జీవనసరళిని మార్చే గొప్ప సాధనం’పుస్తకం’

‘పుస్తకం చదవడం వ్యాపకం కాదు… అది మన జీవన సరళిని మార్చే గొప్ప సాధనం’ అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి. విజయవాడ, బందరురోడ్డులో గల రాగూర్ స్మారక గ్రంథాలయంలో శుక్రవారం(16-9-22) సాయంత్రం 5 గంటలకు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ రచన సత్యశోధన-ఆత్మకథ’ పుస్తకం మూడు వేల ప్రతులను రాష్ట్ర గ్రంథాలయాలకు వితరణ చేశారు. ఈ వితరణ కార్యక్రమం ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ-గాంధీ రచన ‘సత్యశోధన’ పుస్తకం నేటి రాజకీయ నాయకులుగా ఎదగడానికి అవసరం లేదని, కానీ గొప్ప మనిషిగా ఎదగటానికి ఈ పుస్తకం తప్పక అవసరమన్నారు. తన శరీరాన్ని, నడతనీ, జీవితాన్ని ప్రయోగశాలగా మార్చి రాసిన పుస్తకమిది. తన ఆదర్శప్రాయమైన జీవనశైలినే పుస్తకంగా రాశారన్నారు.

అహింసను ఆశయంగానూ, ఆయుధంగానూ మార్చిన ఏకైక రాజకీయ ప్రవక్త మహాత్మాగాంధీ అని ఆయన అన్నారు. అటువంటి ప్రవక్త రాసిన ఒక గొప్ప గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ లో గొప్ప గ్రంథాలయంగా పేరుగాంచిన ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో రాష్ట్ర పరిషత్ చైర్మన్ మందపాటిశేషగిరిరావు గారి సమక్షంలో అందజేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

సభాధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ-గ్రంథాలయ వ్యవస్థను మరింతగా జనంలోకి తీసుకెళ్ళాలన్న గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్నానన్నారు. నాకున్న ఇబ్బందుల్లో నన్ను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు గొప్ప సంకల్పంతో నాకీ బాధ్యతను అప్పజెప్పారు. నేను ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన అప్పజెప్పిన బాధ్యతను నెరవేర్చే దిశగా నేను నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ఈ ప్రయాణంలో భూమన కరుణాకరరెడ్డిగారి లాంటి గొప్ప వ్యక్తుల సహకారం కూడా అందడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జమలాపూర్ణమ్మ, పౌర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీర్ అహ్మద్, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్, తిరుపతి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుబాల, అనంతపురం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమామోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో కంచల నాగరాజు, మధుసూదన్ రాజు,రామచంద్రుడు పాల్గొన్నారు.

SA: