సెగ తగ్గని నిప్పురవ్వ

జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో విరసం అర్థశతాబ్ది వేడుకలు

‘సాయుధ విప్లవ బీభత్సుని సారథినై
భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీతా ఝంఝరిని ప్రసరిస్తాను
మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను”
అని ప్రతిన బూనిన శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పడిన విరసానికి యాభై వసంతాల పండుగ. సంస్కరణల వల్ల సాంఘిక వ్యవస్థలోని అన్ని విషవలయాలలో నూటికి నూరు పాళ్ళు అభివృద్ధిని సాధించే మార్పు జరిగితే అదే విప్లవం. రివల్యూషన్ అనే ఆంగ్ల పదానికి తెలుగులో విప్లవం అని సమానార్థకంగా ఉపయోగించారు.
తెలుగు సాహిత్య చరిత్రలో 1970-90 మధ్య కాలాన్ని విప్లవోద్యమ కాలంగా విమర్శకులు అభివర్ణించారు. విప్లవ పంధాలో పయనించాలంటే శ్రమ, పట్టుదల కలిగి ఉండాలి. నమ్మిన సిద్ధాంతంపట్ల నిబద్ధత ఉండాలి. త్యాగాలు చేయాలి. అప్పుడు మాత్రమే సరైన సమాజా న్ని స్థాపించుకోగలుగుతామనీ, కాలం చెల్లిన సంస్కరణ వాదానికి చరమగీతం పాడి, నిస్సహాయ స్థితిలో-నిలబడిపోయిన సాంస్కృతిక వ్యవహారాలను తట్టి లేపి, కొన ఊపిరితో ఉన్న అభ్యుదయ రచయితల ఉద్యమ దుస్థితిని తొలగించుకుని జాతిని సమగ్ర విమోచనం వైపు నడిపించేందుకు విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావం జరుగుతోందని శ్రీశ్రీ తెలిపారు.
దేశంలో అవినీతి, అరాచకాలు, బంధుప్రీతి, కులపిచ్చి, నిరుద్యోగం ఎక్కువై భూస్వాముల ఏలుబడిలో, తీరుబడిలేని పాలకుల పరిపాలనలో పేదవాడి ఇంట ముంగిట దీపం కొడిగట్టే పరిస్తితి ఏర్పడింది. అందుకే, బాధ్యత కలిగిన ప్రతి రచయిత దోపిడీ వ్యవసపై రాజీ లేని పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తెరిగి నిజాన్ని – నిర్భయంగా చాటాల్సిన సమయమిదని, రచయితలు తమ కలాలను కత్తులుగా మార్చుకుని ప్రజలకు అండగా నిలబడి సాంస్కృతిక వికాసనవశకానికి నాందీ గీతమై పల్లవించాలనీ, భయ సంకోచాలను వీడి జాతి జీవితంలో కాంతులు ప్రసరింపజేయాలన్న అజెండాను విరసం తన ధ్యేయంగా మార్చుకుంది. మార్క్సిస్టు భావ జాలంతో సామాన్య మానవుల దీర్ఘకాలిక విమోచన పోరాటాలను అజెండాగా పెట్టుకుని సోషలిజాన్ని బలపరిచే రచయితలు కావాలని విరసం బలంగా కోరుకుంది. నూతన ప్రజాస్వామ్య స్థాపనకు వర్గ పోరాటం, తిరుగుబాటు ధోరణి తప్పనిసరని భావించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి కార్యక్రమం పెను సంచలనాలకు దారి తీసింది. విశాఖ విద్యార్థుల నుండి వెలువడిన రచయితలకు విశాఖ విద్యార్థుల సవాల్ అంటూ వచ్చిన కరపత్రం, రచయితకు మీరు ప్రజల పక్షమా? పాలకులపక్షమా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నే మేధావుల్ని, సాహితీకారుల్నీ, రచయితల్ని ఆలోచింపజేసింది. ఆ ఆలోచనే 1970 జూలై 3వ తేదీన విప్లవ రచయితల సంఘం ఏర్పడి, ఆ సంఘానికి శ్రీశ్రీని తొలి అధ్యక్షుణ్ణి చేసింది. ఈ సంఘం ఏర్పడిన తొలినాళ్ళ లోనే శ్రీకాకుళం గిరిజనోద్యమ నాయకుడు వెంపటాపు ” సత్యాన్ని పోలీసులు కాల్చిచంపారు.
అలా విరసం పుట్టుక జరిగి ఏభై సంవత్సరాలైంది. తెలుగు సాహిత్య చరిత్రను ఒక మలుపు తిప్పిన గొప్ప సందర్భం. ఆనాడు 1970 అక్టోబర్ లో ఖమ్మం జిల్లాలో విరసం ప్రథమ మహాసభలు జరిగాయి. అప్పుడు శ్రీశ్రీతో పాటు కేవీరమణారెడ్డి, వరవరరావు, జ్వాలా ముఖి, రావిశాస్త్రి, నిఖిలేశ్వర్, నగ్నముని, కొడవటిగంటి కుటుంబరావు, కాళీపట్నం రామారావు తదితరులు ఈ మహాసభలో పాల్గొన్నారు. ఏడు అంశాలతో కూడిన విరసం ప్రణాళికలను వారు వెలువరించారు. మార్క్సియన్ సోషలిజం, ప్రజల దీర్ఘకాలిక పోరాటాన్ని గుర్తించి బలపర్చే రచయితలే సభ్యులు, ఏ రూపంలో జరుగుతున్నా, ప్రజల వర్గపోరాటాలన్నిటినీ సమర్ధించడం,
సర్వసమగ్రమైన దేశ స్వాతంత్ర్యం లక్ష్యం, వలస, -భూస్వామ్య, ధనస్వామ్య అవశేషాల తొలగింపు, నూతన ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడటం, శ్రామిక అంతర్జాతీయత, దేశదేశాల ప్రజలు విమోచన పోరాటాన్ని బలపరచడమనే ఏడు అంశాల ప్రణాళికను ప్రకటించింది. ఇది విప్లవ సాహిత్యోద్యమానికి ఆయుధంగా అందించింది. ఈ అక్షరాలే తెలుగు నేలపై అరుణ పతాకను రెపరెపలాడేలా చేశాయి. ఇది చారిత్రక సత్యం. అయితే, గత ఏభై ఏళ్ళ విరసం ప్రస్థానం మానవ జీవన విధానాన్ని పూర్తిగా మార్చలేకపోయింది. నేటి ప్రపంచీకరణ నేపథ్యం ఒక సవాల్ గా మారింది. సవాలక్ష సమస్యలు, సమాజం ముందు సమాధానం కోసం వెతుక్కుంటున్నాయి. వాటికి సరైన పరిష్కార మార్గాల కోసం అన్వేషణ సాగుతోంది. హక్కుల కోసం పోరాట పంథాను ఏర్పరుచుకున్న విరసం పీడిత తాడిత ప్రజానీకంపట్ల తన వైఖరిని బలంగానే చాటింది. ఆ సందర్భంలో ప్రజాసమస్యలపై తిరుగుబాటు మార్గం తప్పని సరైందనేది పెద్దలమాట. సాహిత్యం , రాజకీయాలు వేర్వేరు అయినప్పటికీ రాజకీయాలకు దిశానిర్దేశం, లక్ష్యం ఉంటుంది.
కానీ, సాహిత్యం లక్ష్యాన్ని సాధించిన తర్వాతకూడా దాని ప్రాధాన్యతను కోల్పోదు. నేటి సమాజానికి విరసం అవసరం ఉంది. ఇలాంటి సాహిత్యం ప్రయోజనకారి, సమాజ సంస్కారి కావాలి. ప్రతిసంస్థకు పరిథులుంటాయి. అది చెయ్యగలిగిన వరకు చేస్తోంది. మిగిలినటువంటి సంఘాలు తమ తోడ్పాటును అందించాలి. అందుకే విప్లవాన్ని సమర్ధిస్తూ, విప్లవోద్యమ చరిత్రను ప్రతిఫలిస్తూ విప్లవ భావాలను ప్రచారం చేస్తూ రాసే సాహిత్యం విప్లవ సాహిత్యం, రాసే కవిత్వం విప్లవకవిత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవం వస్తువుగా వచ్చే కవిత్వం విప్లవ కవిత్వం అనవచ్చునని కాత్యాయనీ విద్మహే అన్న మాటలు అక్షర సత్యాలు. ఏభై ఏళ్ళ తర్వాత కూడా విరసం దారిని ప్రశ్నిస్తూ ఉన్నామనే విషయాన్ని పక్కన పెడితే సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ముందు కు సాగుతూ కొన్ని సందర్భాల్లో విఫలమైనా, పోరాట మార్గాన్ని వదిలిపెట్టలేదు. బయటనుంచికూడా మద్దతు తెలిపింది.
కానీ కాలానుకూలంగా వచ్చిన వాదనలకు ఎదురొడ్డి నిలబడ లేకపోయింది. ఒక్కొక్కసారి అగ్నికణాల అరుణ పతాకను బాహాటంగానే ఎగుర వేస్తున్నా ఎక్కడో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో ప్రజాతంత్ర భావనలు – సజీవంగా ఉండటానికి ప్రధాన భూమిక విరసందే. విరసం ఏభై ఏళ్ళ వేడుకలు ప్రజానీకానికి సరికొత్త ఉత్ప్రేరకం కావాలి.
– డా. నూనె అంకమ్మరావు

SA: