భారతరత్నలో రాజకీయాలు …!

నిజమే.. ప్రణబ్ ముఖర్జీ గొప్ప నాయకుడే. ప్రజ్ఞావంతుడే. కానీ, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను స్వీకరించే అర్హత ఆయనలో ఏముంది? ఈ దేశానికి ఆయన చేసిన ప్రత్యేక సేవలు ఏమిటి? ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు. పదవులకోసం పరితపించారు. కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా పనిచేసారు. ఆర్ధికవేత్తగా ఖ్యాతి గడించారు. ప్రధానమంత్రి కావాలనేది ఆయన చిరకాలవాంఛ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ప్రధాని కావాలని ఆకాంక్షించారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. ఆయనను రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ ఏనాడూ విశ్వసించలేదు. యూపీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా పోటీదారుగా మారుతారని భయపడి సోనియాగాంధీ ఆయన్ను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు. పోనీ రాష్ట్రపతిగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారా అంటే అదీ లేదు. రబ్బర్ స్టాంప్ మాదిరిగానే విధులు నిర్వహించారు. తన జూనియర్ అయిన మన్మోహన్ సింగ్ ప్రధాని కావడం, ఆయన మంత్రివర్గంలో పని చెయ్యాల్సి రావడం పట్ల ప్రణబ్ ఎల్లప్పుడూ అసంతృప్తిగానే వ్యవహరించారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్ లో నిమజ్జనం చేసి మళ్ళీ మంత్రి పదవులు అనుభవించారు. ఇంతకు మించి ప్రణబ్ ముఖర్జీ ఈ దేశానికీ చేసిన సేవలు ఏమిటో సామాన్యులకు అర్ధం కావడం లేదు. ఆయనకు భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చెయ్యడం ఎవరికీ జీర్ణం కావడం లేదు. చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకర్షించడానికి తప్ప ఈ ఎంపికలో ఏ విధమైన ఔచిత్యం కనిపించడం లేదు.

భారతరత్న అనే మాట వినిపించగానే, మొదటిసారిగా అందరి మదిలోకి వచ్చే పేరు స్వర్గీయ పీవీ నరసింహారావు ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన భూసంస్కరణలను అమలు చేసి చరిత్ర సృష్టించారు. తాను భూస్వామి అయ్యుండి కూడా భూస్వాములు వ్యతిరేకించే సంస్కరణలను సాహసంతో చేపట్టారు. భూస్వాముల ఆగ్రహానికి గురయి పదవి పోగొట్టుకున్నా లెక్క చెయ్యలేదు. పీవీ మహా పండితుడు. నిరాడంబరుడు. పదునాలుగు భాషల్లో నిష్ణాతుడు. గొప్ప రచయిత. రాజకీయాలనుంచి సన్యాసం పుచ్చుకుని పీఠాధిపతిగా వెళ్ళబోతున్న ఆయనను రాజీవ్ గాంధీ దారుణ హత్య నిలువరించింది. ప్రధానమంత్రి పదవి ఆయన్ను కోరి వరించింది. అప్పటిదాకా వామనుడిగా ఉన్న పీవీ ఆరోజునుంచి త్రివిక్రమావతారం ఎత్తారు. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా పనిచేసిన కొద్దికాలంలోనే దేశం దివాళా తీసింది. బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో కేంద్ర పగ్గాలను చేబూనిన నరసింహారావు కురుక్షేత్రంలో వాసుదేవుని తలపించారు. ఎవరూ ఊహించని విధంగా విప్లవాత్మకమైన ఆర్ధిక సంస్కరణలను చేపట్టారు. ఆర్దికమంత్రిగా రాజకీయ నాయకుడిని కాకుండా, ఏమాత్రం రాజకీయానుభవం లేని మన్మోహన్ సింగ్ ను ఆర్థికమంత్రిని చేసుకున్నారు. ఇద్దరూ కలిసి కృష్ణార్జునుల మాదిరిగా అభివృద్ధికి రంగాన్ని పరుగులు పెట్టించారు. అప్పటివరకూ ఒక కారు కొనాలన్నా, ఒక ద్విచక్రవాహనం కొనాలన్నా, టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా నెలలతరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. విదేశీ పరిశ్రమలకు, పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడంతో వందలాది విదేశీ పరిశ్రమలు మనదేశంలో కొలువయ్యాయి. లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయి. అప్పటివరకూ మనం ఖరీదైన విలాస వస్తువులు అనుకున్నవి సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ నిరుపేద కూడా సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నాడంటే అది కేవలం పీవీ నరసింహారావు చలువే. పీవీ అమలు చేసిన ఆర్ధిక సంస్కరణలు భారతదేశాన్ని సంపన్నదేశంగా మార్చాయి. ఈరోజు ఇంటింటా కార్లు, టీవీలు, ఫ్రిజ్జులు, ఇంటర్నెట్ కనెక్షన్లు పుష్కలంగా ఉన్నాయంటే అది పీవీ మహాత్మ్యమే.

విద్యారంగంలో పీవీ తెచ్చిన సంస్కరణలు ఎన్నటికీ మరపురానివే. మానవ వనరుల శాఖను ప్రారంభించారు. దేశం మొత్తం నవోదయ పాఠశాలలకు అంకురార్పణ చేసారు. గత పాతికేళ్లలో ప్రపంచంలో అనేకదేశాలు ఆర్థికసంక్షోభాలను ఎదుర్కొన్నాయి. కానీ, ఒక్క భారతదేశమే చలించకుండా మేరుశిఖరంలా నిలబడిందంటే అది పీవీ పుణ్యమే. అంతేకాదు. మరోసారి అణుపరీక్షలకు రంగం సిద్ధం చేసింది పీవీయే. మరోసారి పీవీ ప్రధాని అయి ఉన్నట్లయితే కచ్చితంగా వాజపేయికి లభించిన ఖ్యాతి పీవీకి దక్కి ఉండేది అనేది నిర్వివాదం. అలాంటి పీవీకి పదవి పోయాక అన్నీ అవమానాలే మిగిలాయి. ఆయన మీద కేసులు పెట్టారు. కోర్టు బోను ఎక్కించారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే అయిదేళ్లపాటు ఎదురులేకుండా అధికారంలో నిలిపారో, ఆ కాంగ్రెస్ పార్టీయే ఆయనను ఘోరంగా అవమానించింది. చివరకు ఆయన ఒంటరిగానే మిగిలారు. పీవీ నరసింహారావు చేసిన సేవలతో పోలిస్తే ప్రణబ్ చేసింది అణుమాత్రం కూడా ఉండదు. పీవీ నరసింహారావుకు ముందుగా ఇచ్చి మరో ఏడాది ప్రణబ్ కి ఇస్తే బావుండేదేమో తెలియదు కానీ, పీవీని విస్మరించడం మాత్రం మహాపరాధమే.
-ఇలపావులూరి మురళీ మోహనరావు

SA: