ఉద్యమ పాట మూగవోయింది

ఎప్పుడొచ్చినా ఆ నవ్వు చెదిరేది కాదు. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ నేతగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా… ఇన్ని దశల్లో చూసిన వేద సాయిచంద్ (39) లో ఎప్పుడూ నవ్వు చెదరలేదు. నన్ను కలసిన రోజే ఇతనికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాను. నేను కల్చరల్ కౌన్సిల్ లో పని చేస్తున్నప్పుడు కలిశాడు పాటగాడిగా. అమెరికా తీసుకెళ్లమని కోరాడు. ఒక పాట పాడమంటే అమ్మ పాట పాడి మధ్యలోనే ఆగి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యో ఇంత ఎమోషనల్ ఏంటి సాయి అంటే… అమ్మ గుర్తుకొచ్చింది సర్ అన్నాడు.

కట్ చేస్తే, కమ్యూనిస్ట్ పార్టీకి గుడ్ బై చెప్పి కెసిఆర్ నాయకత్వంలో ఉద్యమ కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు. బి.ఆర్.ఎస్. కండువా కప్పుకుని కెసిఆర్ కు అండగా నిలిచాడు. పాటగా మారి పరవళ్లు తొక్కాడు. మంచి మనసును గుర్తించే కెసిఆర్ తెలంగాణ వచ్చాక మరింత దగ్గరకు తీసుకున్నాడు. రాష్ట్ర గిద్దంగుల సంస్థ చైర్మన్ గా చిన్న వయసులోనే పెద్ద బాధ్యత అప్పగించారు.

ఎవరిని అయినా అన్న అని ఆప్యాయంగా పిలిచే సాయిచంద్ అప్పుడప్పుడు ఫోన్ చేసి తన ఛాంబర్ కు ఆహ్వానించే వాడు. నేను వాయిదా వేస్తూ వస్తా వస్తా అంటుండే వాడ్ని. కానీ ఇక రానక్కరలేదు అంటూ అర్జంటుగా ఏదో పని ఉన్నట్లు ఈ లోకాన్ని వదిలేసాడు. పాట మూగవోయింది.
సాయి చంద్ తన కుటుంబ సభ్యులతో ఫార్మ్ హౌస్ లో ఆనందంగా గడిపేందుకు వెళ్లి అక్కడే రాత్రి అస్వస్థత కు గురయ్యారు. వెంటనే దగ్గరలోని నాగర్ కర్నూల్ లో వున్న గాయత్రీ ఆసుప్పత్రికి తరలించారు. తీవ్ర గుండెపోటుతో చనిపోయినట్లు అక్కడి డాక్టర్ నిర్ధారించారు. అయినా భార్య రజని కి నమ్మబుద్ధి కాలేదు. హైదరాబాద్ గచ్చిబౌలిలో వున్న కేర్ కు తరలించారు. లాభం లేదని వైద్యులు తెలిపారు. పాటతో ఉద్యమానికి ఊపిరి ఊది, బంగారు తెలంగాణ కోసం తన వంతు కృషి చేస్తున్న సాయి చంద్ నవ్వు 39 ఏళ్ళకే ఆగిపోయింది. సాయి చంద్ ఆకస్మిక మరణానికి కె.సి.ఆర్. చలించిపోయారు. అంత్యక్రియలకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. వెంటనే గుర్రం గూడ వెళ్లి సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరడు గట్టిన తెలంగాణ వాది గాయకుడు సాయి చంద్ కు కెసిఆర్ ఇచ్చిన ఘన గౌరవ నివాళి ఇది. కెసిఆర్ భావొద్వేగానికి గురయ్యారు. (అందుకే నాకు కెసిఆర్ అంటే ఇష్టం) మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, యర్రబెల్లి, సబిత, శ్రీనివాస్ గౌడ్ అందరూ కన్నీటి నివాళులు అర్పించారు. మిత్రునికి అశ్రు నివాళి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. రజని ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ గడ్డ మంచి మనసున్న గాయకుడ్ని కోల్పోయింది.

డా. మహ్మద్ రఫీ

SA:

View Comments (1)