‘నవోదయ రామ్మోహన్ రావు ‘ జ్ఞాపకాల దొంతరలు …

పుస్తక ప్రేమికునికి అక్షర నైవేద్యం  …
“పుస్తకం లేని ప్రపంచం రాబోతుందనేది వాస్తవం కాదు. పుస్తకం మరణం లేనిది, పుస్తకానికి ప్రత్యామ్నాయం లేదు ఉండబోదు.” ఇది ‘నవోదయ రామ్మోహన్ రావు ‘ గారు చెప్పిన మాటలు కాదు, నమ్మిన మాటలు.
పుస్తకం అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. పుస్తక ప్రచురణ అంటే ఆయనకు ఆరో ప్రాణం. పుస్తకం చదివే వారు అంటే వారికి అభిమానమూ – ఆరాధన. అందుకేనేమో ఇప్పుడు ఆయనకు నివాళిగా “నవోదయ రామ్మోహన్ రావు ప్రస్థానం ” పేరుతో ఒక పుస్తకం ప్రచురించి… ఆయనతో ఉన్న జ్ఞాపకాలనూ, పుస్తక ప్రచురణ రంగంలో ఆయనకున్న అనుభవాలను కొందరు రచయితలు.. మరికొందరు పుస్తక ప్రేమికులు వారి జ్ఞాపకాలను ముందు తరాలకు అందించే ప్రయత్నం చేశారు.
ఇందులో సుమారు 75 మంది రాసిన వ్యాసాలు, చివరిలో రామ్మోహన్ రావు గారి జీవితంలో ముఖ్యమైన ఛాయాచిత్రాలు, నవోదయ పుస్తకాల కేటలాగ్ వున్నాయి.ఆరు దశాబ్దాల చైతన్యం నింపుకున్న ఏడుపదుల పుస్తక ప్రేమికుని గురించి… “మాకిదే పెద్ద పండుగ ” అంటూ .. ఖాదర్ మొహిద్దీన్, “తెలుగు పుస్తకానికి నవోదయం ” – పన్నాల సుబ్రమణ్య బట్టు, “పుస్తకాల గుళ్ళో ధ్వజస్తంభం నవోదయ ” – డాక్టర్ జి.వి. పూర్ణచంద్, “రచయితలను ప్రేమించిన ప్రచురణ కర్త “- శ్రీరామచంద్రమూర్తి, “ప్రగతిశీల ప్రకాశకుడు” – జంపాల చౌదరి, ” ఒక జ్ఞాపకం – ఒక ఆదర్శం ” – వాసిరెడ్డి నవీన్, “నాకు ప్రేరణ నిచ్చిన నవోదయ ” – బి.వి. పట్టాభిరామ్, “నవోదయతో నా ప్రేమ ” – పి. సత్యవతి, “ఎప్పటికీ కొండంత అండ ” –  కార్టూనిస్ట్ శంకు, “భువనవిజయం గుర్తొస్తుంది” – భరద్వాజ, “నాలో నవోదయం ” బ్నిం…. వీరే కాక ఇంకా … ముళ్ళపూడి వెంకటరమణ, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, బాపు రమణ గార్ల పిల్లలు చెప్పిన వేసవి విడిది కబుర్లు, పుస్తకం.నెట్ వారు రామ్మోహన్ రావు గారితో నిర్వహించిన ఇంటర్ వ్యూ, ముళ్లపూడి శ్రీదేవి తదితరులు చెప్పిన ఎన్నో జ్ఞాపకాలు చదువుతుంటే నవోదయ పుస్తక ప్రపంచం లో నిర్వహించిన పాత్ర, రామ్మోహన్ రావు గారి మూర్తిమత్వం మన కళ్ళముందు కదలాడుతుంది.
పుస్తక ప్రేమికులు నవోదయ అభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకమిది. శ్రీశ్రీ ప్రింటర్స్ వారు అభిమానంతో, అందంగా ప్రచురించిన ఈ పుస్తకం కావలసినవారు 9246182977 నంబర్ లో సంప్రదించండి.

– కళాసాగర్ 

SA:

View Comments (3)