తెలుగు రంగస్థల పునరుజ్జీవన యత్నం

మంచి పని ఎవరు చేసినా అభినందించాలి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భీకర పరిస్థితుల కారణంగా కళాకారులు దుర్భర దారిద్ర్యంలో కి నెట్టబడ్డారనడంలో ఎవరికీ సందేహం లేదు. ముఖ్యంగా నాటకం, బుర్రకథ, హరికథ వంటి ప్రదర్శన కళలు అసంఘటిత రంగంలో (unorganized sector) ఉండడం వలన ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టడం లేదు. ఆ ప్రభుత్వాలను ఎన్నుకున్నది మనమే గనుక వాటిని అని ప్రయోజనం లేదు. ఈ తరుణంలో శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు శ్రీ డి.వి. సుబ్బారావు గారు మొదలైన లబ్ధప్రతిష్టులైన, ఆర్థికంగా ఇబ్బంది లేని కళాకారులు కళారంగం పట్ల గౌరవ భావం ఉన్న వ్యక్తుల సహాయ సహకారాలతో వృత్తి కళాకారులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి చేతులెత్తి నమస్కరించాలి. కళారంగం తో ఏ సంబంధం లేకపోయినా కళాకారుల పట్ల అభిమానంతో మానవత్వంతో స్పందించి కోవిడ్ కష్టకాలంలో తెలుగు రాష్ట్రాలలోని రంగస్థల పేద, వృద్ధ కళాకారులకు సహాయ సహకారాలు అందించడానికి ఆయా ఫౌండేషన్ లకు, సేవా సంస్థలకు భూరి విరాళాలు ఇచ్చిన శ్రీ H.J. దొర గారు IPS, EX-DGP, శ్రీ ఆంజనేయరెడ్డిగారు IPS, Ex-DGP, శ్రీ K.V. రమణాచారి గారు IAS, శ్రీ M.V. సిద్ధార్థ మార్కండేయ రావుబహాద్దుర్ గారు, డా. K. కృష్ణయ్య గారు, శ్రీ చలవాది మల్లికార్జున రావు గారు, శ్రీ కోలా అనిల్ గారు, డాక్టర్ టి.వి.ఎస్. గిరింద్రనాథ్ గారు… ఇలా ఎందఱో ఎందరెందరో మహానుభావులు 5 లక్షలు ఇచ్చిన వ్యక్తి నుండి 5 రూపాయలు ఇచ్చిన వ్యక్తి వరకు (స్థలాభావం చే అందరి పేర్లు ప్రస్తావించడానికి వీలు కాలేదు క్షంతవ్యుడను)వృత్తి కళాకారుల నాదు కోవడానికి ముందుకు వస్తున్నారు. మరికొందరు నిశ్శబ్దంగా తను ఎంత ఇచ్చాడో పక్కవాడి కి కూడా తెలియకుండా తన చుట్టూ తనను ఆశ్రయించుకుని ఉన్న కళాకారులను ఆదుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కళాకారులందరి పక్షాన కృతజ్ఞతలు.

కానీ ఎంతకాలం ఇలా ఇతరులపై ఆధారపడి కళాకారులు జీవించగలరు? ఒకరి దగ్గర చేయి చాచి అడగాలంటే ఎంత ఆత్మాభిమానం పణంగా పెట్టాలి ? తాను ప్రదర్శించిన కళను అభినందిస్తూ సగౌరవంగా ఇచ్చే పారితోషికం తీసుకోవడానికి అలవాటు పడిన కళాకారులు ఒకరి ముందు చేయి చాచలేక ఈరోజు ఈ కళ వల్లే తన జీవితం నాశనం అయిందని బాధపడుతున్నారు. చాలామంది ఈ కళను వదిలేసి వేరే వృత్తులు వెతుక్కుంటున్నారు. దానివల్ల పద్య నాటకం వంటి రంగస్థల కళల మనుగడ ప్రశ్నార్థకమైంది. ఆశ్రితులు బాగుండాలంటే ముందు ఆశ్రమం బాగుండాలి. కాబట్టి ప్రస్తుతం కళాకారులను బతికించడం అవసరమే అయినా దీర్ఘ కాలంలో కళలను బ్రతికించడం చాలా అవసరం. సినిమా టీవీ రంగాల వలె నాటకానికి కూడా పారిశ్రామిక ప్రతిపత్తి రావాలి. రంగస్థలాన్ని ఆశ్రయించుకున్న కళాకారులు ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడకుండా స్వతంత్రంగా బతక గలగాలి.

దీని గురించి నేను ప్రస్తావించినప్పుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు గొప్పగా స్పందించి దానికోసం జి.జి.కే. ఫౌండేషన్ ఇప్పటికే ఒక బృహత్తర ప్రణాళిక ను సిద్ధం చేస్తోందని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రస్థాయిలో అనేక వ్యవస్థలకు నాయకత్వం వహించి పరిపాలనాదక్షులు గా పేరుగాంచిన శ్రీ హెచ్ జె దొరగారు ఐపీఎస్, శ్రీ కె.వి రమణాచారి గారు ఐఏఎస్, శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్ మొదలగు మహామహులు వారి మేధా సంపత్తితో ఈ రంగస్థల కళలను సముద్ధ రించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పడం జరిగినది. తెలుగు రంగస్థలాన్ని అంతర్జాతీయ స్థాయికి దీటుగా అభివృద్ధి చేయడానికి తానా పెద్దల సహాయాన్ని కూడా తీసుకొని నాటకరంగాన్ని సంస్కరించి విస్తరించడానికి కార్యాచరణ రూపొందించ బడుతున్నదని చెప్పడం జరిగింది. నిజంగా వారంతా పూనుకుని జి జి కే పౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపొందిస్తే దానిని అమలు చేయడానికి ప్రతి ఒక్క కళాకారుడు తమ వంతుగా ఐక్యమత్యంతో శ్రమించి వారికి సహకరించవలసిన అవసరం ఉందని మనవి చేస్తున్నాను. మొన్నీమధ్య సినీ రచయిత శ్రీ బుర్ర సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో కళల కాణాచి తెనాలి పేరుతో పద్యనాటక పరిషత్తు నిర్వహించడం ద్వారా నాటకానికి ఒక మంచి వేదిక ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి పట్టణంలోనూ జరగాలి. తద్వారా మన తెలుగు రంగస్థలం పునరుజ్జీవనం పొంది దేదీప్యమానంగా విరాజిల్ల గలదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.

డాక్టర్ పి వి ఎన్ కృష్ణ.
రచయిత, దర్శకుడు

SA: