మల్లెమాల చెప్పిన ‘డైరెక్టర్ గుణశేఖర్’ కథ

అది 1994వ సంవత్సరం. నేను శబ్దాలయ నుండి కారులో వెళ్తుండగా మా గేటు దగ్గర ఒక అనామకుడు నిల్చొని నాకు నమస్కారం పెట్టాడు. నేను కారు ఆపి నీ పేరేమిటి అన్నాను. నా పేరు గుణశేఖర్ సార్. నేను రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసోసియేట్గా పని చేశాను. తెలుగులో రెండు చిత్రాలు డైరెక్టు చేశాను. కాని అవి నన్ను నిరుత్సాహ పరిచాయి. దాంతో ఏ నిర్మాత నాకు అవకావం ఇవ్వలేదు. తిరిగి ఊరికి వెళ్ళలేక కొంతమంది మిత్రుల సహాయంతో నలభైలక్షల్లో ‘సొగసు చూడ తరమా’ అనే ‘చిత్రం తీశాను. ఆ చిత్రాన్ని మీకు చూపించాలని వచ్చాను అన్నాడు. పేరు చాలా నావర్టీగా వుంది. కాని నేను చూసినందువలన నీకు కలిగే లాభమేమిటి? అన్నాను.
ఫిల్మ్ పరిశ్రమలో మీ మాటకొక విలువ వుంది సార్. మీరు చూసి బాగుందని నలుగురితో చెప్తే చాలు నాకు మేలు జరుగుతుంది. దయచేసి ఈరోజు కానీ, రేపుగానీ ఒకసారి పిక్చర్ చూడండని ప్రాధేయపడ్డాడు. నేను మరుసటి దినం రామానాయుడు స్టూడియోలో అతనితో కలిసి పిక్చర్ నాకు ప్రతి ఫ్రేమ్ లోనూ డైరెక్టర్ ప్రతిభకనిపించింది. ప్రదర్శన ముగిశాక పిక్చర్ చాలా గొప్పగా వుంది. దర్శకుడుగా నీకు మంచి పేరొస్తుంది. కాని ఆర్థికంగా ఎంతవరకు విజయం సాధిస్తుందో చెప్ప లేనన్నాను. ఆర్ధిక విజయం తర్వాత ముందు పిక్చర్ విడుదలైతే చాలు. దయచేసి ఆ విషయంలో మీ అండ నాకుండాలి అన్నాడతను.

నేను కొందరు బయ్యర్స్లో చెప్పి విడుదల విషయంలో నా వంతు సాయం చేశాను. దర్శకుడుగా అతనికి మంచి పేరొచ్చినా చిత్రం మాస్ను ఆకట్టుకోలేక పోయింది. ఐనా అతని మీద నాకున్న అభిప్రాయం ఏ మాత్రం తగ్గలేదు.
తర్వాత ఒకరోజు గుణశేఖర్ మా ఆఫీసుకు వచ్చి మన బ్యానర్లో నాకొక అవకాశమివ్వండని బ్రతిమాలాడు. అలాగే ఇస్తాను. నీ దగ్గరేదైనా మంచిసోషల్ సబ్జెక్టుంటే తీసుకురా అన్నాను. అతను థ్యాంక్యూ సార్ అంటూ వెళ్ళిపోయాడు.
తర్వాత నాలుగు రోజులకే నావద్దకు వచ్చి సార్! నేను బాగా ఆలోచించాను. సోషల్ పిక్చర్ కన్నా పిల్లలతో రామాయణం నిర్మిద్దామన్నాడు. నేను ఆలోచనలోపడ్డాను. మర్నాడే మద్రాసు వెళ్ళి కె.యస్. ప్రకాశరావు గారిని కలిశాను.
ఆయన అంతకు ముందు పిల్లలతో ‘బూరెల మూకుడు’, ‘కొంటె కృష్ణుడు’, ‘రాజయోగం’ అన్న మూడు కథలను కలిపి ‘బాలానందం’ అన్న పేరుతో స్వీయ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించి వున్నారు. గుణశేఖర్ ప్రపోజల్ ఆయనకు చెప్పి సలహా అడిగాను. ప్రపోజల్ మంచిదే. పిల్లలతో ‘రామాయణం’ తీస్తే చూస్తారా! లేదా! అన్న సందేహం మీకక్కరలేదు. ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, దర్శకుడు గట్టి వాడైతే పిల్లలు ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలరు.
ఐతే పిల్లల చిత్రానికి స్టూడియోల్లో వున్న సెట్స్ ఏవీ పనికిరావు. ఆభరణాలు, ఆసనాలు, దుస్తులు వగైరాలన్నీ పిల్లలకు సరిపడే విధంగా ప్రత్యేకంగా తయారు చేయించవలసిందే! బడ్జెట్ విషయం మీరు చూసుకోండని సలహా ఇచ్చారు ప్రకాశరావు గారు.

నేను తిరిగి హైదరాబాద్ చేరుకోగానే గుణశేఖర్ను, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజును పిలిపించి ప్రకాశరావుగారు చెప్పిన వివరాలన్నీ చెప్పి బడ్జెట్ ఎంత అవుతుందన్నాను. పిల్లలెవరికీ పారితోషికం ఇవ్వవలసిన అవసరం లేదు కాబట్టి ఖర్చు ఎనభై లక్షలకు మించదన్నాడు గుణశేఖర్. అతనామాట చెప్పినా నేను కోటిరూపాయలు వెచ్చించేందుకు సిద్ధపడ్డాను. సంగీత దర్శకుడుగా మాధవ పెద్ది సురేష్ ను బుక్ చేశాను. ఛాయా గ్రాహకుడు జోసఫ్. సంభాషణల రచయిత ఎం.వి.యస్. హరనాథరావు. ఇక మిగిలింది నటీనటుల ఎంపిక. పౌరాణిక చిత్రాల్లో నటించాలంటే ముఖ్యంగా పిల్లలకు ముఖ వర్చస్సు ప్రధానం. అలాంటి పిల్లల కోసం హైదరాబాద్ లోని కాన్వెంటు స్కూళ్ళన్నీ గాలించి రాముడు, లక్ష్మణుడు, సీత, రావణాసురుడు తప్ప మిగిలిన పాత్రలన్నింటికీ బాలబాలికలను ఎన్నిక చేశాం. ముఖ్యంగా ‘రాముడు’ పాత్రను సమర్థవంతంగా పోషించగల అబ్బాయి ఎక్కడ దొరుకుతాడని నేను ఆలోచనలో పడ్డాను.

ఒకరోజు త్యాగరాయ గానసభలో ఎన్.టి.రామారావుగారి మనవడు తారక్ (హరికృష్ణ కొడుకు) నృత్య ప్రదర్శన చూశాను. అతని ప్రతి కదలికలోనూ, హావభావాల్లోనూ నాకు రామారావు గారు కనిపించారు. మర్నాడు వాళ్ళమ్మకు ఫోన్ చేసి నేను పిల్లలతో ‘రామాయణం’ తీస్తున్నాను. ఆ చిత్రంలో రాముడి పాత్రకు మీ అబ్బాయి పనికొస్తాడేమో చూస్తాను. రేపు ఉదయం బాబునొకసారి శబ్దాలయకు పంపించండి. అన్నాను.
మరుసటి రోజు నేనూ, గుణశేఖర్ ఆఫీసు ముందున్న గదిలో కూర్చొని ఏదో చర్చించుకొంటుండగా ‘తారక్’ ఆటోలో గేటు వద్ద దిగి నేరుగా నడిచి మా వద్దకు వచ్చాడు. ఆ నడకలో ముగ్ధమోహనా కారుడైన రాముడు నాకగుపించాడు.
నాపేరు తారక్ సార్. మమ్మీ చెప్పింది – మీరు రమ్మన్నారని. రాముడు వేషంకోసం. దయచేసి మీరు అవకాశమిస్తే నేను మా తాతగారిలాగా నటిస్తానన్నాడు. ఆ సంగతి తెలిసే నిన్ను పిలిపించాను. మా పిక్చర్లో నువ్వే రాముడివి. వెళ్ళి మీ మమ్మీకి చెప్పు అన్నాను.
తారక్ థ్యాంక్యూ సార్ అంటూ నా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. సీతను, లక్ష్మణుడిని నేను చూస్తాను. రావణాసురుడి పాత్రకు ఎవరైతే బాగుంటుందో నువ్వు చూడని గుణశేఖర్కు చెప్పాను. తర్వాత సుప్రసిద్ధ నాట్యాచారిణి రాజేశ్వరీ సాయినాధ్ ఇంటికి వెళ్ళి నృత్యం చేస్తున్న అమ్మాయిల హావభావాలను నిశితంగా పరి శీలించాను. అందరిలో ‘స్మితా మాధవన్’ అనే అమ్మాయి రాముణ్ణి మించిన సీతగా నాకనిపించింది. మర్నాడు నేను వాళ్ళింటికి వెళ్ళి నా మనస్సులోని అభిప్రాయాన్ని చెప్పగానే అమ్మాయితోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా సంతోషంతో అంగీకరించారు. లక్ష్మణుడు పాత్రకు ‘నారాయణ నిశ్చల్’ అనే అబ్బాయిని నేనే ఎన్నిక చేశాను. ఇక మిగిలింది రావణాసురుడి పాత్ర ఒకరోజు గుణశేఖర్ ‘కొడాలి స్వాతి’ అనే అమ్మాయిని నా వద్దకు తీసుకవచ్చి రావణాసురుడి పాత్రకు ఈ అమ్మాయి బాగుంటుంది సార్ అన్నాడు. అయినా నేనంత సాహసం చేయలేక అమ్మాయిని ఫోటో తీయించాను. ఆ ఫోటో ఆధారంగా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజు రెండురోజుల్లో రావణాసురుడి గెటప్ను రేఖా చిత్రంగా రూపొందించాడు.

ఆ చిత్రం చూడగానే నేను మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాను. అంతటితో నటీనటుల ఎంపిక పూర్తయింది. తర్వాత పిల్లలందరికీ పాత్రోచితమైన దుస్తులు, ఆభరణాలు, తయారు చేయించే బాధ్యతను ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజుకు అప్పగించాను.

-మల్లెమాల (ఇది నా కథ)

SA: