దిగ్విజయంగా అమెరికా తెలుగు సాహితీ సదస్సు

నవంబర్ 23, 2019, ఓర్లాండో మహా నగరం, ఫ్లారిడా

ఓర్లాండో మహా నగరం లో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా ముగిసింది.
ఇక ఫ్లారిడా లో, అందునా ఓర్లాండో లో జరిగిన మొట్టమొదటి తెలుగు సాహితీ సదస్సు ప్రారంభ సభ:
ప్రధాన సమన్వయ కర్త మధు చెరుకూరి గారి నిర్వహణ లో జరిగిన ప్రారంభ సభలో భారత దేశం నుంచి మొదటి సారిగా అమెరికా ఆహ్వానిత అతిధులుగా విచ్చేసిన ‘శతావధాని” డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, శ్రీమతి జ్యోతి వలబోజు గారు,  చెరుకూరి రమాదేవి, ఎస్. నారాయణ స్వామి, వంశీ రామరాజు గారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయగా, రాధికా నోరి ప్రార్ధనా గీతంతో సభ శుభారంభం అయింది. ఓర్లాండో మహా నగర తెలుగు సంఘం (TAGO) అధ్యక్షులు నరొత్తమ్ జీడిపల్లి సభికులకి స్వాగతం చెప్పగా, ప్రధాన అతిధుల సముచిత ప్రసంగాలు, ముఖ్యంగా డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, చెరుకూరి రమా దేవి గారు, జ్యోతి వలబోజు, నారాయణ స్వామిల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఓర్లాండో మహా నగరం లో బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాద్యాయులకి (సత్య మంతెన, చంద్రశెఖర్ అయ్యలరాజు, ప్రవీణ పల్లమరెడ్డి, సారిక శ్రీరామ్, ధరణి ఎర్రా) చిరు సత్కారం జరిగింది.
పుస్తకావిష్కరణలు: మూడు విడతలలో జరిగిన పుస్తకావిష్కరణ వేదికలలో ఈ క్రింది నూతన గ్రంధాలు ఆవిష్కరించబడ్డాయి. సదస్సుకి వచ్చిన ప్రతినిధులకి ఇచ్చిన నమోదు సంచీలో ఇంచుమించు ఈ గ్రంధాలు అన్నీ ఉచితంగా బహూకరించబడ్డాయి.
వంగూరి సంస్థ ప్రచురణలు: అమెరికా తెలుగు కథానిక -14: అమెరికులాసా కథలు (వంగూరి చిట్టెన్ రాజు); నాట్య  భారతీయం (ఉమా భారతి కోసూరి); కాళీ పదములు & కాకీక కాకికి కాక (పాలపర్తి ఇంద్రాణి); తెన్నేటి సుధ కథలు: “రంగంటే ఇష్టం”(చాగంటి తులసి); చైతన్యం కథలు (సుధేష్ణ సోమ), “కంటి వైద్యం లో ప్రాచీన భారత దేశం విజ్ఞాన సంపద” (డా. వి.కె.రాజు); తెలుగే గొప్ప భాష -కానీ కనుమరుగౌతున్నది (పారుపల్లి కోదండ రామయ్య) .
అట్లాంటా నుంచి వచ్చిన పెమ్మరాజు లక్ష్మీ రావు గారు బాపు గారి 36 తిరుప్పావై పంచ రంగుల వర్ణ చిత్రాల అల్లిక ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
ప్రసంగ వేదికలు: ఈ రెండు రోజుల సభలో జరిగిన ప్ర్రసంగ వేదికలు ఎస్. నారాయణ స్వామి సమర్ధవంతమైన నిర్వహణలో జరిగాయి. ఆ వేదికలలో రచయితలు సుమారు 75 మంది సభికుల సమక్షం లో ఎంతో ఉత్సాహంతో ఈ క్రింది సాహిత్య ప్రసంగాలు చేశారు. వీరిలో కనీసం పది, పదిహేను మంది ఫ్లారిడా రాష్త్రం వారే కావడం చెప్పుకోదగ్గ విశేషం.

జ్యోతి వలబోజు: అంతర్జాలంలో తెలుగు ప్రస్థానం.
అత్తలూరి విజయ లక్ష్మి: శరత్ నవలలో శ్రీకాంత్.
ప్రభల జానకి: కురు వంశ కుల వధువులు……ధర్మ మూర్తులు.
పద్మ వల్లి: కథ చెప్పడం ఓ కళ !
సుభద్ర వేదుల:కథల్లో కొత్త వస్తువులు కావాలా? కావలిస్తే అవి ఏమిటి?
లలితా త్రిపుర సుందరి: బ్లాగెడివి కబుర్లట !:
ఇంద్రాణి పాలపర్తి: ‘కథా రచనలో లోపాలు-కారణాలు.
శ్రీనివాస్ నాగులపల్లి: “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం పై ఒక అవలోకనం”
భాస్కర్ పులికల్: నా సాహిత్య ప్రయాణం
మధిర మూర్తి: ఆంధ్ర సాహిత్య మకుటము – పోతన భాగవతము.
రాధిక నోరి: నా కథలు-సామాజిక స్పృహ
శ్రీనివాస్ సత్తిరాజు: ఆధునిక తెలుగు కవిత్వంలో “నేను” పదప్రయోగం.
భూషణ్: కవిత్వం ఎందుకు చదవాలి ??;
ఎస్.నారాయణ స్వామి: నిడదవోలు మాలతి సాహిత్యం.
వంశీ రామరాజు: గుర్తుకొస్తున్నారు: సినారె, రాయప్రోలు.
ఉమా భారతి: సర్వకళా సారం సాహిత్యం
శారదా పూర్ణ శొంఠి: నేను , నా రచనలు, నా ప్రచురణలు
అపర్ణ యేలూరిపాటి:సాహిత్యం లో కుటుంబ వ్యవస్థ.
భరద్వాజ కిశోర్: వలస వచ్చిన సంస్కృతి
విన్నకోట రవిశంకర్:  “కవిత్వంలో ఆశావాదం, నిరాశావాదం”
ప్రత్యేక ప్రసంగాలు, స్వీయ కవితలు: ‘శతావధాని’ డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ; శారద కాశీవజ్జుల తదితరులు.
మొదటి రోజు ప్రసంగ వేదికల అనంతరం పురస్కార సభలో ఈ క్రింది ఆత్మీయ సత్కారాలు జరిగాయి.
జీవన సాఫల్య పురస్కారం: అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారిని సగౌర్వంగా గుర్తించి సత్కరించే సాంప్రదాయం లో ఈ 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ప్రముఖ రచయిత సత్యం మందపాటి & విమల దంపతులకి జీవన సాఫల్య పురస్కారం శోభాయమానంగా జరిగింది.
భారత దేశ ఆహ్వానిత అతిధుల పురస్కారం:
మొదటి రోజు సాయంత్రం జరిగిన పురస్కార సభలో భారత దేశ అతిధులైన డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, జ్యోతి వలబోజు, ప్రభల జానకి, అత్తలూరి విజయ లక్ష్మి గార్లకి ఆత్మీయ జ్ఞాపిక తో చిరు సత్కారం జరిగింది.
ఘంటసాల ఆరాధనోత్సవాలు:
సాహితీ సదస్సు అనంతరం 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు -9వ బాలూ సంగీతోత్సవ కార్యక్రమం లో ‘అపర ఘంటసాల” బాల కామేశ్వర రావు (హైదరాబాద్), శారద ఆకునూరి (హ్యూస్టన్), రాధిక నోరి (టాలహస్సీ), సత్య కడాలి (కొలంబియా, NC)ల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. వంశీ రామరాజు గారు హైదరాబాద్ లో గత 31 సంవత్సరాలగా నిర్వహిస్తున్న దివ్యాంగ బాలబాలికల సంక్షేమ సంస్థ వేగేశ్న ఫౌండేషన్ కి విరాళాల సేకరణ కోసం జరిగిన ఈ కార్యక్రమానికి శ్రోతలు ఉదారంగా స్పందించారు.
రెండు రోజుల ఎంతో ఆహ్లాదకరమైన సాహిత్య వాతావరణం లో ఆత్మీయంగా జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు  ఒర్లాండో మహా నగర తెలుగు సంఘం వారి వందన సమర్పణ తో విజయవంతంగా ముగిసి, ప్రతినిధులకి చిరకాల జ్ఞాపకాలని మిగిల్చింది.

-వంగూరి చిట్టెన్ రాజు

SA:

View Comments (1)