సరస్వతీ సంగమం – డా. రాజా..!

2021 ఏప్రిల్ 15న కన్నుమూసిన రాజా గారికి, ఎప్పుడో డాక్టరేట్ వచ్చిన సందర్భంలో మా టీవీ వారు సమర్పించిన పత్రం ఇది)

సంగీత సాహిత్యాలు గంగా యమునలై ఉరకలెత్తే సంగీతంలో.. కనిపించని సరస్వతి నది లాంటి అపారమైన అవ్యక్త నేపథ్య ప్రవాహాన్ని ప్రపంచానికి చూపించాలన్న తపనకి నిలువెత్తు రూపం రాజా. అధ్యయనానికి అదో అనంతసాగరం అని చెప్పడానికి ఆయన చేసిన కృషి ఓ విలువైన నిదర్శనం. మెదడులో మెదలిన ఒక సందేహం తీరే వరకు ఆలోచనల్ని పుటం వేసి, మేలిమి బంగారం లాంటి సమాధానాన్ని వెతికి ఇవ్వడమే రాజా గారు చేసే సాధన. ఆదాయాన్ని వ్యయాల్ని ఆలోచనల్లోంచి తొలగించి, వ్యక్తిగత జీవితాన్ని త్యజించి..పాటకి జీవితాన్ని అంకితమిచ్చి….
40 వేల పాటల గుణగణాల్ని ఎలాంటి ప్రభావాలకూ తూగకుండా నిగ్గు దేల్చడమే రాజా గారికి మ్యూజికాలజిస్ట్ అరుదైన, అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. బయటి ప్రపంచానికి పాట గురించి ఒక విషయం చెప్పే ముందు దానికి ఎంత స్పష్టత, సాధికారత, ప్రామాణికత, వాస్తవికత ఉండాలో గుర్తెరిగి..తను త్రికరణ శుద్ధిగా నమ్మితే గానీ బయట పెట్టక పోవడమే రాజా గారికి ఇంత గుర్తింపు రావడానికి పునాది. ఒక అమూల్యమైన పాటను సంపాదించడానికి పడ్డ వేదన,
దాని లోతుల్లోకి వెళ్లి కాలాతీతంగా జరిగే శోధన – ఒక అక్షరం కాగితం పైన పెట్టే ముందు సంఘర్షణ, వెనుక జరిగే మథన రాజా గారు ఒక్కరే పడతారు…

ఫలాలు మనకందిస్తున్నారు. పాటంటే కేవలం మూడు నిమిషాల శ్రుతక్రియ కాదు.. అదో పరిక్రమ అని నిత్యసత్యమయ్యే స్థాయిలో వాస్తవాన్ని డంకా మోగించి, ఆవిష్కరించడంలో రాజా గారి దమ్ము అనుపమానం. ఎందుకంటే – పోలికకు ఎక్కడో గానీ ఇలాంటి వ్యక్తులు కనిపించరు.

సాహితీ విలువల రహస్యాలు, స్వరసంగమంలోని గమ్మత్తయిన సంగతులు, ఎక్కడో ఓ మూల వినిపించే విశిష్టమైన ఓ పరికరం తాలూకు విశేషాలు, ఆ నిపుణుడి విద్వత్కాంతులు..ఇలా పాటలోని ఏ ఒక్క అంశాన్నీ వదలక
తూచే గీటురాళ్లు రాజా గారి దగ్గర వేనవేలు. వాటికి లభించిన ప్రశంసలు అనేకం. – శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వంటి గంధర్వగాన కోవిదుడు, సిరివెన్నెల వంటి సాహితీ కర్షకుడు మొదలు ఎందరో లబ్దప్రతిష్టులు రాజా గారి విశేషమైన కృషికి అక్షర నీరాజనాలిచ్చారు.

గేయరచయితలు, సంగీత దర్శకులు సినిమా పాటకి సంబంధించి ఏ సందేహం వచ్చినా మొట్టమొదట సంప్రదించేది రాజా గారినే. ఒక ఆసక్తి కలగడం, దాన్ని ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ రావడం, ఆ రంగానికి అసమానంగా సేవ చేయడం, తద్వారా ఎందరికో ఉపయోగపడే కంటెంట్ కోసం ‘రాజా మ్యూజిక్ బ్యాంక్’ పేరుతో ఒక సైట్ ఏర్పాటు చేసి, ఓపిగ్గా నిర్వహించడం..ఏమీ ఆశించకపోవడం…ఎప్పటికప్పుడు కొత్త సమాచారం చేర్చడం – చిన్న విషయం కాదు.
దానికి – పాట లోపల్లోపల నిత్యం రగిలిస్తూ ఉండాలి…ఆ సెగలు ఎగిసి పడుతూ ఉండాలి. రాజా గారిలో నిత్యం అదే జరుగుతుంది.

కానీ సరస్వతి నది లాగే అది ఆయన ముఖంలో కనిపించదు. ఆయన మౌన చిద్విలాసాల వెనుక తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.
దీర్ఘాయుష్మాన్ భవ !

రచన : గోపరాజు రాధాకృష్ణ

SA: