మీనాక్షి కల్యాణం నృత్యరూపకం

Dancer Sowjanya

ఆదిదంపతులయిన పార్వతీపరమేశ్వరుల తాండవంలో శివుని నృత్యంలో అపశృతి దొర్లి పార్వతి శివుని దూషించగా…శివుడు ఆగ్రహించి… భూలోకంలో పార్వతి మూడు స్తనముల వికృత రూపంతో జన్మించమని శపిస్తాడు. దుఖంలో వున్న పార్వతిని విష్ణుమూర్తి ఓదారుస్తూ…

పాండ్యరాజ్యంలో మలయధ్వజ మహారాజు కూతురుగా జన్మిస్తావని తడాదకై (అజేయరాలు)అనే పేరుతో ప్రభవించి ఈశ్వరుని దర్శనంతో శాపవిముక్తి కలిగి, అతనినే పరిణయమాడి మీనాక్షి సుందరేశ్వరులుగా భూలోకాన్ని ఉద్ధరిస్తారని ఆశీర్వదిస్తాడు. ‘కళారత్న’ బ్నిం రచించిన ఈ నృత్యరూపకానికి డి.ఎస్.వి. శాస్త్రి (హైదరాబాద్, సెంట్రల్ యూనివర్శిటి, సంగీత విభాగం) సమకూర్చగా ప్రముఖనాట్యాచార్యులు పసుమర్తి రామలింగ శాస్త్రి గారు రూపకల్పన, నృత్యదర్శకత్వం వహించారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ నృత్యరూపకంలో ప్రఖ్యాత సినీ దర్శకులు త్రివిక్రం శ్రీనివాస్ గారి సతీమణి సౌజన్య కథానాయక పాత్ర అద్భుతంగా పోషించారు. దాదాపు 40 మంది నృత్యకళాకారులు ఈ నృత్యరూపకంలో పాల్గొన్నారు. హైదరాబాద్, మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం(17-12-21) సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, సంగీత దర్శకులు తమన్, నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ మొదలయిన ప్రముఖులెందరో హాజరయి నిండుదనం సమకూర్చారు.

Pavan Kalyan lighting the lamp

దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ నృత్యరూపకంలో కథాసందర్భంగా పాటలు, పద్యాలు రసవత్తరంగా రూపొందించబడ్డాయి. కుచిపూడి సంప్రదాయబద్ధమైన దరువు, శాస్త్రీయ గీతాలతో పాటు తమిళనాట ప్రసిద్దమైన సంప్రదాయ జనపద నృత్యాన్నిఈ ఈ నృత్యరూపకంలో ప్రవేశపెట్టడం.. దర్శకత్వ ప్రతిభకు తార్కాణం!

ముఖ్యంగా కథానాయిక తడాదకై పాత్రలో వీర పౌరుషభావాలను ఆంగీకాభినయాల్లో అద్భుతంగా ప్రదర్శించి, రక్తికట్టించారు. మీనాక్షి ఒక యోధురాలిగా మారే వైనం, సుంద‌రేశ్వ‌ర‌స్వామిని ఆమె పెళ్లాడే ఘ‌ట్టం చూడ్డానికి రెండు క‌ళ్లూ చాల‌వ‌నిపించింది.

ప్రత్యేకంగా ఆమె అభినయానికి బ్నిం గారు రచించిన గీతాలు, వాటికి కూర్చబడిన రాగాలు జనరంజకంగా వున్నాయి. ఆ గీతాలకు సంగీత దర్శకులు డి.ఎస్.వి. శాస్త్రిగారి స్వరరచన, గాత్రం కూడా బహు ప్రశంసనీయంగా సాగాయి. ముఖ్యంగా ఈ రూపకంలో లయప్రాధాన్యత మెండుగా కంపించింది.

Dance bale

భరతనాట్యం, కూచిపూడి నృత్యరీతులలో ఉద్దండులైన పసుమర్తి రామలింగ శాస్త్రిగారు అత్యద్భుతమైన నట్టువాంగంతో… ఆద్యంతం హృద్యంగా సాగిన ‘మీనాక్షి కళ్యాణం’ కూచిపూడి చరిత్రలోనే ఓ అపురూపమని నృత్యరూపకంలో పాల్గొన్న కళాకారులను అభినందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను గౌరవించుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉందన్నారు. కూచిపూడి లాంటి సంప్రదాయ కళలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాలన్నారు. మీనాక్షి పాత్రలో సౌజన్యను చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్లు వుంది అన్నారు.

మామిడి హ‌రికృష్ణ మాట్లాడుతూ… “సౌజ‌న్యా శ్రీ‌నివాస్ గారు, ఆమె బృందం ఇచ్చిన‌ చిర‌స్మ‌ర‌ణీయ ప్ర‌ద‌ర్శ‌న‌ ఈ సాయంత్రం వేళ మ‌న‌ల్ని అంద‌ర్నీ ప‌ర‌వ‌శింప‌జేసింది. ఒక ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కునిగా త్రివిక్ర‌మ్ గారికి ఉన్న పేరుప్ర‌ఖ్యాతులు మ‌రెవ‌రికీ లేవు. ప‌సుమ‌ర్తి రామ‌లింగ‌శాస్త్రి గారి నృత్య ద‌ర్శ‌క‌త్వం, ప్ర‌త్యేకించి త‌మిళ‌నాడుకు చెందిన సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను ఆయ‌న హైలైట్ చేసిన విధానం ఎంతైనా ప్ర‌శంస‌నీయం” అన్నారు.

ప‌సుమ‌ర్తి రామ‌లింగశాస్త్రి మాట్లాడుతూ… “ఎన్నో ఏళ్లుగా నేను కూచిపూడి సంప్ర‌దాయం మ‌నుగడ గురించి ఆందోళ‌న చెందుతూ వ‌స్తున్నాను. పార్వ‌తీదేవి లేదా ఆమె అవ‌తారాల్లో ఒక‌దానిపై నృత్య రూప‌కం చెయ్యాల‌ని అనుకుంటూ వ‌చ్చాను. ఒక‌రోజు మ‌ధుర మీనాక్షిపై ప్ర‌ద‌ర్శ‌న ఇస్తే బాగుంటుంద‌నిపించి, సౌజ‌న్య‌తో మాట్లాడాను. కొవిడ్ -19 మా ప్లాన్స్‌ను అడ్డుకున్న‌ప్ప‌టికీ, ఈ రూప‌కాన్ని క‌లిసి తీసుకురావ‌డంలో అవ‌స‌ర‌మైన స‌పోర్టును ఆమె అందించింది. వేదిక మీద‌కు పార్వ‌తి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింద‌నుకోండి. మీనాక్షి క‌ల్యాణంతో మ‌న‌ల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేసిన సౌజ‌న్య‌కూ, ఆమె బృందంలోని నృత్య‌కారిణులందరికీ ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నా” అన్నారు.

-బి.ఎం.పి.సింగ్
ఈ నృత్యరూపకం యూట్యూబ్ లో క్రింది లింక్ ద్వారా చూడవచ్చు….

https://www.youtube.com/watch?v=oKFFjMGO6kM

Dance Ballet
Dance Ballet
Dance Ballet
Trivikram Srinivas and Sowjanya
SA:

View Comments (1)

  • ఇలాంటి కళలు కనుమరుగు కాకుండా కాపాడాలి. కళాకారులకు అభినందనలు