నాటక రంగ వైతాళికుడు

(నాటక కళా ప్రపూర్ణ “బళ్ళారి రాఘవ” గారి జయంతి నేడు.. ఆయనను గుర్తు చేసుకుంటూ..)

తన నటనా వైదుష్యంతో జాతిపిత మహాత్మాగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లనే కాక, ఆంగ్ల రచయిత జార్జ్‌ బెర్నార్డ్‌ షాలతో ప్రశంసలు అందుకొన్న మహానటుడు, నాటక కళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలలో కలిపి సుమారు 54 వేరువేరు నాటకాల్లో ప్రధాన భూమికలలో ప్రతిభావంతంగా నటించిన మహానటుడు ఆయన. ప్రపంచనాటక రంగాన్ని అధ్యయనం చేసి తాను గ్రహించిన ‘విషయం’తో తెలుగు నాటక రంగాన్ని సుసంపన్నం చేసిన ప్రజ్ఞాశాలి. మన పురాణాలు, చరిత్రలనే గాక షేక్‌స్పియర్‌ వంటి ప్రపంచ ప్రఖ్యాత రచయితల నాటకాలు కూడా లోతుగా పరిశీలించి ఆయా పాత్రల అంతరంగాలను, పరిస్థితుల ప్రభావాల వల్ల వారి మానసిక సంక్షోభాలను అవగాహన చేసుకొని తన నటనలో ఆవిష్కరించారు. నాయక పాత్రలే కాక, ప్రతి నాయక పాత్రలలోనూ కూడా నూతన పంథాలో నటించి పండిత పామరులను మెప్పించారు.
నాటకాలు వినోదాత్మకంగానే కాకుండా, సందేశాత్మకంగా, ప్రజలలో ఉత్తమ గుణాలు పెంపొందించే సాధనంగా ఉండాలని ఆయన అభిలషించారు. అందుకు అనుగుణంగా నాటకాలు రాయించి, తానే కొన్ని రాసి ప్రదర్శించారు. నాటకాలలో స్ర్తీ పాత్రలు స్ర్తీలే పోషించాలని మహిళలను రంగస్థల ప్రవేశం చేయించి సహజత్వానికి అద్దం పట్టిన నాటక రంగ వైతాళికుడు రాఘవ. 1880 ఆగస్టు 2న తాడిపత్రిలో జన్మించారు. ఆంధ్రనాటక పితామహ ధర్మవరపు కృష్ణమాచార్యులు ఈయన మేనమామ. దానితో బాల్యం నుండే ఈయన నాటకాలలో పాల్గొనే వారు. క్రిమినల్‌ లాయరుగా తాను సంపాదించినదంతా పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి, నాటక రంగానికి ఖర్చు చేశారు.
1919లో బెంగుళూరులో జరిగిన ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్లో ‘రామరాజు’ నాటకంలో ‘పఠాన్‌ రుస్తుం’ పాత్రలో రాఘవ అభినయాన్ని చూసిన విశ్వకవి రవీంద్రనాథ్‌ ఈయనను భారత దేశంలోనే అగ్ర నటునిగా కొనియాడారు. 1927లో రాఘవ నటించిన ‘దీనబంధు కబీర్‌’ హిందీ నాటక ప్రదర్శనను బెంగుళూరులో ఏర్పాటు చేశారు. అ సమయంలో ఆ నగరంలో ఉన్న మహాత్మాగాంధీని ప్రదర్శకులు నాటకాన్ని చూడమని కోరడంతో కొద్ది నిమిషాలు మాత్రం చూస్తానంటూ గాంధీ చెప్పారట. కానీ ప్రదర్శనకు వచ్చిన గాంధీ మొదటి నుంచీ తదేక దీక్షతో చూస్తూ అందులో లీనమయ్యారట. పక్కనే ఉన్న రాజాజీ ‘మీ ప్రార్థన సమయం దాటి పోతున్నది’ అని వెళ్లిపోదామని చెప్పారట. దానికి మహాత్ముడు ‘ఇది ప్రార్థన కాదా’ అంటూ నాటకాన్ని ఆసాంతం చూసి ‘రాఘవ మహారాజ్‌ కీ జై’ అని అభినందించారట.
దేశవిదేశాల్లోని ఎన్నో చోట్ల నాటక ప్రదర్శనలు ఇచ్చిన రాఘవ లండన్‌లో జార్జి బెర్నార్డ్‌ షా కోరికపై షేక్‌స్పియర్‌ నాటకాల్లోని కొన్ని సన్నివేశాలు నటించారట. రాఘవ ఇంగ్లీష్‌ ఉచ్ఛారణ, నటనకు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ ‘షేక్‌స్పియర్‌ ఎంత గొప్పగా రాశారో మీరు అంత గొప్పగా నటించారు. దురదృష్ణవశాత్తూ మీరు భారత దేశంలో జన్మించారు. ఇంగ్లాండులో జన్మించి ఉంటే మీరు షేక్‌స్పియర్‌ అంత గొప్ప వారయ్యేవారు’ అని కొనియాడారు. కొన్ని సినిమాలలలో నటించినా, అక్కడ ఇమడలేక తిరిగి నాటక రంగానికే అంకితమయ్యారు. నాటకాల్లోనే కాకుండా జీవితంలోనూ గొప్ప పనులు చేశారు. సంస్కరణాభిలాషిగా పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం అందించారు. పండుగ పబ్బాల్లో హరిజన విద్యార్థులకు తన ఇంట్లోనే భోజనం పెట్టేవారు. హరిజన పిల్లల కోసం ఆయన బళ్లారిలో ‘ముద్దుతార’ అన్న పేరుతో ప్రాథమిక పాఠశాలను నెలకొల్పారు. ఆ విధంగా నాటక అభ్యుదయానికీ, దళిత ఉద్ధరణకూ కృషి చేసిన రాఘవ 1946 ఏప్రిల్‌ 16న కన్నుమూశారు. అప్పటి, ఇప్పటి, ఎప్పటి తరాలకూ ఆదర్శమూర్తిగా నిలిచిపోయారు.

-బబ్బెళ్లపాటి శ్రీ గోపాల కృష్ణ సాయి

SA:

View Comments (1)