ఇంకా సాధించాలని వుంది -శ్రీమతి పద్మావతి

హైదరాబాద్ మల్కాజ్గిరి లో వుంటున్న శ్రీమతి పద్మావతి గృహిణి-చిత్రకారిణి. ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ, తీరికవేళలో తనకిష్టమైన కళలో విభిన్న తరహాలో ప్రయోగాలు చేస్తూ ఔరా అన్పించుకుంటున్నారు. పుట్టింది గుంటూరులో. పెరిగింది-చదివింది-స్థిరపడింది హైదరాబాద్ లోనే. స్కూల్, కాలేజీలలో నిర్వహించే పేయింటింగ్ పోటీలలో ఎన్నో బహుమతులు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లోనే ఆలిండియా కాంపిటేషన పంపిన తన పేయింటింగ్ ను ప్రదర్శనలో పెట్టడంతో, ఇంకా ఏదో సాధించాలన్న “పట్టుదల” పెరిగిందంటారు “పట్టుదల” పద్మావతి గారు. శిల్పారామంలో తంజావూర్, నిర్మల్ పేయింటింగ్స్ నేర్చుకోవడం, వర్క్ షాప్ లు, గ్రూప్ షోలు, సోలో ప్రదర్శనలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. మరోప్రక్కన పిస్టా షెల్స్, ఈము పక్షుల 30 గుడ్లపై అద్భుతంగా పేయ్ంటింగ్స్ లను వేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 60 రికార్డులను సాధించారు పట్టుదల పద్మావతి గారు.

పిస్టా పొట్టుతో 9 గంటలపాటు గణపతుల చిత్రాలు చిత్రించి మరో రికార్డ్ తోపాటు స్వర్ణకంకణం తొడిగించుకున్నారు. అలాగే ప్రముఖుల నుంచి సన్మానాలు, పురస్కారాలు ఎన్నో. ప్రతి సంవత్సరంలో సుమారు 30 మంది పిల్లలకు శిక్షణ ఇస్తూ, వారు కూడా అవార్డులు సాధించేలా, మంచి చిత్రకారులుగా తీర్చిదిద్దుతున్నారు పద్మావతి గారు. మహిళా విభాగంలో అత్యధిక రికార్డులను సాధించినందులకు తృప్తి వున్నప్పటికి, ఎప్పటికయినా జాతీయ స్థాయిలో “గొప్ప కళాకారిణి”, అని పేరు తెచ్చుకోవాలని ఆశయంతో, పట్టుదలతో ఉన్నారు. చివరికి తీరికలేదనో, వీలుకుదరలేదనో అనుకోకుండా రోజులో కొంత సమయాన్ని కేటాయించి సాధన చేస్తే ఏ రంగంలోనైనా ఎప్పటికైనా గుర్తింపు, ఫలితం వస్తుందని నిరూపిస్తున్నారు కాసుల పద్మావతి గారు. “తల్లిదడ్రుల ప్రోత్సాహం తో పాటు మా వారు లక్ష్మికాంత్ (అర్కిటెక్) సహకారంతో ఇవన్ని సాధించగలిగానని పద్మావతి చెబుతున్నారు “. ఈ దంపతులకు ఒక అమ్మాయి(మౌనిక), అబ్బాయి (మోహిత్)సంతానం.

SA: