తెలుగు నాటకరంగానికి ఊపిరి – ఎ.ఆర్. కృష్ణ

( నవంబర్ 13 న పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ గారి జయంతి సందర్భంగా)

1926, నవంబర్, 13 తెలుగు నాటకరంగానికి ఊపిరిపోసిన రోజు ఈ రోజే. గుంటూరు జిల్లా పెరవలిలో జన్మించిన అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి (ఎ.ఆర్. కృష్ణ) నాటకరంగాన్ని ఉద్దరిస్తాడని, అనేక కళారూపాలకు కర్త, కర్మ, క్రియ అవుతాడని ఎవరూ ఊహించలేదు. నాటకోద్దరణ కోసమే ఆయన ఈ లోకంలో అడుగు పెట్టాడని ఎవరూ అనుకోలేదు. ఎ.ఆర్. కృష్ణ విద్యాభ్యాసం కృష్ణాజిల్లాలో జరిగినా, హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసినా, ఆయన మనస్సు నాటకరంగం వైపే పరిగెత్తింది. ఈ రంగంలో ఆయన చేసిన కృషి వల్లే అంతర్జాతీయంగా మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. నాటక రంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టనివి. ఆయనికున్న చొరవ, తెగింపు, ఎవ్వరికీ లేవనే చెప్పాలి. నాటకం కోసం ఎవ్వరినీ లెక్కచేయని మనస్తత్వం ఆయనది. తనకు ఇష్టమయిన నాటకరంగంలో నిర్విరామంగా కృషి చేయాలన్న ఆలోచనతో శ్రీమతి కమలాదేవి ఛటోపాధ్యాయ గారి స్పూర్తితో 1952లో ఇండియన్ నేషనల్ ధియేటర్ హైదరాబాద్ శాఖ ప్రారంభించారు. తదుపరి 1955లో భారతీయ నాట్య సంఘ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ భారతీయ నాట్య సంఘానికి అనుబంధంగా హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం ఏర్పడింది. దీనికి కృష్ణగారు కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు.
1956లో కృష్ణగారి సారధ్యంలో సికింద్రాబాద్ లో ఆంధ్రప్రదేశ్ థియేటర్ ఫెస్టివల్, ఆంధ్రనాటక కళా పరిషత్ నాటక పోటీలు నిర్వహించబడ్డాయి. 1957లో ఆయన కృషి, పట్టుదల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీని ఏర్పాటుచేయడం జరిగింది. 1959లో ఈ అకాడమీ, రవీంద్ర భారతి, ఎగ్జిభిషన్ సొసైటీ సంయుక్తంగా కృష్ణగారి సారధ్యంలో 40 రోజులు సంగీత, నాటక, నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అదే సంవత్సరం “ఓల్డ్ విక్ బ్రిటిష్ ధియేటర్ ట్రూప్” చేత “బ్రిటిష్ కౌన్సిల్స్”నాటక ప్రదర్శనలను కూడా నాట్య సంఘం హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ కార్యక్రమాలన్నిటిలోనూ కృష్ణగారి కృషి శ్లాఘనీయం.
నాట్య సంఘం నిర్వహించిన అతి ప్రధానమయిన కార్యక్రమాలలో “నాట్యవిద్యాలయ” నిర్వహణ ఒకటి, నాటక రంగానికి సంబంధించిన వివిధ శాఖలలో శాస్త్రీయమైన శిక్షణను గొరిపే ఈ విద్యాలయం ఉన్నత ప్రమాణాలకు కాణాచిగా నిలిచింది. ఈ నాట్య విద్యాలయం కి, 1959లో ఆరుమాసాలపాటు మొదలయిన శిక్షణ కార్యక్రమానికి అబ్బూరి రామకృష్ణారావు గారు ప్రధాన ఆచార్యులుగా వ్వవహరించారు. తరువాత ఈ విద్యాలయం రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలుగా వుండే సమగ్రమైన శిక్షణను ప్రవేశపెట్టింది. ఎ.ఆర్, కృష్ణగారి సారధ్యంలో నడిచిన ఈ నాట్య విద్యాలయంలో నాటకరంగంలో పండిపోయిన అధ్యాపకుల్ని ఆహ్వానించి విద్యార్థులికి నాటకానికి సంబంధించిన వివిధ శాఖలలో అవగాహన కల్పించేవారు. నాటకరంగానికి యువతకి అవకాశం కల్పించడం, తద్వారా నాటకాన్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్ళాలనే సదుద్దేశంతో కృష్ణగారు, నాట్యసంఘం ఆశయాలలో ముఖ్యమయిన ఈ శిక్షణా సంస్థకి అంకురార్పణ చేసారు. ఈ సంస్థలో నాటకరంగ నిష్ణాతులు పోణంగి శ్రీరామ అప్పారావుగారు, సముద్రాల గోపాలమూర్తి గారు, బక్ష్మీ శ్రీరామ్ గారు, హెచ్.వి. శర్మగారు, మంత్రి శ్రీనివాసరావు గారు విద్యార్ధులికి ధియేటర్ లోనూ ప్రాక్టికల్స్ లోనూ శిక్షణ ఇచ్చేవారు. అలాగే కృష్ణగారి మార్గదర్శకత్వంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులికి, ప్రభుత్వ కళాశాలల లెక్చరర్లకి స్పెషల్ సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించారు.
సంప్రదాయ కళారూపాలైన వీధినాటకం, తోలు బొమ్మలాటలు పద్య నాటకాలపైనా పరిశోధన జరిపారు. కృష్ణగారికి ప్రయోగాత్మక నాటకాలంటే ఇష్టం. అందుకే ఉన్నవ లక్ష్మీనారాయణగారి “మాలపల్లి”ని జీవనాటకంగా మలిచి, వంద ప్రదర్శనలు పూర్తిచేసారు. తెలుగు నాటకరంగంలో అద్భుతమైన ప్రయోగంగా చరిత్ర సృష్టించిన ‘మాలపల్లి’ ఒకేసారి 12 రంగస్థలాలపై ప్రదర్శించబడింది.
అలాగే, తంజావూరు ప్రభువు శాహాజి రచించిన గొప్ప యక్షగానం ‘సతీదానశూరం’ ఈ నాటకాన్ని వీధినాటకశైలిలో కృష్ణ తీర్చిదిద్దారు. ఈ యక్షగానం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, రాష్ట్రతర ప్రాంతాలలో కూడా ప్రదర్శించారు. అలాగే కృష్ణగారు మంచి నిర్వాహకుడే కాదు. గొప్ప నటుడు, రచయిత కూడా. ఆయన అనేక నాటకాలోల వైవిధ్య భరితమయిన పాత్రలు పోషించారు. “వీలునామా”, “కన్యాశుల్కం, “సంరక్షకుడు” “ఆదర్శమూర్తి”, “ప్రతాపరుద్రీయం”, “మృచ్ఛకటికం”, “మాలపల్లి”, “పెద్దమనుష్యులు”లో వారి నటన అద్వితీయం, ముఖ్యంగా “కన్యాశుల్కం”లో రామప్ప పంతులు పాత్రలో జీవించారు. అంతేకాకుండా ఎవరిలో టాలెంట్ వుందో గ్రహించి వాళ్లను ప్రోత్సహించేవారు. వారు సానబట్టిన నటులలో ముఖ్యులు శ్రీయుతులు దుగ్గిరాల సోమేశ్వరరావు, నూతన ప్రసాద్, రవీంద్రరెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ, డి.ఎస్. దీక్షిత్, భవదీయుడు, కనకాల లక్ష్మీదేవి. 1962లో చైనా దురాక్రమణ సందర్భంగా శ్రీ పి.వి. నరసింహారావు గారు కృష్ణగారికి “అగ్నిపరీక్ష” నాటకం ప్రతిని ఇచ్చి రంగస్థలం మీద ప్రదర్శించమని ఆదేశించారు. ఆ నాటక ప్రదర్శన విజయవంతమయింది.
1981లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, నాటకరంగాన్ని ప్రోత్సహించడానికి నాటక అకాడమీ, రిపక్టరిని ఏర్పాటు చేసింది. అయితే, రిపక్టరి డైరెక్టర్ గా ఎ.ఆర్. కృష్ణ నియమితులయ్యారు. ఈ రిపర్టరి ద్వారా శ్రీ కృష్ణరాయబారం, భక్తరామదాసు, మహామంత్రి మాదన్న, అభిజ్ఞాన శాకుంతలము మొదలయిన నాటకాల్ని కృష్ణగారు రూపొందించారు.
ఆయన దర్శకత్వం వహించిన ప్రతి నాటకంలోనూ ఏదో కొత్తదనం, ప్రయోగం మనకు కనిపిస్తాయి. జీవితంలోంచి నాటకం పుడితే – నాటకంలో జీవితం చూపించాలని కృష్ణ తపన, ఆరాటం.
ఆధునిక తెలుగు నాటకరంగానికి పితామహుడు ఎ.ఆర్. కృష్ణ. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు చేసి, నాటకరంగానికి సంబంధించిన అంశాలలో ఎంతో అధ్యయనం చేసి, ఇతర భాషా రంగస్థల ప్రముఖుల మెప్పుపొందారు. ఉత్తమ వ్యక్తిత్వానికి ఆయనే నిదర్శనం. అసూయ, అహంభావం ఆయనకు కడు దూరం. ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక సంస్థ. ఒక నాటక రంగ విజ్ఞాన సర్వస్వం. కృష్ణగారిలోని కార్య దక్షత, తెగింపు, చొరవ, పట్టుదల, క్రమశిక్షణ ప్రతి నాటక సమాజంలోనూ, ప్రతి నటుడిలోనూ వుంటే మన నాటకరంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.
ఆయనకి శిష్యులుగా వుండడం మాకందరికీ గర్వకారణం. నాటక రంగానికి ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రధానం చేసింది. 1992 నవంబర్ 10 న నటరాజులో ఐక్యమయ్యారు.
-పి. పాండురంగ (9440172396)

SA: