కాకుండా ప్రతి యేటా సుమారు 30 మంది వైద్యులకు శిక్షణ ఇస్తుంటాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉపన్యాసాలు కూడా ఇస్తుంటాడు.

కుటుంబం:
ముగ్గురు అన్నదమ్ముల్లో ఆయనే పెద్ద. పెద్ద తమ్ముడు హరి ఐ.ఐ.ఎం.లో చదివాడు. చిన్న తమ్ముడు బుజ్జి ఐ.ఐ.టీ. లో చదివాడు. ఆయన భార్య భవాని కూడా వైద్యురాలే. 1986లో వారి వివాహం జరిగింది. వారిది ప్రేమ వివాహం. వారిద్దరి కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. ఆయన గుంటూరులో చదువుతున్నప్పుడు ఆమె విజయవాడ సిద్ధార్ధ వైద్యకళాశాలలో చదువుతుండేది. పదేళ్ళు ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

-కళాసాగర్

 

SA:

View Comments (3)

  • Dr. గురువారెడ్డి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. గోల్డ్ మెడలిస్ట్ సింధు వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను చక్కగా present చేశారు. అభినందనలు. 64 కళలు -కళాసాగర్ గారి ప్రత్యేక అభినందనలు. తోపల్లి ఆనంద్, కార్టూనిస్ట్.