50 వసంతాల వాసవ్య మహిళా మండలి

* జనవరి 28 న విజయవాడలో – వాసవ్య మహిళామండలి ‘స్వర్ణోత్సవం ‘
* ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
* మహిళాభ్యున్నతికై 1969 లో ప్రారంభించిన చెన్నుపాటి విద్య
* స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా  తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రదానం

మహిళలకు సాధికారికత కట్టబెట్టాలని తలచుకొని, ఆ ఆసక్తినే తనకు శక్తిగా మలచుకొని మహిళలకు సేవ చేయాలనే తలంపుతో 1969 లో చెన్నుపాటి విద్య గారు ‘వాసవ్య మహిళామండలి ‘ ని విజయవాడలో ప్రారంభించారు. లక్షలాది నిరుపేదలైన అబలలకు, బాలికలకు ఆలంబనగా నిలిచిన అమ్మ విద్యమ్మ అక్షరాలా ఓ ఆదర్శ మాన్యమహిళ. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం వంటి మేలుగుణాల కలబోతగా వాసవ్య మహిళా మండలి ఉత్తమ ప్రభుత్వేతర సంస్థగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచుకుంది. వాసవ్య మహిళామండలి సేవలను వాస్తవ సేవల మహిళా మండలిగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి సల్పినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందలాది గ్రామాలకు విస్తరించిన వాసవ్య మహిళా మండలి సేవలు లక్షలాది మహిళల స్వయంసమృద్ధికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఐదు దశాబ్ధాలుగా సామాజిక సేవలో అలుపెరుగని కృషితో వాసవ్య మహిళా మండలి జనవరి 28 న ‘స్వర్ణోత్సవం ‘ జరుపుకోనుంది. సామాజిక సేవనే ఓ గౌరవ ప్రదమైన ఉద్యోగంలా, ఓ ఉద్యమంలా తమ్ముడు ప్రముఖ వైద్యులు డా. సమరం గారు, తన కుమార్తెలు శ్రీమతి రశ్మి, కీర్తి, దీక్ష మరియు కుటుంబ సభ్యులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సహాయసహకారాలతో నిరంతరాయంగా కొనసాగిస్తూ వున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళామిత్ర
వాసవ్య మహిళా మండలి పేరిట నిస్సాహాయ మహిళలకు, బాలికలకు అండగా నిలిచి, స్వచ్ఛంధంగా వారిని ఉద్యోగినులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దటంలో జాతీయస్థాయిలో పేరుగాంచిన కీ.శే. శ్రీమతి చెన్నుపాటి విద్యగారు మరో అడుగు ముందుకేసి, నేడు నాగరిక సమాజంలోనూ నానాటికీ పెరిగిపోతున్న మితిమీరిపోతున్నటువంటి మహిళలు ఎదుర్కొంటున్న అత్యాచారాలు, అవమానాలు, గృహహింసతో, ఆకతాలయి వేధింపులు, వివక్షలు అభద్రత వంటి అనేక సమస్యలను రూపుమాపే ఆలోచనతో మన దేశంలో, రాష్ట్రంలో ప్రధమంగా “మహిళామిత్ర” అనే ఓ వినూత్న స్వచ్ఛంద సేవా విభాగానికి 2017 నాటి విజయవాడ పోలీస్ కమీషనర్ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారి సహాయంతో రూపకల్పన చేశారు. ఈ మహిళా మిత్ర నేరుగా పోలీసువారిని ఆశ్రయించలేని స్త్రీలకు సహాయకారిగా వుంటూ, వారికి, పోలీసువారికి మధ్య ఓ అనుసంధాన సంస్థగా కూడా తన సేవలందిస్తుంది.
మహిళల రక్షణ, మహిళలకు స్వయం ఉపాధి కల్పన అనేక వృత్తులలో ఉచిత రీతిన శిక్షణలు అందించటంలో మహిళామిత్ర సక్రియపాత్ర పోషిస్తుంది. బాధిత మహిళలకు సంబంధిత న్యాయపరమైన సహకారం అందే విధంగా మహిళా మిత్ర బాధ్యత వహిస్తుంది.

గాంధేయ మార్గంలో మహిళాభ్యున్నతికై మహిళలచే గత 50 సంవత్సరములుగా విజయవంతంగా నిర్వహించబడుతున్న ప్రభుత్వేతర, నిస్వార్ధ సామాజిక సేవాసంస్థ.
ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా 36లక్షలకు పైగా మహిళలు, బాలికలు సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా లబ్ధిపొందటం ప్రత్యేకంగా ప్రస్తావించదగిన విషయంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించి, స్వర్ణ జయంతి వేడుక సమయంలో  తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ను ప్రదానం చేయనున్నారు.

SA:

View Comments (2)