స్వతంత్ర భారతికి తొలివనితా సారధి

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 45

అతి ఎక్కువకాలం ఓ దేశాన్ని పరిపాలించిన ఏకైక వనితా ప్రధానిగా చరిత్రలో నిలిచిన అరుదైన వనిత, ప్రపంచ నారీ లోకంలో ఘన రాజకీయ చరిత్ర కలిగిన భారతీయ వనిత, చిన్నతనం నుండే తాత, తండ్రుల ధైర్య సాహసాలు పుణికి పుచ్చుకున్న ఇందిరాగాంధీ ఇంగ్లండులో ఉన్నత విద్యను అభ్యసించే రోజుల్లో అక్కడ ఇండియన్ లీగ్ లో సభ్యురాలై తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టి విదేశాలలోనే విద్య అభ్యసించుచున్న పార్శీ కుటుంబానికి చెందిన యువ రాజకీయ నాయకుడైన ఫిరోజ్ గాంధీని పెళ్ళాడి, క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొని భర్తతో జైలుకెళ్ళింది. స్వాతంత్ర్యానంతరం తండ్రితో పాటు దేశ విదేశాలు తిరిగి రాజకీయ రంగంలో ఆరితేరింది.

జవహార్ లాల్ నెహ్రూ మరణానంతరం రాజ్యసభకు సభ్యురాలై లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినేట్ లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖను నిర్వహించింది. లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణాంతరం తొలి మహిళా భారత ప్రధానిగా ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించింది. గరీబీ హఠావో అన్న నినాదానికి అనుగుణంగా పేదరిక నిర్మూలనకు పూనుకొని వ్యవసాయ రంగానికి ప్రభుత్వ పరంగా సాయం చేసి, హరిత విప్లవంతో ఆహార కొరతను అధి గమించింది. బ్యాంకుల జాతీయకరణతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను సుస్థిరం చేసింది. తన చివరి రక్తపు బొట్టునూ భారతదేశ సౌభాగ్యానికే వెచ్చించి, తిరుగలేని నాయకురాలిగా ప్రపంచ చరిత్రను తిరగరాసిన భారతరత్న ఇందిరాగాంధీ నేటికీ మన ధృవతార!

(ఇందిరాగాంధీ జన్మదినం నవంబర్ 19, 1917)

SA: