ఆంగ్లం లేకుండానే ఆర్థిక ప్రగతి

ఒక ప్రపంచ పౌరుడికి ఎంతటి పరిజ్ఞానం కావాలో అంత పరిజ్ఞానం పదవ తరగతి లోపు తరగతుల పుస్తకాల్లో ఉంటుంది.

నిజానికి చాలా వృత్తులకు ఆంగ్లం, ఇతర భాషలు అవసరమేలేదు. మంగలి, చాకలి, భవన నిర్మాణ కార్మికులు, కోళ్ళ పెంపక క్షేత్రాలు, పాల ఉత్పత్తుల వ్యాపారాలు ఇలా ఎన్నో వృత్తులు. వీటన్నింటికీ సాధారణ పరిజ్ఞానం చాలు. దేశ ఆర్థిక మనుగడకు ఆధారమైన పలు వృత్తులకు ఆంగ్లం అవసరమే లేదు. పైగా ఉన్నత విద్య అందరికీ బలవంతంగా అందించాల్సిన అవసరం లేదు. పదవ తరగతి వరకు శ్రద్ధగా చదివితే చక్కటి పరిజ్ఞానం అబ్బుతుంది. అయితే తెలుగులోనే చదవాలి. ఒక ప్రపంచ పౌరుడికి ఎంతటి పరిజ్ఞానం కావాలో అంత పరిజ్ఞానం పదవ తరగతి లోపు తరగతుల పుస్తకాల్లో ఉంటుంది. చెప్పేవారు సరిగా చెప్పక, చదివేవారు శ్రద్ధగా చదవక, చదివిన దాన్ని నిత్యజీవితంలో ఆచరించక, పరీక్షల తర్వాత అంతా మరచిపోయే వారికి జ్ఞానశేషం ఎలా మిగులుతుంది? అందువల్ల నేడు చదువుకున్నవారు విద్యాగంధం లేని అక్షరాస్యులుగా కాలం గడుపుతున్నారు. అందుకే ఎవరు చదువరులుగా మారుతారో వారి వృత్తుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. అది వృత్తి గౌరవాన్ని కాపాడుతుంది. వైద్యం, యాంత్రికశాస్త్రాలు, చరిత్ర, వ్యవసాయం, రోదసి శాస్త్రం మొదలైన వాటి అధ్యయనానికి ఉన్నత విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు అవసరం. దేశానికి వెన్నెముకగా ఉండే పలు వృత్తులకు వృత్తివిద్యా కోర్సులు చాలు. ఎక్కువమంది ఈ రంగాల్లోనే ఉంటారు. ఇతర దేశాల్లో జరుగుతున్నదిదే.

ఇదంతా ఆంగ్ల వ్యతిరేకత కాదు. నిజానికి రెండవ, మూడవ భాషను నేర్చుకుంటే మెదడు ఆరోగ్యంగా తయారవుతుంది. రెండు భాషల మాట్లాడే వారు ఇతరులను సులభంగా అర్థం చేసుగోలరు. రెండు భాషలను అవలీలగా నేర్చుకునే సత్తా మన మెదడుకుంది. ఒకేసారి కాక, ఒక భాష తర్వాత మరొకటి నేర్చుకుంటే సులభంగా ఉంటుందని పరిశోధనలు నిరూపించాయి. అయితే మొదటి భాషలోనే విద్యార్జన జరగాలి. రెండవ భాషలో విద్యార్జన పూర్తిగా లోపభూయిష్టం. ఈ విషయం భాషా ఉద్యమకారులందరికీ తెలుసు. రెండవ భాషలో, అనగా ఆంగ్లంలో, చదివితే విద్యార్థులు ఆంగ్లం నేర్చుకుంటారా లేక పాఠ్యాంశాలనా? రెండూ ఒకేసారి రావటం అసంభవం. రెండవ భాషను భాషగానే నేర్చుకోవాలి. ఆ తరువాత వారి రంగం, అభిరుచిననుసరించి రెండవ భాషలో పుస్తక పఠనం చేస్తే ఆయా రంగాల్లో సాంకేతిక పదాలు అవగతమవుతాయి. దానివల్ల చాలా ఉపయోగాలున్నాయి. కొత్త భాషను నేర్చుకుంటే ఇతరులపట్ల సహానుభూతి పెరుగుతుంది, అలవాటైన ఆలోచనా విధానం నుంచి మెదడు విముక్తమై స్వేచ్చగా ఆలోచిస్తూ, సృజనాత్మకతను సంతరించుకుంటుంది. అన్ని భాషలు సమానం, ఒకటి ఎక్కువ కాదు, మరొకటి తక్కువ కాదని తెలుస్తుంది.
డా. పొత్తూరు రంగనాయకులు

SA: