గోనబుద్ధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన లక్ష్మీపార్వతి

విజయవాడ నగరానికి చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ ప్రచురించిన, ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సిసివిఏ), సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి సంకలనం చేసిన ‘గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం పై పరిశోధనలు’ పుస్తకాన్ని గురువారం (5-03-20) నాడు, ఆంధ్రప్రదేశ్, తెలుగు అకాడమీ, చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి, విజయవాడ కల్చరల్
సెంటర్ లో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ, తెలుగు రామాయణాల్లో గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకొందని, ద్విపద కావ్యాల్లో తలమానికమని ఆగ్రంధంపై ఇప్పటి వరకూ జరిగిన పరిశోధలను ఒక చోట చేర్చిన శివనాగిరెడ్డి, ప్రచురణకర్త దిట్టకవి రాఘవేంద్రరావు అభినందనీయులన్నారు. వాల్మీకి రామాయణంలో లేని అనేక అంశాలను, జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న అంశాలను గోనబుద్ధారెడ్డి తన రచనలో పొందుపరిచారన్నారు.
డా. కప్పగంతు రామకృష్ణ గ్రంధాన్ని సమీక్షిస్తూ తెలుగు రామాయణాల్లో రంగనాధ రామాయణం ప్రసిద్ధి పొందిందని, గోనబుద్ధారెడ్డి తన రచనలో కాకతీయుల కాలంనాటి అనేక అంశాలను పొందుపరిచారన్నారు. తెలుగు అకాడెమీ సంచాలకులు, డా. పేట శ్రీనివాసులు రెడ్డి రంగనాధ రామాయణ విశిష్టతను వివరించారు.
సంకలనకర్త ఈమని శివనాగిరెడ్డి స్పందిస్తూ, క్రీ.శ. 13వ శతాబ్ది తరువాత నిర్మించి న దేవాలయాలపై గల రామాయణ శిల్పాలు, రంగనాథ రామాయణానికి అద్దం పడుతున్నాయనీ, మిగతా రామాయణాల్లో లేని అనేక ఆసక్తికర అంశాలను గోనబుద్ధారెడ్డి తన గ్రంధంలో పేర్కొన్నారనీ, ఈనాటి యువ సాహితీవేత్తలు సామాజిక దృక్కోణంలో విశ్లేషించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర పబ్లిషర్స్ అధినేత దిట్టకవి రాఘవేంద్ర రావు, సాహితీవేత్తలు డా. గుమ్మా సాంబశివరావు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, అధ్యక్షులు- గోళ్ల నారాయణరావు,
డాకి అధ్యక్షులు – కుర్రా జితేంద్రబాబులతో పాటు అనేక మంది సాహితి ప్రియులు పాల్గొన్నారు.

SA: