కళా వైభవాన్ని చాటే నృత్య రూపకాలు

ప్రముఖ చిత్రకారులు, దర్శకులు, కూచిపూడి నృత్య – రూపక రచయిత ‘బ్నిం ‘ బ్యాలేలు’ పేరుతో ఓ నృత్య రూపక సంకలనాన్ని వెలువరించి తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు. రెండు వందల యాభై పైనే – నృత్య రూపకాలు రచించిన ‘బ్నిం’ ఎక్కువశాతం పౌరాణిక కథలకే పెద్దపీట వేసినప్పటికీ.. సామాజిక అంశాలపై కూడా రాసి అందరి మన్ననలు పొందారు. నృత్య ప్రధానమైన రచనలు చేయడంలో అపార అనుభవం సాధించిన ‘బ్నిం’ చిన్నతనంలోనే మన సంస్కృతి ప్రతిబింబించే గ్రంథాలను చదివారు. అప్పటి నుంచే సంస్కృతం, సంగీతం సాహిత్యం పట్ల మక్కువ చూపి.. మాత్రా ఛందస్సులో గేయ రచనకు శ్రీకారం చుట్టారు. గత మూడు దశాబ్దాలుగా నృత్య రూపకాలకు జీవం పోస్తున్న ఆయన.. కూచిపూడి నట్యాచార్యులు వారి శిష్యగణం దృష్టి నాకర్షించినారు. వారు కోరిన రీతిలో రచన చేసి మెప్పించిన అనుభవం ఆయనకున్నది. సందేశాత్మకంగా, ప్రబోధాత్మకంగా రాసిన ఆయన రచనలు, దరువులు పలువురి మన్ననలు పొందాయి. విదేశాల్లో సైతం ‘బ్నిం’చే నృత్య రూపకాలు రాయించుకోవడం విశేషం! తాను రాసిన నృత రూపలకు మొట్టమొదట శ్రీ పెద్దుల సరసింగరావు అనే ఆయన ప్రోత్సహించినట్లు బ్నిం’ తన మాటలో చెప్పుకున్నారు. ఆ తర్వాత పలువురు ఆయనచే రాయించుకుని సంగీతం.. స్వరం జోడించి రమణీయ నృత్య ప్రదర్శనలకు ఉపక్రమించిన -వారెందరో ఉండటం గమనార్హం. డా. జొన్నలగడ్డ అనురాధారెడ్డి, పద్మజారెడ్డి, స్వాతి తదితరులు పరిచయంలోకి రావడానికి డి.ఎస్.వి. శాస్త్రిగారు ఎంతగానో సహకరించినట్లు స్వయంగా ‘బ్నిం’ చెప్పుకున్నారు. తాను కళారత్న” బిరుదు తెచ్చుకునే వరకు మద్దాలి (కిన్నెర, రఘురామ్ గారు వారి శ్రీమతి మద్దాలి ఉషాగాయత్రిగారి సహకారంతో – అనేక నవీన అంశాలపై దృష్టి సారించి నృత్య రూపకాలను తీర్చిదిద్దారు. అనేక మంది ప్రముఖులు కళారంగంలో.. సాంస్కృతిక రంగంలో, నృత్యరంగంలో ఆయన రూపకాలకు విలువనిచ్చి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం శ్లాఘనీయం. అంతేగాక ‘బ్నిం’ రూపకాలకు అనేక మంది స్వర రాగకర్తలు వేలాది ఆయన పాటలకు – స్వరం సమకూర్చారు. సృత్య రూపకాలు 250కి పైగా – రచించిన ‘బ్నిం’ ‘బ్యాలేలు’ పేరుతో ప్రస్తుతం మనకు అందించిన గ్రంథంలో ఓ పదకొండు (11) అంశాలకు సంబంధించిన నృత్య రూపకాలను పొందుపరిచారు. శకుంతల, కాళీయ మర్దనం, శ్రీఖండస్థాణువు, మేనకా విశ్వామిత్రమ్, సిద్ధార్థ, గజేంద్రమోక్షం, శ్రీనివాస కళ్యాణం, బాలం ముకుందం, వాల్మీకి, నాగకన్య మరియు భక్త కన్నప్ప నృత్య రూపకాలను ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశారు. ప్రతి రూపకం ప్రదర్శన యోగ్యంగా, గాన యోగ్యంగా, రమణీయంగా కళాకారులు తమ ప్రతిభను నృత్య రూపంలో గాన రూపంలో చాటుకోవడానికి వీలుందేలా తీర్చి దిద్దబడింది.

బ్నిం ఈ రూపక ప్రదర్శనల ద్వారా చారిత్రక, సాంస్కృతిక, అంశాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ప్రదర్శించడానికి వీలుగా రచనను కొనసాగిస్తూ, అవసరమైన మార్గదర్శక సూత్రాలను సందర్బోచితంగా ఆయా రూపకాల్లో పొందు పరిచారు. పెద్దుల నర్సింగ్ రావ్ గారికి రాసిన నృత్య రూపకాలు ఎక్కువ ఉండటం విశేషం. ఈ రూపకాలను సశాస్త్రీయంగాను, సలలితంగాను సరళమైన రీతిలో మనోధర్మం ఆధారంగా రచించారు. పురాణ కథలలోనూ సామాజిక ప్రయోజనాన్ని నర్మగర్భంగా కాంక్షించి రాయడం విశేషం. అంతేగాక స్త్రీల చిన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఈ రూపకాలు దోహదపడతాయి. 1/4 క్రౌన్ సైజులో అందమైన ముఖచిత్రంతో సనాతనం ఆధునికం మేళవించి.. శాస్త్రీయంగా రాయబడిన ఈ నృత్య రూపకాలు ప్రదర్శించి కళాకారుల ప్రయోజనం ఉండాలని వారి ప్రదర్శనలు ద్వారా సమాజంను అలరింపజేయాలని కోరుకుందాం. ఈ సందర్భంగా బ్నిం’ను అభినందిద్దాం.
ప్రతులకు: బ్నిం 12-11-1364, పారశర ఆపార్టుమెంట్స్ బౌద్ధనగర్, వారాసిగూడ, సికింద్రాబాద్-500 061 ఫోన్: 8341450673
– దాస్యం సేనాధిపతి

SA: