బెజవాడలో భామాకలాపం

ఆకట్టుకున్న రాజారెడ్డి, భావనా రెడ్డి తండ్రీ కూతుళ్ళ నృత్య ప్రదర్శన …
కూచిపూడి నృత్య సంప్రదాయాలను దేశ సరిహద్దులు దాటించి 100 పైగా దేశాలలో ప్రదర్శించిన డాక్టర్ రాజారెడ్డి, మరోకరు వారి కుమార్తె భావనా రెడ్డి. రాజారెడ్డి గారిని గురించి ఎంత చెప్పినా తక్కువే 83 వయస్సులో కూడా ఆయన ప్రదర్శించిన అంశాలు అసమాన ప్రతిభకు తార్కాణం. పద్మభూషన్, కేంద్రసంగీత నాటక అకాడమీ, ఆయను వరించని పురస్కారం లేదు. ఇక వారి కుమార్తె భావనా రెడ్డి తల్లి తండ్రుల వార సత్వాన్ని పుణికి పుచ్చుకుంటూ ఈ రోజు బెజవాడలో భామాకలాపం ప్రదర్శించారు.

భామనే సత్యభామనే.. అంటూ నవరసాలను తన నాట్యానికి రంగరించి ప్రముఖ నాట్యాచార్యుడు రాజారెడ్డి కుమార్తె భావనారెడ్డి తన అద్భుత నాట్య కౌశలంతో ‘భామాకలాపం’ను ప్రదర్శించారు. ముమ్మినేని సిద్దార్థ కళాపీఠం ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రదర్శన జరిగింది. సూత్రధారి, మాధవి పాత్రలను పద్మభూషణ్ రాజారెడ్డి పోషించగా, సత్యభామగా భావనారెడ్డి నర్తించి ప్రేక్షకులకు నయనానందకరం చేశారు. సిద్ధేంద్రయోగి. భామాకలాపం పేరిట సత్యభామను ఉద్దేశించి రచించిన ఈ రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. అందమైన నృత్య కదలికలతో, చక్కని అభినయంతో, అపురూప సౌందర్యవతి సత్యభామను ఆవిష్కరించారు. విఘ్నేశ్వరుని స్తుతితో ప్రారంభించి ప్రవేశ దరువు, వెన్నెల పదం, మాధవితో వాదోపవాదనలు చేసి రంజింపజేశారు.
సనాతన కూచిపూడి నృత్య సంప్రదాయంలో సమున్నత అంశమైన భామాకలాపం మరోసారి విజయవాడ పౌరులకు కూచి పూడి నృత్యవైభ వాన్ని చాటింది. శ్రీకృష్ణుడు తన కౌగిట్లో మాత్రమే ఉండాలని, తన మాట మాత్రమే వినాలని, ఆయన ప్రేమ తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకుంటూ సత్య భామ ప్రకటించే భావనల సమాహారమే ఈ రూపకంలోని ముఖ్యాంశం. కళాపీఠం అధ్యక్షుడు పి. లక్ష్మణ రావు కళాకారు లను సత్కరించారు. కళాపీఠం సమన్వయకర్త ఖండాపు మన్నథరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు దశాబ్ద కాలం తర్వాత రాజా రెడ్డి విజయవాడ లో ప్రదర్శన ఇవ్వడం తో నాట్యాభిమానులతో ఆడిటోరియం నిండిపోయింది.

SA: