కలంకారీ కళా ‘రత్నం’

కలంకారీ అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ. ఉత్తర భారతదేశంలో పుట్టిన ఈ కలంకారీ కళ శ్రీకాళహస్తి లో వందేళ్ళకిందటే ప్రారంభించబడింది…  అలాంటి ప్రాచీన కళలో జాతీయస్థాయిలో రాణిస్తున్న ఓ కళాకారున్ని గురించి తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లా, పిచ్చాటూరు మండలం, కారూరు గ్రామంలో పూజారి మునిస్వామిరెడ్డి, మునియమ్మ దంపతులకు 15-7-1957న ఓ రత్నం జనించింది. ఆ రత్నం పేరే మునిరత్నం. నవరత్నాల సరసన పదవ రత్నంగా భావించి వీరిని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశారు. తండ్రి మునిస్వామిరెడ్డి ప్రఖ్యాతిగాంచిన జానపద కళాకారులు, మునిరత్నంకు బాల్యంనుండే కళలపట్ల అభిరుచి పెరిగింది. పాఠ్యపుస్తకాల్లోని బొమ్మలను పలకపై గీస్తూ స్వయంశిక్షణ పొందారు. గ్రామీణ వాతావరణం కావటంచేత గేదెలు తోలుకొస్తూ దారిలో గోడలమీద బొగ్గుతో బొమ్మలు గీస్తూ ఉండేవారు. తన తండ్రి నాటకరంగ కళాకారులు కూడా కావటంతో నాటకాలపై దృష్టి మళ్ళింది. తండ్రి అనారోగ్యానికి గురికావటంతో తన తండ్రి ప్రదర్శించే నాటకాలను సినిమా ఫక్కీలో ప్రదర్శించడంతో ప్రజాదరణ లభించింది.

కుటుంబం : కారూరు గ్రామానికి చెందిన దేశమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.
చిత్రకళపై అభిరుచి : తన బాల్య స్నేహితుడు టైలర్ బాలిరెడ్డి సలహా మేరకు మద్రాసులోని శంతను చిత్ర విద్యాలయం ద్వారా 2 సం.రాల చిత్రకళ కోర్సును పోస్టల్ విధానంలో పూర్తిచేశారు. ఓ పర్యాయం శ్రీకాళహస్తిలోని తన బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రక్క ఇంట్లో కొత్త తరహాలో వనమూలికలతో తయారుచేసిన రంగులతో చిత్రాలను గీయడం మునిరత్నం చూశారు. ఆ విధానాన్ని కలంకారీ విధానం అని తెలుసుకున్నాడు. ఈ పద్ధతిపై ఇష్టాన్ని పెంచుకుని శ్రీకాళహస్తిలోని కలంకారీ కాలేజీలో 1980వ సం.లో చేరి రెండేళ్ళ కలంకారీ డిప్లొమా పూర్తిచేశారు.

కలంకారీ డిజైనర్ గా : 1986వ సం.లో మద్రాసులోని అజయ్ పబ్లిసిటీ డిజైన్స్ సంస్థలో సహాయకునిగా చేరారు. తాను నేర్చుకున్న కలంకారీ కళను సినిమా పోస్టర్స్ లోకి చొప్పించి డిజైన్స్ రంగంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలంకారీ గురువు మునికృష్ణయ్యతో కలసి కలకత్తాలోని శాంతినికేతన్ కు వెళ్ళి అక్కడ విద్యార్థులకు కళాభవన్ విభాగంలో కలంకారీ చిత్రకళను నేర్పించారు.

అభినందనలు, సత్కారాలు : మహాభారతం ఆధారంగా 6 మీటర్లు పొడవుగల వస్త్రం మీద కలంకారీ విధానంలో చిత్రాలను చిత్రించారు. మద్రాసులోని వి.టి.ఐ. సంస్థ వారు ఈ కళాఖండాన్ని చూసి ముగ్ధులై మహాత్మాగాంధీ నూరవ జన్మదిన వేడుకల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. అనంతరం 1990వ సం.లో మహాత్మాగాంధీ జన్మదిన సెంచరీ అవార్డు ఇచ్చి వి.టి.ఐ. సంస్థవారు మునిరత్నంను సత్కరించారు. 1991వ సం.లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో 100 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ శ్రీ నర్సింగరావు శ్రీ మునిరత్నంను సత్కరించారు. తిరుపతిలో జరిగిన చిత్రకళ పోటీల్లో మునిరత్నం గీసిన ‘రాధాకృష్ణ’ చిత్రానికి కళాక్షేత్ర అవార్డు దక్కింది. 2011వ సం.లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేఖరరెడ్డిని ప్రధానాంశంగా తీసుకుని ‘రాజకీయ (కల్ప) వంశవృక్షం’ అనే కళాఖండాన్ని చిత్రించారు. ఇందుకు సూళ్ళూరుపేటలోని ‘అమ్మ ఆర్ట్ అకాడమీ ‘ వారు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్‌ను ఇచ్చి సత్కరించారు. 2012వ సం.లో తిరుపతిలో జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల్లో తన కలంకారీ చిత్రాలను ప్రదర్శించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ జి. బలరామయ్య ద్వారా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 2013వ సం.లో విజయవాడలో జరిగిన చిత్రకారుల సమాఖ్య వేడుకల్లో మునిరత్నం తన కలంకారీ చిత్రాలను ప్రదర్శించారు. ఈ చిత్రాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
2018వ సం.లో రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని A.P. State Council of Science &Technology వారు తిరుపతిలో Special National Science Day Celebration జరిగినపుడు మునిరత్నం కలంకారీ చిత్రాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. 2019వ సం.లో కేంద్రప్రభుత్వ ఆధీనంలోని Ministry of Textiles ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో మునిరత్నం చిత్రించిన సత్య హరిశ్చంద్ర నాటకానికి National Merit Certificate దక్కింది.

అవార్డులు : 2014వ సం.లో విజయవాడలోని డా. పట్టాభి కళాపీఠము వారు రాష్ట్రస్థాయి ఉత్తమ కలంకారీ చిత్రకారునిగా అవార్డు ఇచ్చి సత్కరించడం విశేషం. అదే ఏడాది మునిరత్నం చిత్రించిన శ్రీనివాస కళ్యాణం చిత్రానికి A.P. Handicrafts Dev. Corporation Ltd. వారు రాష్ట్రస్థాయి ఉత్తమ కలంకారీ చిత్రకారులుగా సత్కరించారు. కలంకారీ చిత్రలేఖనం అధ్యాపకునిగా : 2014వ సం.లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో చిత్రలేఖనం విభాగానికి ప్రారంభ అధ్యాపకునిగా బాధ్యతలు చేపట్టారు. 2020 సం. వరకు ఎందరో విద్యార్థులను కలంకారీ చిత్రకారులుగా తీర్చిదిద్దారు.
మారుమూల గ్రామంలో పుట్టి జాతీయస్థాయి మేటి కళాకారునిగా ఎదగటం కష్టసాధ్యమైన విషయం. అంచలంచెలుగా ఎదుగుతూ కలంకారీ కళనే నమ్ముకుని, రంగుల స్వప్నాన్ని సాకారం చేసుకుని ప్రకృతే తన ఆరాధ్యదైవంగా భావించి, ప్రకృతిలో లభించే మూలికలతో తయారుచేసిన రంగులతోనే చిత్రాలను గీస్తూ పరోక్షంగా పర్యావరణ పరిరక్షకులుగా విరాజిల్లుతున్న మునిరత్నం తెలుగుజాతి మణిరత్నం. ఈ రత్నం పద్మశ్రీ పురస్కారానికి నూరుశాతం అర్హులు. ఆయన సుదీర్ఘ కలంకారీ ప్రయాణంలో వేలాది శిష్యులను తయారించారు. కళ ఎప్పటికీ అజరామరమే. దోచుకోలేనిదీ, దాచుకోలేనిది కూడా. కేంద్రప్రభుత్వం కలంకారీ రంగంలో కళారత్నమైన మునిరత్నాన్ని పద్మశ్రీ ఇచ్చి సత్కరించి చిత్రకళను గౌరవిస్తుందని ఆశిద్దాం.

-డా. తూములూరి రాజేంద్రప్రసాద్ (9490332323)
___________________________________________________________________

ఈ కలంకారీ కళకు ఎన్నో శతాబ్దాల చరిత్ర వుంది. అయితే మునిరత్నం రెడ్డి గారి కలంకారీ కళలో ప్రత్యేకత వుంది. అదేమిటంటే కలంకారీ చిత్రం రంగుల్లో వెలుగునీడలు తీసుకొచ్చారు. అంతకుముందు ఇలాంటి ప్రయోగం మరెవరు చేయలేదు. ఈ కలంకారీ కళను నేర్చుకోవడానికి ఎవరు తనదగ్గరకు వచ్చినా ప్రోత్సహించి తగిన శిక్షణ ఇస్తారు.
– డా. జి.వి. సాగర్, చిత్రకారులు, తిరుపతి

SA:

View Comments (1)