40 ఏళ్ల క్రితమే యువతరాన్ని కదిలించిన ‘చిత్రం ‘

యువతను ఉర్రూతలూగించిన రెడ్ స్టార్ కామ్రేడ్ మాదాల రంగారావు నటించిన ‘యువతరం కదిలింది’ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయ్యాయి. విప్లవ కథానాయకుడు, ‘రెడ్ స్టార్’ కామ్రేడ్ మాదాల రంగారావు స్వయంగా కథను సమకూర్చి, నటించడంతో పాటు స్వీయ సారధ్యంలో నిర్మించిన చిత్రం ‘యువతరం కదిలింది’ దర్శకుడు ధవళ సత్యం. 1980 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పటి యువతరాన్ని ఉర్రూతలూగించి, ఉవ్వెత్తున కదిలించి, సంచలన విజయం సాధించింది ఈ చిత్రం. ఇందులో మురళి మోహన్, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతం టి.చలపతిరావు అందించారు. పాటలు డా. సి.నారాయణ రెడ్డి రాసారు. అంతే కాకుండా ట్రెండ్ సెట్టింగ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు అందుకోవడంతోపాటు, ఉత్తమ కథా రచయితగా మాదాలకు ఉత్తమ నటుడిగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి కూడా నంది అవార్డులు తెచ్చి పెట్టింది! అప్పటి రాష్ట్రపతి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసించిన ఈ చిత్రం ‘సితార, కళాసాగర్’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా అందుకోవడం విశేషం.

జీవితమంతా పోరాటం….
మాదాల రంగారావు పేరు నేటి యువతరానికి పెద్దగా తెలియకపోవచ్చుగానీ….కనీసం 45 ఏళ్ల వయసు పైబడిన వారికి మాదాల పేరు చెప్పగానే కళ్లముందు ఎర్రజెండా రెపరెపలాడుతుంది. ముందుడు వేసి, రొమ్ము విరిచి, పిడికిలి బిగించిన రూపం రూపుదాల్చుతుంది. ఆయన పేరు వినగానే విప్లవం అనే పదం నోట పలుకుతుంది. మాదాల పేరు చెప్పగానే ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, యువతరం కదిలింది, ఎర్రమట్టి, ప్రజాశక్తి తదితర సినిమాలు, వాటిలోని దృశ్యాలు, విప్లవ గీతాలు కళ్లముందు మెదులుతాయి. మాదాల రంగారావు వెండితెరపై ఎరుపు మెరుపులతో, ప్రేక్షక జనాన్ని ఉరకలెత్తించిన కథానాయకుడు.
ప్రజలను చైతన్యం వైపు నడిపించే ఆయన సినిమాలు సహజంగానే పాలకుల ఆగ్రహానికి గురయ్యాయి. వాటిని సెన్సార్ గడప దాటించడానికి పోరాటమే సాగించాల్సివచ్చేది. ఎర్రమట్టి సినిమా బయటకు రావడానికి ఐదేళ్లు పట్టింది. మావోయిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్యతో కలిసి చేసిన ఎర్రపావురాలు అనే సినిమా నేటికీ విడుదలకు నోచుకోలేదంటే మాదాల చిత్రాలు ఎంత నిరం్బధాన్ని ఎదుర్కొన్నాయో అరం చేసుకోవచ్చు. విప్లవశంఖం విడుదల కాకుండా కేంద్ర సెన్సార్ బోర్డు అడ్డువేస్తే… దాని విడుదల కోసం నాటి కమ్యూనిస్టు ఎంపిలు ఇంద్రజిత్ గుప్త (సిపిఐ), సమర్ ముఖర్జీ (సిపిఎం) పార్లమెంటు లోపల పోరాడారు. మరోవైపు బయట అనేక మంది వామపక్ష వాదులు నిరాహార దీక్షలు చేశారు. అప్పుడుగానీ సినిమాకు విముక్తి లభించలేదు. మాదాల రంగారావు అగ్రనటుడు ఎన్టీఆర్తో కలిసి ‘తీర్పు’ అనే చిత్రంలో నటించారు. అందులో మాదాల పాత్రకు ప్రశంసలు, అవార్డులు లభించాయి. మాదాల చిత్రాల్లోని విప్లవ గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఆయన చిత్రాలకు అగ్రనటులతో సమానమైన ఆదరణ లభించేది. శతదినోత్సవాలు జరుపుకున్న చిత్రాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గజదొంగ, ఎర్రమల్లెలు ఒకేసారి విడుదలైతే…గజదొంగ కంటే మాదాల చిత్రమే ఎక్కువ రోజులు ఆడిందట. తిరుపతి జయశ్యామ్ థియేటర్లో ఎర్రమల్లెలు 100 రోజులు ఆడింది. ఈ చిత్రాలన్నీ ఆయన తన సొంతంగా ఏర్పాటు చేసుకున్న ‘నవతరం’ బ్యానర్ పైన నిర్మించినవే.

SA: