ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు

ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం…
నేను అనగా పింగళి వెంకయ్య గారి మనవడు పింగళి దశరధరామ్ (ఎన్ కౌన్టర్ దశరధరామ్) భార్య పింగళి సుశీలగా ఒక విషయం తెలియపరచవలసిన సందర్భం వచ్చినది. పింగళి వెంకయ్య గారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పరశురామయ్య గారు, భార్య హైమవతి, చిన్న కుమారుడు హేరంభ చలపతిరావు ఆయన భార్య జానకీ దేవి వీరు నలుగురు దాదాపు 25 సం.లు క్రితమే చనిపోయారు. వెంకయ్య గారి ఏకైక మనవడు ఎన్ కౌన్టర్ దశరధరామ్ కూడా 1985లో హత్యగావింపబడ్డారు. ఆయనకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల ఇది పత్రికా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దశరధరామ్ భార్యగా నేను ఒక విన్నపము చేస్తున్నాను. పింగళి వెంకయ్య గారు జాతీయ నాయకుడు, ఆయన జీవితం భారత జాతి చరిత్రలో ముడిపడి ఉంది. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఈ మధ్య కొన్ని న్యూస్ చానెల్స్ లో పింగళి వెంకయ్య గారి కోడలు ఏలూరులో గుడి మెట్ల మీద బిక్షాటన చేస్తోందని ఆమెకు ప్రభుత్వం సహాయం చేస్తానన్నా తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి. ఒక ఆనాదకి చేయూత నివ్వడం హర్షించ దగ్గ విషయమే కాని ఆమెకు పింగళి వెంకయ్య గారు కోడలుగా ప్రచారం చేయడం చాలా సిగ్గుచేటు. ఆమె పింగళి వెంకయ్య గారి కోడలు కాదు. పింగళి ఇంటి పేరిట చాలా మంది ఉన్నారు. ఆమె ఎవరికి సంబంధించిన వ్యక్తి పూర్తిగా సమాచారం సేకరించి ప్రచారం చేస్తే బాగుండేది. ఆమెకు పింగళి వెంకయ్య గారి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు.

1999 సం.లో శ్రీమతి కె. హెచ్.యస్. జగదంబ గారు శ్రీ పింగళి వెంకయ్య ఛారిటబుల్ ట్రస్ట్ & స్మారకా సంస్థను స్థాపించి ఆయన జీవిత విషయాలను ప్రజానీకానికి అందజేస్తున్నారు. మేము అనగా పింగళి వెంకయ్య గారి వారసులుగా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాము. ఎన్నో రంగాల్లో నిష్ణాతుడైన పింగళి వెంకయ్య గారికి “భారతరత్న’ ఇవ్వడం సముచితంగా భావించి మా సంస్థ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఈ విషయం పరిగణలోకి తీసుకొని ఆయన చరిత్రకు లేనిపోని కథలు అనుచిత వ్యాఖ్యాలు చేయవద్దని మా ట్రస్ట్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. పింగళి వెంకయ్య గారి ఘనతను న్యూస్ చానెల్ ప్రచారం చేసి ఆ ఆంధ్రుడికి దక్కవలసిన గౌరవం దక్కే విధంగా ప్రయత్నిస్తున్నపుడు మా వంతు సహకారం 100 శాతం ఉంటుందని తెలియజేస్తున్నాము.
-సుశీల దశరధరామ్ పింగళి సెల్ : 9440138527

SA: