నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం

తెలుగునాటకరంగ దినోత్సవం(16 ఏప్రిల్) సందర్భంగా…,. నాటకం-సమాజం

నాటకం సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక హామీ. ఇతర వ్యక్తుల లోని బలహీనతలను సొమ్ము చేసుకోదు నాటకం. బలహీనతలని బలహీనపరచి గుణాత్మకమైన బలాన్ని ఇచ్చేది నాటకం.
నాటకం చూసే ప్రేక్షకులు, నాటకం ప్రదర్శించే నటులు, నాటకం ప్రదర్శించబడే రంగస్థలం…
ఈ మూడు సమాజంలోనివే కాబట్టి నాటక ప్రయోజనం కూడా సమాజానికి వేయిరెట్లు మేలు చేసేదైఉంటుంది. పురాణ పాత్రలు ఆనాటి సమాజంలోని సత్య, నీతి నియమాలను ఏ విధంగా పాటించాయో, ఈనాటికీ ఆయా పాత్రలను మనం ఎందుకు పూజనీయం గా భావిస్తున్నాము వారు ఏర్పరిచిన దారులు ఈనాటి కే కాక రాబోయే తరాలకు కూడా ఏ విధంగా బంగారు బాటలు అవుతాయో తెలియజేస్తాయి పౌరాణిక నాటకాలు. ఇక పద్య నాటకం అంటే బంగారానికి మంచి గంధం వాసన లాంటిది. సుమారు వెయ్యి సంవత్సరాల పైన చరిత్ర కలిగి ప్రాచీన భాష హోదా పొందిన తెలుగు భాష ఈనాటికీ ప్రజల మధ్యలో సజీవంగా నిలబడటానికి ప్రధాన కారణాలలో పద్య నాటకం మొదటి కారణం. పద్య నాటకం ప్రదర్శించడం వల్ల చూడటం వల్ల పామరుడు కూడా పండితుడయ్యాడు నిరక్షరాస్యులైన నటుడికి, ప్రేక్షకుడికి వయోజన విద్యలాంటిది పద్యనాటకం పద్యనాటకంలో సాహిత్యం సంగీతం తో పాటు వినిపిస్తుంది కాబట్టి సంగీత ప్రియులకు సాహిత్యాన్ని భారీ బంపర్ ఆఫర్ గా అందిస్తుంది పద్య నాటకం
సంగీత సాహిత్యాలతో పాటు ఆయా పాత్రలకు తగినట్లుగా వేషాలు వేసుకుని నటులు అభినయిస్తారు కాబట్టి పద్య నాటకం ఒక విజ్ఞాన సర్వస్వం లాంటిది .
సకల కళల సమాహారంగా విలసిల్లుతుంది. సమాజంలోని సమస్యలను వాటికి పరిష్కారాలను కూడా చూపెట్టే సాంఘిక నాటికలు సమాజ చైతన్యానికి స్ఫూర్తి దాతలు. మహోన్నతమైన ప్రయోజనకారి నాటకం.

డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు
____________________________________________________________________________

తెలుగు నాటకరంగ దినోత్సవం ఎందుకు ?
నాటక ప్రదర్శనతోపాటు నాటకానికి సంబంధించిన అనేక అంశాలపై సదస్సులు జరగాలని, నాటక కళాకారుల జయంతులను వర్ధంతులను నిర్వహించడం ద్వారా ప్రజల్లో నాటక కళ పట్ల ఉత్సాహం, విలువలు పెరుగుతాయని, వీటన్నింటిని సమతుల్యం చేసేలా ఉండేందుకు నాటకరంగ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలుగు నాటక కళాకారులు భావించారు. అయితే, ఏ రోజును నాటకరంగం దినోత్సవంగా చేయాలన్న అంశంపై అనేక చర్చలు జరిగాయి. అనేకమంది అనేక పేర్లూ, తేదీలు సూచించారు. దీనికి 2000వ సంవత్సరంలో బీజం పడింది. నాటకరంగాన్ని మరింత పటిష్టపరచడంకోసం ఇతర దేశాల, రాష్ట్రాల నాటకరంగానికి ఉన్నట్లుగా తెలుగు నాటకరంగానికి కూడా ఒక దినోత్సవం ఉంటే బాగుంటుందని భావించి, “ఏప్రిల్ 16 తెలుగు నాటక దినోత్సవం” శీర్షికతో 2000 ఏప్రిల్-జూన్ ప్రత్యేక సంచికను “యవనిక” ప్రచురించింది. యవనిక ఆలోచనకు “ఆంధ్రప్రదేశ్ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక” సహకారం తోడైంది. తెలుగు నాటక కళాకారులంతా నాటకరంగ దినోత్సవ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. తెలుగు నాటకరంగంలో తొలి నాటక సమాజాన్ని స్థాపించి తొలి ప్రదర్శన చేసిన వాడు “కందుకూరి వీరేశలింగం పంతులు”, వారి జన్మదినాన్ని నాటక సంస్థలు 2001 నుండి తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరుపుతూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కందుకూరి వారి జన్మదినాన్నే “తెలుగు నాటకరంగ దినోత్సవం” గా ప్రకటిస్తూ 2007 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ. విడుదలచేసింది. 2007, ఏప్రిల్ 16న తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా తెలుగు నాటకరంగ దినోత్సవం జరుపబడింది.
ఈ కరోనా తెలుగు నాటక జవజీవాల్ని చాలా వరకూ హరించింది. కరోనా విష కౌగిలిలో ఎందరో నటులు, సాంకేతిక నిపుణులు.. జీవితాల్ని కోల్పోయారు.

నాటకం మీద ఆధారపడి బ్రతికే… వేలాదిమంది బ్రతుకులు అస్తవ్యస్తం అయిపోయాయి.కనీసం..ఈ తెలుగు నాటక దినోత్సవమైనా నాటక రంగాన్ని నిలబెడుతుందని..నాటకాన్ని నమ్ముకున్న వేలాదిమంది బ్రతుకుల్లో ఆశా దీపాల్ని వెలిగిస్తుందని ఆశిస్తున్నాను..
అందరికి “తెలుగు నాటక రంగ దినోత్సవ” శుభాకాంక్షలు..

SA: