అభినవ గజల్ స్వ(ర)రూపం

ప్రముఖ గజల్ గాయని డాక్టర్ కె.స్వరూప చేసిన గజల్ గానం మధురంగా సాగింది. జనవరి 28 విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ మరో 15 కళా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తొలుత భక్తి కృతి ‘సరసజనాభి సోదరి..’ అంశాన్ని శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం డాక్టర్ సి.నారాయణరెడ్డి రచించిన ‘మంచు పొగలు ఉండేది ఆ కొద్ది సమయాలే.. ఆ తదుపరి ఉండేది ఆదిత్య కిరణాలే. గజల్ ను రమణీయంగా గానం చేశారు. తెలుగుతో పాటు పలు హిందీ గజలను స్వరూప ఆలపించారు. ఆమె గాత్రానికి తబలా పై బాలు, కీబోర్డుపై వీరభద్రరావు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పోలీసు రవాణా విభాగం ఐజీ కె.సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ వెలగా జోషి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గోళ్ల నారాయణరావు, రచయిత్రి పద్మకళ, మంచెం వెంకటరమణ, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వరూపను ‘గజల్ గానప్రవీణ’ బిరుదుతో సత్కరించారు.

సుమధుర గాన స్వరం కె.స్వరూప:
కళకు కళాకారుడికీ ..  కళాత్మక హృదయానికి తూకం రాళ్లు వెతుక్కుంటున్న ఈ కాలంలో కూడా..   ప్రదర్శనలకు పురస్కారాలకు పరుగులు తీయకుండా.. తన మానాన తాను.. తనకంటే పదునైన మరో తరాన్ని సంగీత సామ్రాజ్యానికి అందించాలన్న తాపత్రయంతో.. నాలుగుగోడల మధ్యే తనను తాను పరిమితం చేసుకుని  నవతరాన్ని సంగీత తరంగాలకు తరలించాలన్న తన సంకల్పమే…. చిత్రసీమకు..  ప్రపంచ దేశాలకు ఆమెను పరిచయం చేసింది.
అచ్చ తెనుగు మాటలనే తన ఆస్తి పాస్తులుగా … సరిగమపదలనే తన సర్వస్వయంగా మలచుకుని దిగంతాల ..దేశవిదేశాల .. భారతీయ భావావేశాల్ని.. సహజసిద్ధ స్వభావ సంపదల్ని సమతా మమతల్ని శాంతి సౌభాగ్యాల్ని… వినూత్నముగా విశేషంగా..ప్రకటమయ్యే.. భాషా బీజాల్ని … భావతరంగాల్ని .. శృతులుగా అల్లుకుంటూ … సౌమ్యంగా సాగిపోతున్న గాయనీమని …. తెలుగులో గజల్లు పాడుతున్న అతి తక్కువ మంది మహిళల్లో గజల్ ఆమని ఈ నాటి మన గజల్ స్వరూపం భవిష్యత్తులో… ఎన్నెన్నో సమున్నత శిఖరాలు అధిరోహించాలని 64కళలు.కాం ఆకాంక్షిస్తుంది.
– పద్మకళ

SA: