ఆజాద్ హింద్ ఫౌజ్ నేత

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 21

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నేతృత్వ లక్షణాలు కలిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో విద్యాభాసం చేసి, ఐ.సి.ఎస్ పరీక్షలో 14వ ర్యాంకులో ఉత్తీర్ణుడైన భారతీయ మేధావిగా నిలిచాడు. ఆంగ్లేయ ఉద్యోగం చేయడం ఇష్టంలేని బోస్ ఆ ఉద్యోగం మాని భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. తొలుత గాంధీగారి అహింసా యుత పోరాటాన్ని సమర్థించిన బోస్ ఆంగ్లేయులను గెలవాలంటే సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని తన మార్గాన్ని ఆ దిశవైపు మార్చుకుని ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. తర్వాతి కాలంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ని తయారుచేసి దానికి నాయకత్వం వహించి, నేతాజీగా గుర్తింపు పొందాడు. బోస్ తన 20సంవత్సరాల భారత స్వాతంత్ర్య ఉద్యమ జీవితంలో 11సార్లు జైలుపాలయ్యాడు. భారతదేశం నుండి బహిష్కృతుడయ్యాడు. ఆంగ్లేయులచే గృహ నిర్బంధంలో వుండి, వారి కన్ను కప్పి తప్పించుకుని, విదేశాలు చేరుకుని జపాన్, జర్మనీ వంటి దేశాలతో పొత్తు కుదుర్చుకుని మన స్వాతంత్ర్యం కోసం వారి సహకారాన్ని అర్థించాడు. జర్మనీలో ఆజాద్ హింద్ రేడియో కేంద్రాన్ని మొదలు పెట్టి, పలు ప్రసారాల ద్వారా భారతీయులను స్వాతంత్ర్య సమరయోధులుగా మార్చగలిగాడు. బెర్లిన్లో ఫ్రీ ఇండియా సెంటర్‌ను స్థాపించాడు. బాధ్యతగల భారతీయ సైనికుడు, క్రమశిక్షణ కలిగిన విలక్షణమైన నాయకుడు, ప్రపంచ దేశాలతో శహభాష్ అనిపించుకున్న ఆజాద్ హింద్ ఫౌజ్ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేటికీ మన ధృవతార.

(నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం 23 జనవరి 1897)

SA: