వ్యధ బారిన పథ బాటసారి… గురుదత్

గురుదత్ జయంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి వ్యాసం…

హిందీ చలనచిత్రసీమలో అద్భుతమైన క్లాసిక్స్ తోబాటు విజయవంతమైన క్రైమ్ చిత్రాలు నిర్మించిన మేధోసంపత్తి గల నటుడు, కథకుడు, నిర్మాత, దర్శకుడు గురుదత్. బాజీ, ఆర్ పార్, CID, ప్యాసా, చౌద్వి కా చాంద్ వంటి అద్భుత చిత్రాలను నిర్దేశించిన గురుదత్, చలనచిత్ర రంగంలో ఏర్పడే కాగితం పూల వంటి వ్యాపార బంధాల గురించి, వ్యక్తిగత స్నేహితుల గురించి సహేతుకంగా ‘కాగజ్ కె ఫూల్’ అనే చిత్రాన్ని నిర్మించి విపరీతంగా నష్టపోయాడు. భారత్ లో తొలిసినిమా స్కోప్ గా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంపూర్ణంగా విఫలమైంది. ఆ వైఫల్యమే గురుదత్ ను క్రుంగదీసింది. “ఇకపై సినిమాలకు దర్శకత్వం వహించను” అనే కఠిన నిర్ణయానికి ఈ వైఫల్యం దారి తీసింది. మానసికంగా యెంతో కృంగిపోయాడు. ఆ చిత్ర నిర్మాణానికి చేసిన అప్పులు అతణ్ణి వెంటాడుతూనే వచ్చాయి. కసికొద్దీ ‘చౌద్వి కా చాంద్’ చిత్రం నిర్మించి నష్టాలు పూడ్చాడు. కానీ మానసిక వ్యధ తీరలేదు సరికదా, తీవ్ర రూపం దాల్చింది. వహీదా రెహమాన్ తో గల వివాహేతర సంబంధం కారణంగా భార్య గీతా దత్ దూరమయ్యింది. ఆ వ్యధను తట్టుకోలేక మద్యానికి, మత్తు బిళ్ళలకు బానిసైపోయాడు. చివరికి ఆ మత్తు పదార్ధాలే అతని ప్రాణాలు తీశాయి. జూలై 9 న గురుదత్ జయంతి. సినిమా కథను తలపించే గురుదత్ జీవిత కథను పరికిస్తే… చదవండి ఆ విశేషాలు.

తొలి అడుగులు…

గురుదత్ అసలుపేరు వసంత కుమార్ శివశంకర్ పదుకొణే. అయితే, చిన్నతనంలో గురుదత్ కు పెద్ద ప్రమాదం తప్పటంతో అతని మేనమామ అతని పేరు ను గురుదత్ గా మార్చారు. జూలై 9, 1925 న గురుదత్ అలనాటి మైసూరు రాష్ట్రంలోని బెంగుళూరులో జన్మించాడు. అసలు వారిది కర్వార్ అనే ప్రాతం. తండ్రి ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసేవారు. గురుదత్ చిన్నవాడుగా ఉండగానే వారి కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ కు వెళ్లి అక్కడే స్థిరపడింది. గురుదత్ బాల్యం దయనీయంగా గడిచింది. తల్లిదండ్రులు గురుదత్ ను ప్రేమగా చూడలేదు. తల్లి తరఫు బంధువులు ఏవగించుకునేవాళ్ళు. గురుదత్ కలకత్తాలో చదువుకున్నాడు. తరవాత ఆర్ధిక ఇబ్బందులు ఎదురవడంతో చదువుకు స్వస్తి చెప్పి 1942లో పండిట్ రవిశంకర్ సోదరుడు ఉదయశంకర్ నడిపే నాట్య బృందంలో సభ్యుడిగా చేరి నాట్యశాస్త్రంలో మెలకువలు నేర్చుకున్నాడు. కలకత్తా లోని సారస్వత పరిషత్ వారి ప్రదర్శనలో స్నేక్ డ్యాన్స్ చేసి బహుమతి అందుకున్నాడు. తరవాత కొంతకాలం కలకత్తా లోని లీవర్ బ్రదర్స్ ఫాక్టరీలో టెలిఫోన్ ఆపరేటర్ గా పనిచేశాడు. ఆ నౌఖరు కు స్వస్తి చెప్పి తన మేనమామ సహకారంతో 1944లో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. పూనా లోని ప్రభాత్ ఫిలిం స్టూడియోలో మూడు సంవత్సరాల ఒప్పందం మీద నాట్యాచార్యుడిగా చేరాడు. ప్రభాత్ ఫిలిం కంపెనీ నిర్మించిన ‘చాంద్’ అనే సినిమాలో శ్రీకృష్ణుడుగా చిన్న పాత్ర ధరించాడు. తరవాత ‘లఖ్రాని’ అనే సినిమాకు సహాయ దర్శకునిగా వ్యవహరిస్తూ అందులో నటించాడు. అప్పుడే దేవానంద్ హిందీ సినిమాల్లో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాత్ ఫిలిం కంపెనీ పి.ఎల్. సంతోషి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘హమ్ ఏక్ హై’(1946) సినిమాలో దేవానంద్ ది హీరో పాత్ర. ఆ సినిమాకు గురుదత్ డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకరోజు షూటింగ్ జరుగుతుండగా దేవానంద్ తన షర్టుని గురుదత్ ధరించి వుండడం గమనించాడు. షూటింగ్ విరామంలో విషయాన్ని ప్రస్తావించాడు. తనకు ఒకే షర్టు వుందని, దానిని వుతకడానికి లాండ్రీలో ఇచ్చి, ఆ లాండ్రీ వాడిని బతిమాలి ఆ షర్టు వేసుకొచ్చానని గురుదత్ చెప్పుకొచ్చాడు. ఈ అనుకోని సంఘటన దేవానంద్-గురుదత్ ల గాఢమైన స్నేహానికి పునాదిగా మారింది. అప్పుడు వీరిద్దరిమధ్య ఒక మౌఖిక ఒప్పందం జరిగింది. “గురుదత్ నిర్మాతగా మారితే అందులో దేవానంద్ హీరోగా నటించాలి; దేవానంద్ నిర్మాత అయితే ఆ సినిమాకు గురుదత్ దర్శకత్వం వహించాలి” అనేది ఆ ఒప్పందం. ప్రభాత్ స్టూడియోతో మూడేళ్ళ ఒప్పందం పూర్తయ్యాక, బాబురావు పాయ్ కి సహాయకుడిగా అదే స్టూడియోలో గురుదత్ పది నెలలపాటు పని చేశాడు. 1947 ప్రాంతంలో ఆ స్టూడియో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొని 1952లో మూతపడి బొంబాయికి తరలిపోయింది. దాంతో గురుదత్ 1947లోనే బొంబాయికి మకాం మార్చాడు. అమియా చక్రవర్తి చిత్రం ‘గరల్స్ స్కూల్’ (1947), జ్ఞాన్ ముఖర్జీ నిర్మించిన ‘సంగ్రామ్’ (1950) చిత్రాలకు సహాయకుడిగా పనిచేశాడు.

దేవానంద్ ఇచ్చిన బ్రేక్…

దేవానంద్ హీరోగా స్థిరపడిన తరవాత 1950లో నవకేతన్ ఫిలిమ్స్ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పాడు. తొలి ప్రయత్నంగా 1950లో ‘అఫ్సర్’ సినిమా నిర్మించాడు. తొలి చిత్రం కావడంతో ఆ చిత్రానికి దేవానంద్ అన్న చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. సినిమా విజయవంతం కావడంతో రెండవ ప్రయత్నంగా ఒక క్రైమ్ త్రిల్లర్ ‘బాజి’ (1951) సినిమా నిర్మించాడు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ చిత్రానికి గురుదత్ దర్శకుడుగా తొలి అవకాశం కల్పించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ హిట్టయింది. తదనంతరం హిందీ లో నిర్మింపబడే క్రైమ్ చిత్రాలకు ‘బాజి’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తరవాత సొంత బ్యానర్ గురుదత్ ఫిలిం ఆర్ట్స్ పేరిట నిర్మించిన ‘జాల్’ (1952) చిత్రానికి కథ సమకూర్చి దర్శకత్వం వహించాడు. ఇది గురుదత్ కు దర్శకుడిగా రెండవ చిత్రం. అందులో దేవానంద్ హీరో గా నటించగా గీతాబాలి హీరోయిన్ గా నటించింది. గోవా లో వుండే జాలరుల నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం కూడా విజయవంతమైంది. 1953 లో హరిదర్షన్ నిర్మించిన ‘బాజ్’ చిత్రానికి గురుదత్ కథ అందించి దర్శకత్వం వహించాడు. అంతేకాదు తొలిసారి ఇందులో గీతాబాలి సర సన హీరోగా కూడా నటించాడు. ఒక ఓడమీద జరిగే సాహసకృత్యం ఇందులో హై లైట్ గా నిలిచి సినిమాను హిట్ చేసింది. ఒ.పి. నయ్యర్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. 1954 లో గురుదత్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘ఆర్ పార్’ సినిమా గురుదత్ కు అటు నిర్మాత, దర్శకునిగా, ఇటు నటుడుగా ఒక మంచి బ్రేక్ ఇచ్చింది. ఇది ఒకరకమైన కామెడీతో కూడిన క్రైమ్ త్రిల్లర్ చిత్రంగా చలామణి అయ్యింది. గురుదత్ సరసన శ్యామా హీరోయిన్ గా నటించగా, రాజ్ ఖోస్లా గురుదత్ కు దర్శకత్వం లో సహాయకుడుగా వ్యవహరించడం విశేషం. ‘బాజ్’ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఒ.పి. నయ్యరే ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం తరవాత గురుదత్ ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో గురుదత్ సరసన హీరోయిన్ గా మధుబాల నటించింది. ఒ.పి. నయ్యర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రముఖ కార్టూనిస్టు ఆర్.కె. లక్ష్మణ్ చిత్రాలు గీయడం విశేషం. మహిళా హక్కుల నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా బాగా ఆడింది. తనవద్ద సహాయకుడిగా పనిచేసిన రాజ్ ఖోస్లాను దర్శకుడిగా పరిచయం చేస్తూ గురుదత్ 1956లో ‘CID’ చిత్రాన్ని నిర్మించాడు. అందులో హీరోగా దేవానంద్ నటించగా వహీదా రెహమాన్ ను తొలిసారి హీరోయిన్ గా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు. ఈ క్రైమ్ సినిమాలో దేవానంద్ ఒక హత్యను ఛేదించే పోలీసు అధికారిగా నటించాడు. తరవాతి కాలంలో దర్శకులుగా రాణించిన ప్రమోద్ చక్రవర్తి, భప్పీ సోని ఈ చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేశారు. గురుదత్ మనసులో ‘ప్యాసా’ కథను సినిమా గా నిర్మించాలనే కోరిక ఉండడంతో, అందులో హీరోయిన్ గా వహీదా రెహమాన్ చేత బాగా నటింపజేయాలనే ధ్యేయంతో, ఆమెకు తొలిసారి CID చిత్రంలో స్థానం కలిపించారు. జోహారా సెహగల్ ను ఇందులో కొరియోగ్రాఫర్ గా పరిచయం చేసింది గురుదత్ కావడం కూడా ఒక విశేషమే. CID సినిమా సూపర్ హిట్టయింది. అప్పుడే గురుదత్ దర్శకుడు రాజ్ ఖోస్లాకు ఒక విదేశీ కారును బహుమతిగా ఇచ్చాడు.

గురుదత్ మాస్టర్ పీస్ లు…

CID చిత్రం తరవాత 1957లో గురుదత్ నిర్మించిన చిత్రం ‘ప్యాసా’. ఇది గురుదత్ మాస్టర్ పీస్ గా నిలిచింది. గురుదత్ నిర్మాతగా, దర్శకునిగా, హీరోగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని ఎక్కువగా కలకత్తా రెడ్ లైట్ ప్రాంతంలో నిర్మించాలని వెళితే, అక్కడ విటులనుతార్చే బ్రోకర్లు ప్రతిఘటించడంతో ప్రత్యేక సెట్ వేసి స్టూడియోలోనే నిర్మించారు. ఈ చిత్రాన్నే తెలుగులో ‘మల్లెపూవు’ గా కె. చటర్జీ నిర్మించడం జరిగింది. సచిన్ దేవ్ బర్మన్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా ‘సైట్ అండ్ సౌండ్’ క్రిటిక్స్ సంస్థ నిర్వహించిన ‘ఆల్ టైం గ్రేట్ మూవీస్’ సర్వేలో 160 వ స్థానం సంపాదించింది. అలాగే ‘టైమ్’ మ్యాగజైన్ నిర్వహించిన ‘ఆల్ టైం బెస్ట్ మూవీస్’ జాబితాలో స్థానం నిలబెట్టుకుంది. ‘ఇండియా టైమ్ మూవీస్’ వారు గుర్తించిన 25 అత్యుత్తమ హిందీ చిత్రాల్లో ‘ప్యాసా’ సినిమాను చేర్చారు. ఈ సినిమా కేవలం ఒక క్లాసిక్ గానే కాకుండా కమర్షియల్ గా కూడా విజయవంతమై గురుదత్ ప్రతిష్టను ద్విగుణీకృతం చేసింది. ఈ సినిమాకు మొదట గురుదత్ పెట్టదలచిన పేరు ‘ప్యాస్’. అయితే టైటిల్ ఇంకా బలీయంగా వుండాలని దానిని ‘ప్యాసా’ గా మార్చాడు. ఈ సినిమాను ప్రఖ్యాత గేయ రచయిత సాహిర్ లూదియాన్వి నిజజీవిత కథగా కూడా చెప్పుకునేవాళ్ళు. ‘ప్యాసా’ చిత్రం అంబరాన్ని తాకితే గురుదత్ 1959లో నిర్మించిన మరొక క్లాసిక్ చిత్రం ‘కాగజ్ కే ఫూల్’ నిరాశను మిగిల్చింది. దాంతో గురుదత్ విషాదంలో మునిగిపోయాడు. భవిష్యత్తులో సినిమాలకు దర్శకత్వం నిర్వహించకూడదనే తీవ్రమైన నిర్ణయానికి వచ్చాడు. అంతే… ఈ చిత్రం తరవాత గురుదత్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ఏ చిత్రానికీ గురుదత్ దర్శకత్వం వహించలేదు. దీనినిబట్టి ‘కాగజ్ కే ఫూల్’ సినిమా గురుదత్ ను ఎంతగా కుంగదీసిందో అంచానా వేయవచ్చు. మనదేశంలో నిర్మించిన తొలి సినిమా స్కోప్ చిత్రం ‘కాగజ్ కే ఫూల్’. ఈ సున్నితమైన సినిమా కథ ఒకరకంగా గురుదత్ ఆత్మకథేనని చెప్పవచ్చు. ప్యాసా, కాగజ్ కే ఫూల్ చిత్రాల నేపథ్యం ఒక కళాకారుని జీవితం గురించినదే కావడం, దానిని గురుదత్ జీవితానికి అన్వయించుకునే ఆస్కారానికి తావిచ్చింది. ఈ సినిమా నిర్మించవద్దని, నష్టపోతావని సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ గురుదత్ ను హెచ్చరించాడు. కానీ గురుదత్ వినలేదు. దాంతో గురుదత్ నిర్మించబోయే తదుపరి సినిమాలకు సంగీత దర్శకత్వం నిర్వహించబోనని బర్మన్ గురుదత్ ను హెచ్చరించాడు. అయినా గురుదత్ బర్మన్ మాట వినలేదు. ఈ సినిమాలో గురుదత్ రెండు మిలియన్ల నష్టాన్ని చవిచూశాడు. ‘కాగజ్ కే ఫూల్’ చిత్రం పరాజయం పాలవడంతో 1960లో మహమ్మద్ సాదిక్ దర్శకత్వంలో ‘చౌద్వి కా చాంద్’ సినిమా నిర్మించాడు. అందులో గురుదత్ సరసన వహీదా రెహమాన్ హీరోయిన్ గా నటించింది. బర్మన్ ససేమిరా అనడంతో రవి ‘చౌద్వి కా చాంద్’ (1960) సినిమాకు రవి సంగీతం అందించాడు. షకీల్ బదాయుని పాటల రచయిత గా వ్యవహరించారు. ఆ సంవత్సరం విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమా ఇదే. ఫరీదా జలాల్ ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ఈ సినిమా టైటిల్ ట్రాక్ ను మాత్రం ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించడం విశేషం. ‘కాగజ్ కే ఫూల్’ మిగిల్చిన నష్టాలను ‘చౌద్వి కా చాంద్’ సినిమా పూడ్చింది. ఈ చిత్రం మూడు ఫిలింఫేర్ బహుమతులను గెలుచుకోవడమే కాకుండా మాస్కో లో జరిగిన రెండవ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. 1962లో గురుదత్ అబ్రార్ ఆల్వి దర్శకత్వంలో ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా సినీ పండితుల ప్రశంసలు పొందినా కమర్షియల్ గా పెద్దగా విజయవంతం కాలేదు. ఇది ఉత్తమ చిత్రంగానే కాకుండా నాలుగు ఫిలింఫేర్ బహుమతులు కూడా గెలుచుకుంది. భారత ప్రభుత్వం ఈ సినిమాను ఆస్కార్ బహుమతికి అధికారిక ఎంట్రీగా పంపింది. కానీ ఒక గృహిణి మద్యానికి బానిస అయ్యే నేపథ్యం కలిగి ఉండడంతో ఈ చిత్రాన్ని ఆస్కార్ కమిటీ పరిశీలనకు నిరాకరించింది. ఈ చిత్రం తరవాత గురుదత్ సొంత సినిమా నిర్మాణానికి స్వస్తి చెప్పి, ‘భరోసా’, ‘బహు రాణి’, ‘సుహాగన్’, ‘సాంఝ్ అవుర్ సవేరా’ సినిమాలలో హీరోగా నటించాడు. గురుదత్ చివరి చిత్రం ‘బహారే ఫిర్ భి ఆయేంగి’. ఈ సినిమా ఎనిమిది రీళ్ళు నిర్మించాక గురుదత్ చనిపోవడంతో, ధర్మేంద్రను హీరోగా పెట్టి చిత్రాన్ని రీ-షూట్ చేసి విడుదల చేశారు.

వికటించిన వ్యక్తిగత జీవితం…

‘బాజీ’ చిత్రాన్ని నిర్మించే సమయంలో గాయని గీతాదత్ (అసలుపేరు గీతా రాయ్ చౌదరి)తో ప్రేమలో పడి ఆమెను గురుదత్ పెళ్ళాడారు. ఇరు కుటుంబాలనుంచి వచ్చిన వ్యతిరేకత వలన వారి ప్రేమ ఫలించి పెళ్లి దాకా వచ్చేందుకు మూడు సంవత్సరాలు పట్టింది. వీరికి ముగ్గురు పిల్లలు. గురుదత్ సెట్ మీద ఎంత కఠినంగా ఉండేవాడో, నిజ జీవితంలో అంత బలహీనుడిగా ప్రవర్తించేవాడు. తాగుడుకి బానిసై భార్యకు సమస్యగా పరిణమించాడు. వహీదా రెహమాన్ తో వివాహేతర సంబంధం కలిగిఉండడంతో గీతాదత్ అతనికి దూరంగా జరిగింది. చనిపోయేనాటికి గీతా, గురుదత్ ను విడిచి వెళ్ళింది. దాంతో పిల్లల్ని పెంచే బాధ్యత గురుదత్ సోదరుడు ఆత్మారాం (దర్శకుడు) మీద, గీతా దత్ సోదరుడు ముకుల్ రాయ్ మీద పడింది. 10 అక్టోబరు 1964 న గురుదత్ తను నివసిస్తున్న ఒక అద్దె అపార్టుమెంటులో ఒంటరిగా ఉంటూ, వ్యాకులతకు లోనై అధిక మోతాదులో మద్యం సేవించాడు. మత్తు మందు బిళ్ళలు వేసుకునే అలవాటు వుండడం చేత వాటిని ఎక్కువ సంఖ్యలో మిగడంతో కోమాలోకి వెళ్ళిపోయి ప్రాణం వదిలాడు. చిత్రరంగం మాత్రం ఒకరకంగా దీనిని ఆత్మహత్యగా నిర్ధారించింది. అయితే గురుదత్ తనయుడు అరుణ్ దత్ తెలిపిన వివరాల ప్రకారం గురుదత్ ది ఆత్మహత్య కాదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనని తెలిపాడు. ఎందుకంటే గురుదత్ చనిపోయిన మరుసటిరోజు రాజకపూర్, మాలాసిన్హా లతో ‘బహారే ఫిర్ భి ఆయేంగీ’ సినిమా గురించి గురుదత్ చర్చలు జరపాల్సి వుంది. గురుదత్ మరణించే సమయంలో అతడు రెండు సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నాడు. మొదటిది సాధనా హీరోయిన్ గా ‘పిక్నిక్’ సినిమా, రెండవది దర్శకుడు కె. ఆసిఫ్ తో నిర్మించాల్సిన ‘లవ్ అండ్ గాడ్’ చిత్రం. ‘పిక్నిక్’ సినిమా నిర్మాణం ఆగిపోగా, ‘లవ్ అండ్ గాడ్’ సినిమా మాత్రం ఇరవై ఏళ్ళ తరవాత సంజీవ్ కుమార్ హీరోగా విడుదలైంది. గురుదత్ మరణించాక గీతా దత్ కూడా మద్యానికి అలవాటు పడింది. దానితో ఆమె కాలేయం దెబ్బతిని 41 ఏళ్ళ వయసులోనే ఆమె 1972లో మరణించింది.

మరికొన్ని విశేషాలు…

ప్రేమోద్వేగాన్ని అత్యద్భుతంగా చిత్రీకరణ చేయగల ప్రతిభ గురుదత్ కు స్వంతం. హిందీ చిత్రసీమ గౌరవించిన దర్శకులలో గురుదత్ ఒకరు. ఆయన నిర్మించిన ‘ప్యాసా’, ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’, ‘కాగజ్ కే ఫూల్’ చిత్రాలు క్లాసికల్ మాస్టర్ పీసులుగా గుర్తింపుపొందాయి.

ప్రఖ్యాత హిందీ సినీ రచయిత అబ్రార్ ఆల్వి, ఛాయాగ్రాహకుడు వి.కె.మూర్తి, నృత్య దర్శకురాలు జోహారా సెహగల్, దర్శకుడు రాజ్ ఖోస్లా, నటి వహీదా రెహమాన్, హాస్య నటుడు జానీవాకర్, నటి ఫరీదా జలాల్ లను హిందీ వెండితెర కు పరిచయం చేసినవారు గురుదత్. తరవాతి కాలంలో వారందరూ ఎంతపేరు తెచ్చుకున్నారో అనే విషయం తెలిసిందే.

CID చిత్రంలో జానీవాకర్ కోసం స్వరపరచిన “ఆయ్ దిల్ హై ముష్కిల్ జీనా యహా” పాట ట్యూను ను నయ్యర్ కు ఆర్కెస్ట్రా నిర్వహించే మిలోన్ గుప్తా సూచించాడు. ఒకరోజు నయ్యర్, గురుదత్, మజ్రూహ్ సుల్తాన్ పురి మ్యూజిక్ సిట్టింగులో వుండగా ఈ ట్యూన్ ను మిలోన్ గుప్తా హమ్ చేస్తే, వెంటనే ఆ ట్యూన్ లో పాట రెడీ అయ్యింది. ఈ పాటలో వచ్చే మౌత్ హార్మోనికా బిట్లు మిలోన్ గుప్తా వాయించినవే.

గురుదత్ హిందీ చిత్రరంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా పోస్టల్ శాఖ 2004 అక్టోబరు 11 న ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. దూరదర్శన్ వారు గురుదత్ మీద ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించి అతని 47 వ వర్ధంతి సందర్భంగా ప్రసారం చేశారు.

-ఆచారం షణ్ముఖాచారి

SA: