రంగులంటే ఇష్టం – శ్రీకాంత్

శ్రీకాంత్ కు రంగులంటే ఇష్టం. ఆ రంగులు బొమ్మలతో వుంటే ఇంకా ఇష్టం. ఆ బొమ్మలు తను వేసినవి అయితే ఎంతో తృప్తి. ఇంద్రధనుస్సులోని రంగులు, ప్రకృతిలోని పచ్చదనం, పూలల్లోని పరిమళం, పక్షులకున్న స్వేచ్చను ఎంతో ఇష్టపడతాడు. పై రంగులన్నీ, ఆలోచనల్ని కలగలిపి కుంచెతో చిత్రాల్ని ఆవిష్కరిస్తాడు.
విశ్వనాథ శ్రీకాంతాచారి (33). నివాసం మదీనాగూడ, చందానగర్, హైదరాబాద్. పేయింటింగ్ లో తనదంటూ ఓ ప్రత్యేక ఒరవడితో దైవం, ఆథ్యాత్మకత, ప్రకృతి పరవశం తదితర అంశాల నేపథ్యంగా వేరు వేసే చిత్రాలు చూపరలకు ఇట్టే ఆకట్టుకుంటాయి.
వృత్తి రీత్యా ప్రస్తుతం అమెజాన్ లో గ్రాఫిక్ డిజైనర్ గా చేస్తున్నారు. లోగో డిజైనింగ్, ప్రొడక్ట్ డిజైనింగ్, కాన్సెప్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంటారు.
తీరిక వేళ్ళలోను, శెలవుల్లోను కళతో కాలం గడుపుతారు. స్వతహాగా స్వర్ణకార వృత్తి కలిగిన వంశంకావడంతో జన్మతః “కళ” అబ్బింది. శ్రీకాంత్ అన్న రమేశ్ మంచి పేరున్న ఆర్టిస్టు. కాబట్టీ అన్న రమేశ్ ప్రేరణతో ప్రోత్సాహం తోడయ్యింది. అన్నగారి శిక్షణలో పెన్సిల్, వాటర్, ఆయిల్ తదితర అంశాలలో పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నారు శ్రీకాంత్. తనకున్న ఊహాశక్తికి ప్రతిభను జోడించి ఎన్నో రకాల చిత్రాలను రూపొందించారు. ఏడు సార్లు గ్రూప్ ప్రదర్శనలో పాల్గొన్నారు. కొన్ని ముఖ్యమైన సంస్థల నుండి అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం తన దగ్గర 20-25 పెయింటింగ్స్ వున్నాయి.
ఇంటర్ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిప్లోమా చేసి, మెడికల్ డిపార్టుమెంటులో ల్యాబ్ టెక్నీషియన్ గా కొంత కాలం ఉద్యోగం చేశారు. అలాగే ఇష్టమైన రంగులతో చిత్రాలను చిత్రిస్తూ, మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మోడర్న్ పేయింటింగ్ లో బి.ఎఫ్.ఎ. (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) కోర్సును కూడా పూర్తి చేశారు. అనంతరం నేర్చుకున్న మెలుకువలతో మరింత భిన్నంగా చిత్రాలు, పేయింటింగ్స్ లను చేస్తున్నారు.
చిత్రకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇంకా కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం తదితర అంశాలను బోధించేందుకు, పిల్లలలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆర్ట్ టీచర్లు ప్రతి పాఠశాలలకు అవసరముందని అంటున్నారు శ్రీకాంత్. ఆధునిక సాంకేతికతో పెరిగి ప్రస్తుతం చిత్రకళకు గడ్డుకాలం ఉన్నప్పటికీ, మంచి కళాకారుల హృదయంలోంచి పుట్టుకొచ్చిన చిత్రాలకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని శ్రీకాంత్ అభిప్రాయం.
చివరిగా ‘ఈ రోజులలో పేయింటింగ్ కి తోడుగా మల్టీ మీడియా కోర్సు చేస్తే చిత్రకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు’ విశ్వనాధ శ్రీకాంత్.

-డా. దార్ల నాగేశ్వర రావు

SA:

View Comments (1)