ఆయన మరణం సాహిత్యోద్యమానికి తీరని లోటు …

‘మా అనంతపురంను ఒక దేశం చేస్తే తప్ప అది బాగుపడదు’ అనేవారు సింగమనేని నారాయణ.

ఆయన టీచరు. కాని అనంతపురము నేలా, మట్టి, ఎడారి, మొండి కంపలు, మోడు గుట్టలు వాటి నడుమ మాసిన గుడ్డలను కూడా పట్టించుకోకుండా బతుకుబాదరబందీలో తిరుగాడే మనుషులు… వీటిని తన పాఠ్యాంశాలుగా ఆయన స్వీకరించారు. పాఠకులను చూచోబెట్టి బ్లాక్‌బోర్డు మీద ఏమి రాసి చూపాలో ఏ కథను బొమ్మకట్టి ఛాతీలకు గుచ్చాలో ఆయనకు తెలుసు.

తెల్లటి పంచె కట్టు, మోచేతుల వరకూ మడిచిన తెల్లటి అంగీ… ‘జాగ్రత్త.. నా వాళ్లంతా పొలాల్లో పనుల్లో ఉన్నారు. వారి ప్రతినిధిగా నేను వచ్చాను. మా హక్కుకు దక్కవలసిన మర్యాద నేను దక్కించుకుంటాను’ అన్నట్టు ఉండేవారాయన.

అనంతపురం మర్యాద, రాయలసీమ మర్యాద, తెలుగు కథ మర్యాద – సింగమనేని నారాయణ.

ఆయన లెఫ్ట్‌ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అరసము ఆయనది. ఆయన అరసానికి. జనం కోసం పని చేశారు. సంఘంలో పెద్దమనిషి. ఇంత పెద్ద అనంతపురం జిల్లాలో ఆవాసయోగ్యమైన ఏ స్థలం అయినా న్యాయంగానే ఆయన పొందవచ్చు. అడిగితే ఇస్తారు. అడక్కపోయినా ఆయన అనుకుంటే ఆయనదే. అద్దె ఇంట్లో ఉంటారాయన. అద్దె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.

‘ఎండ కదప్పా’ అంటారాయన. అనంతపురపు ఎండను ఆయన ప్రీతిగా అనుభవించారు. చివరి రోజుల్లో హైదరాబాద్‌లో ఉంచుదామని కుటుంబం ప్రయత్నిస్తే అనంతపురం గాలికై అలమటించారు. అనంతపురం వచ్చే వరకూ హటం మానితేనా.

సాయంత్రం అవ్వాలి. సింగమనేని గారు విశాలాంధ్ర వరకూ నడిచి రావాలి. దాని బయట కుర్చీ వేసుకు కూచోవాలి. నలుగురూ అక్కడ చేరాలి. కథలు కొలువు తీరాలి. ఇక మీదట కథ అచ్చోట తన ఇంటి పెద్దకై వెతుకులాడుతూ ఉండొచ్చు.

వానకు తడవనివాడూ అనంతపురం వచ్చి సింగమనేని ఆతిథ్యం స్వీకరించనివారూ ఉండరు. పొద్దున మీటింగ్‌కు వచ్చి, తారసపడిన నలుగురిని కలుపుకుని ‘పదండప్పా భోజనానికి’ అని ఇంటికి కబురు పెడితే ఆ హటాత్‌ అతిథుల తాకిడిని అంతే ఆదరంతో స్వాగతించి ఆయన శ్రీమతి ఆరుగురికి భోజనాలు సిద్ధం చేస్తే ఈయన ఎనిమిదిమందితో హాజరైన రోజులు కొల్లలు. కాని ఆ ఇంటి ముద్దది ఆకలి మరిపించే రుచి. సీమ ఆతిథ్యపు కొసరి వడ్డింపు అది.

కుమారుడు, కుమార్తెల జీవితాలు, మనమలు మనమరాండ్ర చదువులు… వీటికి ఇవ్వాల్సిన సమయం సాహిత్యం కోసం ఇచ్చారా అనిపిస్తుంది. ఆయన మూడు విషయాల కోసం అచంచలంగా నిలబడ్డారు. కథ, తెలుగు భాష, రాయలసీమ. కథ రైతు కోసం. భాష బడిపిల్లల కోసం. రాయలసీమ– ప్రజల న్యాయమైన హక్కుల కోసం.

సింగమనేని గారు గొప్ప వక్త. మెస్మరైజ్‌ చేస్తారు. రోజువారి నిద్రమబ్బు ముకాలతో ఉన్న మనల్ని తట్టి లేపుతారు. నువ్వు మంచి కథ రాశావా గంట మాట్లాడతారు. నువ్వు ఏదో ఒక మంచికి ఒక లిప్తైనా నిలబడ్డావా. గట్టిగా హత్తుకుంటారు. శ్రీశ్రీ ఎంత రాశారో ఆయనకు శ్రీశ్రీ కంటే ఎక్కువ తెలుసు. ‘మహా ప్రస్థానం’ కంఠోపాఠం. ఆయనకు అస్తమా సమస్య ఉంది. ఫ్లాస్కులోని వేడినీటిని కాసింత కప్పులో నుంచి గుక్కపట్టి ‘ఓ మహాత్మా… ఓ మహర్షి’ అందుకుంటే వినాలి చెవులున్న భాగ్యానికి. ఏ మారుమూలనో శ్రీశ్రీ వాడిన ఒక మాట సందర్భానుసారం టప్పున వాడి సభ నిస్సారతను చిట్లగొడతారు.

ఆయన సంపాదకులు. విమర్శకులు. కథకుడికి బుద్ధి జ్ఞానం ఉండాలని నమ్మినవారు. కథకుడికి హేతుబద్ధమైన ఆలోచన ఉండాలని అభిలషించినవారు. కథకుడు కురచగా, కాలక్షేపంగా, గాలికి పోయే ఊకగా ఉండటాన్ని ఈసడించినవారు. కథకుడు కలాన్ని హలంగా ధరించి, పనిముట్టగా చేసి, స్త్రీ కంఠస్వరంగా మలిచి, నోరు లేనివాడి నోరుగా చేసి, ఒక దుర్మార్గంపై కూల్చే బండరాయిగా మార్చి ఆనెక కథకుడిననే యోగ్యత పొందాలనే నిశ్చితాభిప్రాయము కలిగినవారు. అట్టి కథకులను ఆయన తీర్చిదిద్దారు. దారి చూపారు. స్ఫూర్తిగా నిలిచారు.

మధురాంతకం రాజారాం గారి తర్వాత కేతు విశ్వనాథ రెడ్డి గారు, సింగమనేని గారు రాయలసీమ నుంచి తెలుగు కథాశిఖరాల వలే నిలబడ్డారు. ఎందుచేత శిఖరము? సాహిత్యంలో కొత్తధోరణి వచ్చింది.. వీరు స్వాగతించారు. సాహిత్యంలో ఒక కొత్త దారి తెరుచకుంది వీరు స్వాగతించారు. స్త్రీవాద, దళిత, మైనారిటీ సాహిత్యాలకు దన్నుగా నిలిచారు. శిఖరం అనిపించుకోవాలంటే ఆ ఔన్నత్యం ఉండాలి.

ఆయన నా ప్రతి పుస్తకాన్ని అనంతపురం విశాలాంధ్రలో కొని ఒక సెట్‌గా తన షెల్ఫ్‌లో ఉంచుకున్నారు. ‘చూడప్పా.. నీది మాత్రం జాగ్రత్తగా పెట్టుకున్నా’ అన్నారు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు. భోజనం వేళ దాటిపోయింది ఆ సమయాన. ఉల్లిపాయ వేసిన ఆమ్లెట్‌ను పెట్టకుండా ఆయన పంపిస్తాడా ఏం?

ఆయన కథ ‘అడుసు’ను నేను ‘బ్రహ్మ కడిగిన పాదం’ అని రీటెల్లింగ్‌ చేస్తే ఆయన ఎంత సంతోషడ్డారో. రైతుపాదాన్ని దేవతలు, పాలకులు ఎన్నిసార్లు కడిగితే రుణం తీరుతుందనే నా వ్యాఖ్యకు పొంగిపోయారు.

ఫోన్‌ చేస్తే ‘ఖదీరూ’… అని అవతలిపక్క ఖంగున మోగే ఆయన గొంతు ఇక వినపడదు.

హైదరాబాద్‌ నుంచి అనంతపురం తిరిగి వచ్చేశాక ఆయనను ఫోన్లకు దూరంగా వుంచిన శ్రీమతి నేను ఫోన్‌ చేస్తే మాత్రం ఇచ్చారు. ‘సార్‌.. సార్‌’ అన్నాను. ‘ఏం రాస్తున్నావు ఖదీరూ’ అన్నారు. ‘వినపడటం లేదప్పా’ అని నీరసించారు.

అది ఆఖరు.

తెలుగు కథ ఒక గొప్ప కథా ఉపాధ్యాయుణ్ణి నేడు కోల్పోయింది. మీకు నా కన్నీరు సార్.‌
– మహమ్మద్‌ ఖదీర్‌బాబు
_______________________________________________________________________

సింగమనేని మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు!

ప్రఖ్యాత ప్రగతిశీల రచయిత, సాహిత్య విమర్శకుడు ప్రజా రంజక ఉపన్యాసకుడు సింగమనేని నారాయణ గారు ఈరోజు అనగా 25 ఫిబ్రవరి 2021న కన్నుమూశారు. వారి మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు!
సాహిత్యకారుడిగా అనునిత్యం సాహితీ సృజన కావిస్తూ కూడా కరువు పీడిత అనంతపురం జిల్లా రైతాంగ ఆందోళనలతో సింగమనేని ప్రత్యక్షంగా మమేకమయ్యారు . అంతేకాక ఒక ఉపాధ్యాయుడిగా, సింగమనేని రామకృష్ణయ్య గారి అనుచరునిగా ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. సాహిత్య వేదికలపై నుండే కాక అనేక ప్రజాతంత్ర ఉద్యమ వేదికల నుండి కూడా ప్రజావాణిని సింగమనేని వినిపించేవారు.
తన 78 ఏళ్ల జీవితంలో సాహిత్య, ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమాలతో మమేకమై సాగిన సింగమనేని సాహిత్య ఉద్యమంలో కథా రచయితగా, సాహిత్య విమర్శకునిగా, సాహిత్యకారుల ‘మున్నుడి’ మాటల పెద్దగా ప్రశంసనీయమైన కృషి చేశారు. తెలుగునాట మహాకవి శ్రీశ్రీ గురించి ప్రత్యేకించి మహాప్రస్థానం పై సాధికారంగా మాట్లాడగలిగిన చాలా కొద్దిమందిలో సింగమనేని కూడా ఒకరు. అంతేకాక , చాలామంది రచయితలు తెలుగు భాష భవిష్యత్తుకు రానున్న ప్రమాదాన్ని పసిగట్టలేని స్థితిలో ప్రజల మాతృభాషలోనే విద్యాబోధన తప్పనిసరి అంటూ జనసాహితి తో గొంతు కలిపి అనేక వ్యాసాలను, మహోపన్యాసాలను ఆయన చేశారు.
సింగమనేని మొదటి కథ జూదం ప్రజాసాహితిలో 43 సంవత్సరాల క్రితం (1977 నవంబర్) లో వెలువడింది. ఆయన మొదటి సాహిత్య విమర్శనాత్మక సమీక్షా వ్యాసం దాశరధి రంగాచార్య నవల
‘పావని” పై రాసినది కూడా ప్రజాసాహితి లోనే (1978 ఆగస్టు) వెలువడింది. జనసాహితి మొదటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులలో సింగమనేని ఒకరు. 2007లో జనసాహితి పదవ రాష్ట్ర మహాసభలో సింగమనేని ప్రారంభోపన్యాసం చేశారు. “కరువుసీమ ఆంధ్రజాతికి తరిమెల నాగిరెడ్డి అనే మచ్చలేని మహానాయకుడుని అందించింది” అంటుండేవారు సింగమనేని.
గడచిన ఆరు నెలలుగా అనారోగ్య సమస్యలలో కోలుకోలేని విధంగా చిక్కుకుని ఆయన శాశ్వతంగా ప్రజా జీవితాన్ని వీడి వెళ్లిపోయారు.
సింగమనేని నారాయణ మరణంతో తెలుగు సాహిత్య ప్రపంచo ఒక సాహిత్య దిగ్గజాన్ని , ప్రజా ఉద్యమాలు ఒక గట్టి మద్దతుదారుని కోల్పోయినట్లయింది. ఆ విధంగా వారి మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు!
వారి మరణానికి జనసాహితి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతోంది.

డాక్టర్ సూర్య సాగర్ ,
కొత్తపల్లి రవిబాబు,
దివికుమార్,
డాక్టర్ అరుణ,
ప్రజాసాహితి నాగరాజు
డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ
డాక్టర్ జి.వి.కృష్ణయ్య
జనసాహితి ,

25-2-2021

SA: