వెండి తెరపై మరో ‘మల్లీశ్వరి ‘

ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ కొనసాగుతోంది. రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాల్లో అత్యున్నత సేవలు అందించిన పలువురి జీవిత చరిత్రలు వెండితెరపై ఆవిష్కృతమవుతున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2000లో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించడమే కాకుండా ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసిన కరణం మల్లీశ్వరి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు.
జూన్ 1 న కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా కోన వెంకట్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎం.వి.వి.సత్యనారాయణ గారితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ట్వీట్ చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కోన వెంకట్ ఈ సినిమాకు నిర్మాతతో పాటు రచయితగా వ్యవహరిస్తుండగా.. సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.

“కరణం మల్లేశ్వరి” తెలుగు వారి ముద్దుబిడ్డ. శ్రీకాకుళానికి చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. ఈమె 1975 జూన్ 1 న జన్మించింది. చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామములో పుట్టిన మల్లీశ్వరి తండ్రి ఉద్యోగరీత్యా ఆమదాలవలసకు వచ్చారు, ఇక్కడే స్థిర పడ్డారు.
మల్లీశ్వరి అక్క నరసమ్మకు జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మాజీ కోచ్ నీలంశెట్టి అప్పన్న శిక్షణ ఇచ్చేవారు. అక్క విజయాలను చూచిన మల్లీశ్వరి కూడా ఈ రంగం పై ఆసక్తి పెంచుకుంది. చివరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. చైనా దేశం లోని గ్యాంగ్ ఝూలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 54 కిలోల విభాగంలో దేశానికి మూడు స్వర్ణపతకాలు తెచ్చారు. ఆ తరువాత టర్కీ రాజధాని ఇస్తాంహుల్ లో జరిగిన పోటీల్లో తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువుకావడంతో ఆ టైటిల్ ను మల్లీశ్వరికి ప్రధానము చేసారు. 1995 చైనాలో జరిగిన పోటీల్లో వరుసగా 105, 110, 113 కిలోల బరువులు ఎత్తి చైనా వెయిట్ లిఫ్టర్ – లాంగ్ యాపింగ్ పేరున ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు .

సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. 1999 భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంది.

SA: