సంస్కరణల రారాజు – సామాజిక స్పృహలో మహారాజు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 34

ఆధునిక భారత నిర్మాతగా, ప్రముఖ సాంఘిక సంస్కర్తగా వాసికెక్కిన సామాజిక కార్యకర్త రాజా రామమోహన్ రాయ్ బెంగాలీయుడు. విలాసవంతమైన జీవితం గడపగలిగిన ధనవంతుడైనప్పటికీ రామమోహనరాయ్ సన్యసించి, జీవిత లక్ష్యాన్ని మరింత మంచి మార్గంలో నడిపించి, అత్యాధునిక సంస్కరణలతో భారతీయ చరిత్రలో అగ్రగణ్యుడై నిలిచాడు. బాల్య  వివాహాలు, సతీసహగమనం వంటి నాటి సమకాలీన సామాజిక జాడ్యాలను రూపుమాపటానికి నడుంబిగించి కృతకృత్యుడైనాడు. నాడు వున్న విద్యా విధానాన్ని సమూలంగా సంస్కరించి రాబోయే కాలానికి తగినట్లుగా తన సొంత ఖర్చుతో ఆంగ్ల కళాశాలను స్థాపించి భారతీయులకు ఆంగ్లం, గణితం, విజ్ఞాన శాస్త్రాలు బోధించేలా చేశాడు. ఢిల్లీ రాజుగారి భరణం సమస్యను సతీసహగమన చట్టం గురించి చర్చించటానికి ఇంగ్లాండుకు వెళ్ళి, వారితో చర్చించి తాను అనుకున్నది సాధించి, భారతదేశం తిరిగివచ్చి రాజా అనే బిరుదాన్ని పొంది రాజారామమోహన్ రాయ్ గా మారాడు. బెంగాలీలో ఆయన రచించిన గౌడీయ వ్యాకరణం ఆయన రచనల్లో ఉత్తమమైనదిగా నిలిచింది. వార్తాపత్రికలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వుండాలని నాటి బ్రిటీష్ పాలకులతో ధైర్యంగా పోరాడిన ధీశాలి. మూఢవిశ్వాసాలను విడనాడి, దైవం నిరాకారుడని అందరినీ నమ్మేలా చేసిన ఈ బ్రహ్మసమాజ స్థాపకుడు, ప్రపంచానికి మార్గదర్శకుడైన సామాజిక సంస్కర్త రాజా రామమోహన్ రాయ్ నేటికీ మన ధృవతార.

(రాజా రామమోహన్ రాయ్ జన్మదినం 22 మే 1772)

SA: