తెలుగుదనానికి నిలువెత్తు రూపం

(డా. నాగభైరవ కోటేశ్వరరావుగారి వర్థంతి సందర్భంగా )

పంచెకట్టులోను చేతినందు చుట్టతోను
ఆంధ్రజాతికి ఆణిముత్యమై కదిలాడతడు
అక్షరాలను ఆయుధంగా పోగుజేసిన
సాహితీ సృజనకారుడతడు
నవ్యాంధ్ర సాహిత్య సంద్రాన
వెలుగుపూలు పూయించిన దార్శనికుడతడు
గుండె గుండెకు మమతపంచిన
శిష్యవాత్సల్య పరాయణుడతడు

కదిలే కవిత్వమై తాను నడిస్తూ
యువతరాన్ని నవతరాన్ని తనవెంట నడిపించిన
ప్రతిభామూర్తి స్ఫూర్తి ప్రదాత అతడు
తెలుగు సాహితీ క్షేత్రాన నిత్య కృషీవలుడై
సాహిత్య పూదోటలో బంగారు పంటల్ని
పండించిన కర్షకవి యతడు

“గుండ్లకమ్మ చెప్పిన కథ”గా ప్రవహించి
“నది చెప్పని కథ”గా మారి
“అక్షరాభిషేకాల”తో పద్యపరిమళాలను వెదజల్లి
“రంగాజమ్మ” కావ్య జగత్తులో విహరింపజేసి
“కన్నీటిగాథ”గా కరిగిపోయి
“కన్నెగంటి హనుమంతు”గా చెలరేగి
“ఒయాసిస్సు”లో “తూర్పువాకిళ్ల”ను తెరిపించి
“మానవతా సంగీత “స్వరాలను పలికించి
“కవనవిజయం” రూపకల్పనతో కీర్తినార్జించిన
ఘనాపాటి బహుగ్రంథకర్త అతడు
అతడే అతడే నాగభైరవ-నింగికేగిన తారాజువ్వ

-డా.నూనె అంకమ్మరావు ‌, ఆంధ్రోపన్యాసకులు
(నాగభైరవ కోటేశ్వరరావు (ఆగష్టు 15, 1931 – జూన్ 14, 2008) ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు)

SA: