దర్శక కంఠాభరణం కైలాసం విశ్వనాథన్

(బాలచందర్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…)

తమిళ సినిమారంగంలో శివాజీ గణేశన్, ఎమ్జీఆర్ లు సూపర్ స్టార్లుగా వెలుగుతున్న రోజుల్లో కొత్త నటులను ప్రోత్సహించి వారిని సూపర్ స్టార్ల స్థాయికి చేర్చడం అందరికీ సాధ్యమౌతుందా? మానవ సంబంధాలలోని సంక్లిష్టతలు, సామాజిక సమస్యలను కథావస్తువులుగా ఎంచుకొని ఆ మానవీయ కోణాలను, సంఘర్షణలను అత్యంత సహజవంతమైన సినిమాలుగా మలిచి, కేవలం వినోద మాధ్యమంగా మూస ఒరవడిలో కొట్టుకుపోతున్న సినిమారంగాన్ని కొత్తదారి పట్టించడం నూతన దర్శకులకు సంభవ మేనా? హాస్యనటుడిగా ముద్రపడిన ఒక ప్రతిభావంతుడైన నటుడిని హీరోగా పరిచయంచేసే సాహసం చేయగల దర్శకులు ఆ రోజుల్లో యెవరైనా వున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం… కె. బాలచందర్! సూపర్ స్టార్లు రజనీకాంత్, కమలహాసన్, క్యారక్టర్ నటుడు ప్రకాశ్ రాజ్, హీరోయిన్లు జయప్రద, సరిత, సుజాత.. వంటి శిష్యగణాలను వెండితెరకు పరిచయం చేసిన బాలచందర్ చలనచిత్ర సీమకు ఓ కంఠాభరణం. ఆయన పాత్రలు మనచుట్టూవున్న సమాజం నుంచే వస్తాయి. జీవితాన్ని ఆవిష్కరించడం, వుద్వేగాలను పండించడమే బాలచందర్ విజయరహస్యం. కథలే ఆయన సినిమాలో హీరోలు. భారత చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షణభారత చిత్రసీమకు బాలచందర్ అందించిన బహుముఖ సేవలు అనంతం. బాలచందర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని సంస్మరణ కోసమే ఈ జ్ఞాపకాలు..

రచనా వ్యాసంగంతో సినిమాలో అడుగులు

తంజావూరు జిల్లా సన్నిలం గ్రామంలో దండపాణి కైలాసం, సరస్వతి దంపతులకు జూలై 9, 1930న పుట్టిన కైలాసం బాలచందర్ పన్నెండవ ఏడాదికే ‘థియేటర్ ఆర్టిస్ట్ సంఘం’లో సభ్యులయ్యారు. సన్నిలం వస్త్రాల అద్దకానికి పేరు పొందిన గ్రామం. ప్రతి ఇంటి ముందు ఆ రంగురంగుల వస్త్రాలు వేలాడుతూ వుంటే, బాలచందర్ ఊహాలోకాల్లో విహరించేవారు. ఎవరైనా కథ చెబుతుంటే ఆ సన్నివేశాలకు మనసులోనే రూపకల్పన చేసుకునేవారు. ఆ ఊహాశక్తే బాలచందర్ ను నాటక రచనకు వుద్యుక్తుణ్ణి చేసింది. అన్నామలై యూనివర్సిటీలో బియ్యస్సీ పట్టా తీసుకొని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో వుద్యోగం చేస్తూ, తీరిక సమయాల్లో సరదాగా నాటక రచనను ప్రవృత్తిగా మార్చుకొని డైరెక్ట్ చేస్తూ ప్రదర్శనలు ఇస్తూవున్న సమయంలో, ఆయన రాసిన ‘మేజర్ చంద్రకాంత్’ నాటకం ఎమ్జీఆర్ దృష్టిని ఆకర్షించింది. అలా ఎమ్జీఆర్ ప్రోత్సాహంతో 1964లో ‘దైవత్తాయ్’ సినిమాకు తొలిసారి మాటలు రాసి, స్క్రీన్ ప్లే సమకూర్చారు. తరవాత మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో రాసిన ’నీర్కుమిళి’ నాటకాన్ని స్వీయ దర్శకత్వంలో హాస్యనటుడు నాగేష్ ని హీరోగా పెట్టి అదేపేరుతో సినిమాగా మలిచారు. బాలచందర్ ఈ సినిమాని దాదాపు ఒకే సెట్టింగులో చిత్రీకరించారు. సినిమా వినూత్నoగా ఉండటంతో సూపర్ హిట్ అయింది. అలా తొలిచిత్రంతోనే హిట్ దర్శకునిగా పేరుతెచ్చుకున్నారు బాలచందర్. తరవాత ‘నానల్’(1965) ‘మేజర్ చంద్రకాంత్’(1966), ‘బామావిజయం’(1967), ‘అనుబవిరాజా అనుబవి(1967), ‘ఎత్తిర్ నీచల్’ (1968) ‘తమరై నెంజం’(1968) వంటి బాలచందర్ సినిమాలు వరసగా వచ్చాయి. 1964లో కృష్ణన్-పంజు దర్శకత్వంలో వచ్చిన ‘సర్వర్ సుందరం’ సినిమాకు బాలచందర్ నాటకం ఆధారం. ఈ సినిమా ఉత్తమ సంభాషణల రచయితగా బాలచందర్ కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. కృష్ణన్-పంజు సినిమాలకు ఎక్కువగా బాలచందరే సంభాషణలు సమకూర్చేవారు. తీసిన సినిమాలన్నీ బాగానే ఆడాయి. బాలచందర్ తన సినిమాలకు పెద్ద నటుల్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కథలు రాయలేదు. ఏ.వి.ఎం మెయ్యప్ప చెట్టియార్ సలహామేరకు ఉద్యోగానికి రాజీనామాచేసి పూర్తిస్థాయి కథ, సంభాషణల రచయితగా, దర్శకునిగా మారిన బాలచందర్ తెలుగు చిత్రసీమలో కూడా తనదైన ముద్ర వేశారు.

తెలుగు చిత్రసీమలో మలి అడుగులు:

తమిళంలో హిట్ అయిన ‘బామా విజయం’ సినిమాను జెమినీ వాళ్ళు 1968లో ‘భలే కోడళ్ళు’ పేరుతో తెలుగులో పునర్నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాలచందర్ సమకూర్చారు. ఎస్.వి.రంగారావు, నాగభూషణం, జానకి, కాంచన, జయంతి నటించిన ఈ చిత్రం బాలచందర్ కు తొలి తెలుగు సినిమా. పదవీ విరమణ చేసిన ఒక స్కూలు మేస్టారి ముగ్గురు కోడళ్ళు ఆడంబరాలకుపోయి, భర్తలచేత అప్పులుచేయించి చివరకు బుద్ధితెచ్చుకోవడం ఈ సినిమా కథ. “ఆస్తి మూరెడు, ఆశ బారెడు-చివరకు అప్పులు, చేతికి చిప్పలు’ అనే బృందగానంలో సినిమా సారమంతా గుప్పించారు బాలచందర్. అందుకే బాలచందర్ సినిమాల్లో పాటలు కూడా కథ చెబుతూ వుంటాయి. తరవాత తెలుగులో వచ్చిన ‘సత్తెకాలపు సత్తెయ్య’(1969) సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాలచందరే నిర్వహించారు. ఇందులో అమాయక నౌకరుగా చలం, ఇతర పాత్రల్లో రోజారమణి, శోభన్ బాబు, రాజశ్రీ నటించారు. తరవాత ‘బొమ్మా-బొరుసా’ సినిమా వచ్చింది. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’ సినిమాతో బాలచందర్ ఆంధ్ర ప్రేక్షకుల అభిమాన దర్శకుడయ్యారు. ఆరోజుల్లో వచ్చిన సినిమాలు సుఖాంతం అయ్యేవి. కానీ బాలచందర్ ఆ వరవడికి అడ్డుకట్టవేసి, కథాపరంగా కొన్నిటిని విషాదాంతం చేసేవారు. దాంతో ఆ సినిమాలు కొన్నిసార్లు వివాదాస్పదమయ్యేవి. బాలచందర్ తీసిన సినిమాల్లో పాత్రలు ప్రతిక్షణం మనకళ్ళముందు కదలాడుతూనే వున్నట్లుంటాయి. అవి మహిళా చిత్రాలు కానివ్వండి, ప్రేమకథా చిత్రాలు కానివ్వండి, చివరికి సందేశాత్మక చిత్రాలు కానివ్వండి అవి ఒక ప్రత్యేకతను కలిగి వుండడం బాలచందర్ ప్రత్యేకత.

సినిమా ప్రత్యేకతలు:

‘అంతులేని కథ’ సినిమాలో జయప్రద పాత్ర పైకి ఎంత కఠినంగా కనిపిస్తుందో, లోపల అంత సున్నితంగా వుంటుంది. తన ముందున్న పెద్ద కుటుంబ క్షేమం కోసం అనేక త్యాగాలు చేస్తూ, తన కోరికలను చంపుకొని ఏకాకిగా మిగిలిపోయే ఒక యువతి అంతులేని కథగా ఈ సినిమాని బాలచందర్ మలిచిన తీరు అమోఘం. విశాఖపట్నంలో తొలిసారి నిర్మించిన ఈ చిత్ర ఘన విజయంతో ‘మరోచరిత్ర’ సినిమాను కూడా బాలచందర్ విశాఖపట్నంలోనే నిర్మించడం విశేషం. ఈ సినిమాలో మనసుకి, వయసుకి మధ్య జరిగే సంఘర్షణను నేపథ్యంగా తీసుకొని కథ అల్లారు. విధిచేసే వింతల్నిఅద్భుతంగా ఆవిష్కరించి విషాదాంతం చేసిన సినిమా ‘మరోచరిత్ర’. భర్తను కోల్పోయి కమలహాసన్ కు దగ్గరకావాలని ఆరాటపడే మాధవి అతడి ప్రేమ వృత్తాంతం తెలిసి తప్పుకునే సన్నివేశం గుండెను పిండివేస్తుంది. రాని భాషల్లో రొమాన్సు నడిపి విషాదాంతం చెయ్యడమే బాలచందర్ దర్శకత్వంలోని గొప్పతనం. అందుకే ఈ సినిమా చెన్నైలో ఏకంగా ఏడాదిపాటు ఆడింది. అదే ‘ఏక్ దూజేకేలియే’ గా హిందీలో తీస్తే హైదరాబాదులోకూడా ఏడాదిపాటు, మిగత సెంటర్లలో 200 రోజులు ఆడింది. బాలచందర్ మరో సినిమా ‘ఇది కథ కాదు’ చూస్తే, ఆ పాత్రలు మనల్ని వెంటాడుతూ ఉన్నట్లే వుంటాయి. ప్రేమ, పెళ్లి రెంటిలోనూ విఫలమైన ఒక మహిళకు మాజీ ప్రియుడు ఎదురైనప్పుడు, ఆమె ఆశ చిగురించి అతణ్ణి పెళ్ళాడాలనుకుంటుంది. అప్పుడే చెడ్డవాడనుకున్న భర్తలో పరివర్తన వచ్చి మరాలా ఆమె జీవితంలోకి వస్తానంటాడు. ఈ సమస్యలమధ్య సతమతమయ్యే ఆ మహిళా హృదయాన్ని ఆవిష్కరి స్తుంది ఈ చిత్రం. జీవితం నేర్పిన పాఠాలు ఆమెను ఒంటరిగానే కొనసాగమని చెపుతున్నట్లు సినిమా ముగిస్తారు బాలచందర్. ఇదొక కొత్త కోణం. ‘గుప్పెడు మనసు’ సినిమాలో యెంతో వైవిధ్యముంది. టీనేజిలోవున్న బాలిక అనివార్య పరిస్థితుల్లో తన బావతో శారీరికంగా కలుస్తుంది. ఆమె అక్క ఒక అభ్యుదయ రచయిత్రిగా వుండి కూడా ఆ సంఘర్షణను భరించలేని భావాలను వ్యక్తీకరించే పాత్రలో సుజాతను కొత్తకోణంలో చూపి, దగాపడిన ఆమె చెల్లెలి పాత్రను ఆత్మహత్యకు గురి కావాల్సిన పరిస్థితులను కలిపిస్తూ కథను నడిపిన తీరు ఊహకందనిది. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో నిరుద్యోగ సమస్యను అధిగమించలేని నలుగురు నిర్భాగ్య స్నేహితుల జీవితాలను కొత్తకోణంలో చూపినవిధం అభినందనీయం. ఈ సినిమాద్వారా ఆకలిబాధ ఎంత దుర్బరమైనదో చూపి కంట తడి పెట్టిస్తారు బాలచందర్. ‘కోకిలమ్మ’ సినిమాలో ఒక నిరుపేద యువతి తను ప్రేమించే యువకుడు సంగీతం నేర్చుకునేందుకు అష్టకష్టాలుపడి ధనసహాయం చేస్తే, ఆ యువకుడు తనదారి వెతుక్కోవడం నేపథ్యం. చదువుతుంటే ఈ పాత్రలన్నీ ఎక్కడో ఒకచోట మనకు తారసపడినవే అయివుంటాయి. పొరుగువానికి సాయపడమన్న గురజాడ బోధనలను ఆవిష్కరిస్తూ, అగ్రకులంలోవున్న ఛాందస భావాలను ఖండిస్తూ, మానవత్వపు విలువలకు అగ్రపీఠాన్ని కట్టబెట్టిన చిత్రం ‘రుద్రవీణ’. అలాగే మగవాడి దౌర్జన్యాలకు గురికాకుండా, స్త్రీ స్వతంత్రంగా బతకాలనే నేపథ్యంలో సుహాసినితో ‘సింధుభైరవి’ నిర్మించారు. ‘అందమైన అనుభవం’, ’47 రోజులు’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’, ‘తొలికోడి కూసింది’ వంటి సినిమాలు వేటికవే ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవిని ‘47నాట్కళ్’(47రోజులు) సినిమాలో బాలచందర్ తమిళ చిత్రరంగానికి పరిచయం చేసారు. చలనచిత్ర రంగానికి సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, వివేక్, సరిత, సుజాత, జయప్రద వంటి వంద మందికి పైగా నటీనటుల్ని, వి. కుమార్ వంటి అద్భుత సంగీత దర్శకుని కూడా బాలచందరే పరిచయం చేయడం మన అదృష్టం. నీటి ఎద్దడి, రాజకీయ అవినీతిని నిరసిస్తూ బాలచందర్ తీసిన ‘క్లాసిక్’ ‘దాహందాహం’(1982-తన్నీర్ తన్నీర్) సినిమాకు రెండు జాతీయ బహుమతులు, రెండు ఫిలింఫేర్ బహుమతులు దక్కాయి. కానీ ఈ సినిమా నెగటివ్ ను భద్రపరచలేక పోవడం శోచనీయం. సరిత, శివకుమార్ నటించిన విచిత్ర పెళ్ళాం(1990) డబ్బింగు సినిమా రాధమ్మ కాపురం పేరుతో విడుదలైంది. ఇందులో రజనీకాంత్, కమలహాసన్ అతిధి పాత్రల్లో నటించడం విశేషం. తెలుగులో దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ‘తూర్పు-పడమర’ సినిమా తమిళంలో బాలచందర్ తీసిన ‘అపూర్వ రాగంగళ్’(1975)కు రీమేక్. ఈ సినిమాలో వాణీజయరాంకు జాతీయ అవార్డు లభించింది. తమిళంలో తీసిన ‘ఎత్తిర్ నీచల్’ సినిమాను తెలుగులో ‘సంబరాల రాంబాబు’గా నిర్మించారు. తమిళంలో నగేష్ నటించిన అనాధ పాత్ర ను తెలుగులో చలం పోషించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సహకారాన్ని అందించింది బాలచందరే. బాలచందర్ దర్శకత్వం వహించిన మరో తమిళ సినిమా ‘పున్నాఘై మణ్ణన్’ ను తెలుగులో ‘డ్యాన్స్ మాస్టర్’ గా డబ్ చేసారు. ఇక సిస్టర్ నందిని, డ్యూయెట్ వంటి అనువాద సినిమాలకు లెక్ఖేలేదు. తెలుగులో వచ్చిన ‘మూగప్రేమ’ సినిమాకు కథకుడు బాలచందరే. బాలచందర్ మంచి నటుడు కూడా. కల్కి, పోయ్, నినైత్తరు యారో, రెట్టైసుఘి సినిమాల్లో నటించారు. ఇక చివరిసారిగా కమల్ నిర్మిస్త్తున ఉత్తమ విలన్ సినిమాలో బాలచందర్ నటించడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’సినిమా చూసాక జీవితంలో మద్యం ముట్టుకోకూడదని నిర్ణయంతీసుకొని ఆ నిర్ణయానికే బాలచందర్ చివరిదాకా కట్టుబడ్డారు. మధ్య తరగతి సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చిన బాలచందర్ తన పేరును మబ్బుల్లో వున్నట్లు వేసుకునేవారు. ఈ సంప్రదాయాన్ని తర్వాత దాసరి నారాయణరావు అనుకరించారు. బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళచిత్రాలు ‘ఇరుకొరుగళ్’(69), ‘అపూర్వరాగంగళ్’(75), ‘తన్నీర్ తన్నీర్’(81), ‘అచ్చమిల్లై అచ్చమిల్లై’(84) జాతీయస్థాయిలో పురస్కారాలు సాధించాయి. జాతీయ సమగ్రత కోసం నర్గీస్ పేరిట ఇచ్చే అవార్డులు బాలచందర్ కు రెండుసార్లు దక్కటం విశేషం¬. 1987లో బాలచందర్ ను ‘పద్మశ్రీ’ బిరుదు వరించింది.1973లో తమిళనాడు ప్రభుత్వం బాలచందర్ ను ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది. అక్కినేని అంతర్జాతీయ పురస్కారం కూడా బాలచందర్ కు దక్కింది. 2010 సంవత్సరానికి భారత ప్రభుత్వం బాలచందర్ కు ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును బహూకరించింది. బుల్లితెర మీదకూడా బాలచందర్ దృషి సారించి కవితాలయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘రైల్ స్నేహం’, ‘రమణి Vs రమణి’, ‘కై అళవు మనసు’, ‘జన్నల్’ వంటి సీరియల్ ఎపిసోడ్లు ప్రసారం చేయించారు. బాలచందర్ కు 1956లో రాజంతో పెళ్లయింది. ఆయనకు కైలాసం, ప్రసన్న అనే ఇద్దరు కొడుకులు, పుష్ప అనే కూతురు వున్నారు. అయితే కైలాసం అనారోగ్యంతో కాలం చేశారు.

సాహిత్యం, సంగీతం సినిమాలో మమేకం

బాలచందర్ సినిమాలకు ఎమ్మెస్ విశ్వనాథన్, వి. కుమార్, ఇళయరాజాలు ఎక్కువ సినిమాలకు సంగీత దర్శకులుగా పనిచేసారు. తమిళంలో వాలి, తెలుగులో ఆచార్య ఆత్రేయ ఎక్కువ పాటలు రాసారు. ముందుచెప్పినట్లు బాలచందర్ సినిమాల్లో కథే హీరో, పాటలే సన్నివేశాలు. వీలైనంతవరకు అతని సినిమాల్లో పాటలకు, సన్నివేశానికి సన్నిహిత సందర్భం వుంటుంది. ‘అంతులేని కథ’ సినిమాలో ఆత్రేయ రాసిన మాటలు, పాటలు- ఎమ్మెస్ విశ్వనాథన్ సమకూర్చిన బాణీలు, జయప్రద అంతులేని ప్రయాణం మరచిపోలేని జ్ఞాపకాలు. జయప్రద పడే ఆవేదనను “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల, సొంత ఇల్లేల ఓ చెల్లెలా” పాట రూపంలో యెంతో గొప్పగా చెప్పారు. “సిలలేని గుడికేల నైవేద్యం-ఈ కలలోని సిరికేల ఈ సంబరం; మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా-నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా” అంటూ వేదాంత రహస్యాన్ని జయప్రదకు సలహా రూపంలో బోధచేసే సన్నివేశాన్ని మరవలేం. ‘మరో చరిత్ర’లో “విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేననీ విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో” పాటలో “వలచి గెలిచి కలలు పండిన జంటలేదీ ఇలలో-కులము, మతమో, ధనము, బలమో గొంతుకోసెను తుదిలో-అది నేడు జరగరాదని ఎడబాసి వేచినాము-మనగాధే యువతరాలకు కావాలి మరోచరిత్ర” అంటూ ఆసినిమా పరమార్ధాన్ని ఒక్క పాటలోనే చెప్పడం బాలచందర్ గ్రేట్ నెస్.. ‘ఇది కథకాదు’ సినిమాలో “అటు ఇటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు?” పాటలో “ఒడ్డున పెరిగే గడ్డిపోచవు ఒద్దిక నదితో కోరేవు- మార్గశిరాన మండుటెండకై చూసేవు-ఉదయం కోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు” నిగూడార్థం జయసుధకు చెప్పే సన్నివేశం ఊహకందనిది. ‘ఆకలిరాజ్యం’లో ఆకలి బాధలను అనుభవించే యువతరాన్ని గుర్తుచేస్తూ “ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా-ఆవేశం ఆపుకొని అమ్మా నాన్నదే తప్ప” బాలచందర్ పాటరూపంలో చెప్పించే మాటలు ఎంతగానో ప్రేక్షకులను అకట్టుకున్నాయి. ఇలా చెప్పుకుంటూపొతే బాలచందర్ సినిమాలో పాటలే కథను నడిపిస్తాయని నమ్మక తప్పదు. ఏదేమైనా సినిమా కథలను కొత్త పుంతలు తొక్కించి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచిన బాలచందర్ మనందరి మనస్సులో చిరంజీవే! “మరోజన్మంటూ వుంటే నేను బాలు గా పుడతాను” అని చెప్పిన బాలచందర్ కు సంగీత మంటే ఎంత ప్రేమో మీరే ఊహించుకోండి. బాలచందర్ అమర్ రహే!.

ఆచారం షణ్ముఖాచారి

SA: