వరల్డ్ నంబర్ వన్ – హైదరాబాద్

సమున్నతమైన చారిత్రిక సంపదతో అలరారుతున్న భాగ్యనగరం మరోసారి తన చరిత్రను తానే అధిగమించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం జరిపిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ ‘జేఎల్‌ఎల్‌’ ఈ మేరకు రూపొందించిన సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌–2020ను విడుదల చేసింది.ప్రత్యేకించి ఈ సంవత్సరానికి గాను మోస్ట్‌ పవర్ ఫుల్ సిటీగా హైదరాబాద్‌ ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఐటీ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ జాబితాలోని మొదటి 20 స్థానాల్లో మనదేశానికి చెందిన ఏడు నగరాలు చోటు సంపాదించాయి. వరుసగా బెంగళూరు(2), చెన్నై(5),ఢిల్లీ(7), పూణె(12), కోల్‌కతా(16), ముంబై(20) స్థానాల్లో నిలిచాయి.

హైదరాబాద్‌ నగరం వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2014లో హైదరాబాద్‌ టాప్‌–20 నగరాల జాబితాలో సైతం చోటు సంపాదించలేక పోయిందన్నారు. 2015లో 28, 2016లో 5, 2017లో 3వ స్థానం సంపాదించిన హైదరాబాద్‌ 2018లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 2019లో బెంగళూరుతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్న హైదరాబాద్, 2020లో బెంగళూరును రెండో స్థానంలోకి నెట్టి మళ్లీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయమన్నారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్‌ నగర భవిష్యత్తుపై అనుమానాలు ఉండేవని, నగరం క్రమంగా అభివృద్థిపథంలో నడవడంతో ఇవన్నీ పటాపంచ లయ్యాయన్నారు. ఇదిలా ఉండగా ఈ పరిశోధన నివేదిక ఆషామాషీ పత్రం కాదని, ఆక్స్‌ఫర్డ్‌ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఐక్యరాజ్యసమితి డేటాను వినియోగించుకుని 130 నగరాలపై అధ్యయనం జరిపాయన్నారు. హైదరాబాద్‌ నగరం ఇన్నోవేషన్‌ ఎకానమీ రంగంలో షెంజాయ్, షాంగాయ్‌ నగరాలతో పోటీ పడుతుందని పేర్కొనడం శుభ పరిణామమని వెల్లడించారు.

SA: