నటనలో ప్రఖ్యాతుడు – రాజకీయ విఖ్యాతుడు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 35

తెలుగుదనానికి ప్రతీకగా యావత్ తెలుగు జాతికి ప్రతినిధిగా ఈ నేల నాలుగు చెరగులా వెలిగిన ఆంధ్రుల ఆశాజ్యోతి, వెండితెర వేలుపు, అరుదైన రాజకీయ నాయకుడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు ఓ రైతు బిడ్డగా జన్మించాడు. చిరు ఉద్యోగిగా జీవితం ప్రారంభించి ‘మనదేశం’ సినిమాలో మొట్టమొదటి సారి నటించి, అచిర కాలంలోనే విభిన్నమైన ఆంగికంతో, వాచకంతో అనితర సాధ్యమైన తన ప్రతిభా పాటవాలతో తెలుగు సినిమా రంగాన్ని ఓ మలుపు తిప్పాడు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలలో పలు విభిన్నమైన పాత్రలు పోషించి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శిఖరాన్ని చుంబించాడు. శ్రీకృష్ణునిగా, భీష్మునిగా, శ్రీరామునిగా, శ్రీనివాసునిగా, శ్రీకృష్ణ దేవరాయలుగా, రారాజుగా, రావణ బ్రహ్మగా ఇలా ఎన్నో పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసి నట రారాజుగా తెలుగునాట ప్రతీనోట, ప్రపంచ వ్యాప్తంగా ప్రతీచోట కీర్తింపబడిన జగదేక వీరుడు ఎన్టీఆర్. కేవలం తొమ్మిది నెలల పాటు చైతన్య రథంలో తనకే సొంతమైన విలక్షణ శైలిలో ఆంధ్రరాష్ట్ర మంతటా పర్యటించి, ప్రసంగించి ప్రజలను చైతన్యవంతులను చేసి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఓ నూతన చరిత్రను సృష్టించిన ఘనుడు ఎన్టీఆర్. పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టాలన్న సదుద్దేశ్యంతో కే.జీ.రెండు రూపాయల బియ్యం వంటి పథకాలు, పేద ప్రజానీకానికి సొంత ఇళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు, విశాలమైన రోడ్డు రవాణా ప్రాంగణాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడి, తెలుగు జాతి ఖ్యాతిని పెంచాడు. దేశ రాజకీయాల్లో తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజానీకానికే కాక తెలుగు భాషా ప్రచారానికి కూడా ఎనలేని సేవ చేసి, తెలుగుదనానికి మూలధనంగా భాసిల్లిన తెలుగు వల్లభుడు ఎన్టీఆర్ నేటికీ మన ధృవతార!

(నందమూరి తారక రామారావు జన్మదినం 28 మే 1923)

SA:

View Comments (1)