నటనలో పెట్టనికోట ‘విన్నకోట’

రంగస్థల, సినిమా నటులు విన్నకోట రామన్న పంతులుగారి (1920-2020) శత జయంతి సంవత్సరం సందర్భంగా…

కళాకారుల కుటుంబంలో వందేళ్ళు (13-4-1920) క్రితం పట్టిన విన్నకోట రామన్న పంతులు ఈనాటి కళాకారునికి ఆదర్శప్రాయుడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే, బందరు నాటకరంగంలో జరిగిన నాటక ప్రదర్శనలు చూసి ప్రభావితులయ్యారు.
దరిమిలా, విజయవాడలో న్యాయవాది వృత్తి చేపట్టిన తరువాత కూడా నాటకరంగాన్ని విస్మరించలేదు. మంచి నాటకాలు రావాలనీ, వాటిని ప్రదర్శించాలని, తగిన పాత్రలను తృప్తిగా పోషించాలని తహ తహ లాడేవారు. న్యాయవాదిగా జీవితాన్ని సాగిస్తూనే, మరొక పక్క నటుడుగా నాటకాల్లో నటిస్తూ నాటకరంగం బాగుకోసం పాటుపడ్డారు. విజయవాడలో కొప్పరపు సుబ్బారావు గారు స్థాపించిన రాఘవ కళాకేంద్రంలో చేరి అనేక నాటకాలను ప్రదర్శించారు. వీటిలో ముఖ్యమైనది D.V నరసరాజుగారు రాసిన “నాటకం” అనే నాటకం. దీంట్లో వీరి నటనకుగాను ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీలలో బహుమతి లభించింది.
వీరి జీవితంలో “కన్యాశుల్కం” నాటకం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేది ఇందులో ‘అగ్నిహోత్రావధానులుగా వీరి నటన నభూతో నభవిష్యతి”.

వీళ్ళమ్మా శిఖతరగ, ప్రతి గాడిదకొడుకు తిండిపోతుల్లా నా యింట జేరి నన్ననేవాళ్ళే. తాంబోలం యిచ్చేసాను. యిహ తన్నుకు చావండి”
ఈ డైలాగ్ ఎన్నిసార్లు విన్నా ఆయన విశ్వరూపం మనముందు సాక్షాత్కరిస్తుంది. ఈ పాత్రని నాటకంలోనూ సినిమాలోను కూడా రామన్నగారు పోషించడం విశేషం. ఈయనకి ప్రత్యాయన్మాయం ఎవరూ లేరన్న విషయం అందరికి తెలుసు. నాటకాలతో బాటు సినిమాల్లో కూడా వైవిధ్య భరితమయిన పాత్రలు పోషించారు. వీటిల్లో ముఖ్యమైనవి “కన్యాశుల్కం” “బంగారుపాప” “దొంగరాముడు” “బాటసారి” “ఇల్లాలు”.
రామన్న పంతులు గారికి రేడియో అంటే ఇష్టం. రేడియోలో అనేక నాటకాల్లో ముఖ్యపాత్రలు ధరించారు. ముఖ్యంగా “సీతాపతి సంసారం” అనే గొలుసు నాటికలో సీతాపతి పాత్ర మర్చిపోలేని జ్ఞాపకం. అలాగే మంచి నడవడిక, వ్యక్తిత్వం, గర్వం ఇసుమంతలేని, మహామనిషి, తనకన్నా చిన్నవాళ్ళు దర్శకత్వం చేసిన రేడియో నాటకాల్లో ఇష్టపడి నటించేవారు. ఆయన కన్నా అన్ని విధాల చిన్నవాళ్ళమైనా రేడియో మిత్రులతో ఆప్యాయంగా వుండేవారు.

జంధ్యాలతో అనుబంధం
సాక్షి సినిమాలో బాపురమణలు ఆ పాత్రను మలచిన తీరు కూడా అద్భుతం. జంధ్యాల కూడా విన్నకోటవారితో తన సినిమాల్లో నటింపచేసి, గురుఋణం తీర్చుకున్నారు. వీరితో ముద్దమందారంలో కీలక పాత్ర వేయించారు. దర్శకుడిగా జంధ్యాలకు ఇదే మొట్టమొదటి సినిమా కూడా. జంధ్యాల చిన్నప్పుడు తొలిసారిగా నటించింది విన్నకోటవారి కంపెనీలోనే కావడం విశేషం. రామన్నపంతులుకు ఆకాశవాణితో ఉన్న అనుబంధం చాలా గొప్పది. వారి తుది శ్వాస వరకూ అనేక నాటకాలకు పాత్రపోషణ చేసి అలరించారు.

ఆయన శిష్యులలో చెప్పుకోదగ్గవారు జంధ్యాల, వీరభద్రరావు విజయరాం, ప్రదీప్. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన “ముద్దమందారం” ఆయన నటించిన సినిమా ఆఖరిది. దీంట్లో మూడు తరాలకు చెందిన ఆయన కుటుంబసభ్యులు పాల్గొనడం విశేషం. 1982లో వారి 62వ యేట విన్నకోట కన్నుమూసారు.
ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రనాటక కళాపరిషత్తు విజయవాడలో నిర్వహించిన ‘నాటక విద్యాలయం’లో నాటక నిర్వహణ, నటన, ప్రయోగం, మొదలయిన విషయాల మీద ఆధ్యాపకుడిగా నియమింపబడ్డారు. “నట శిక్షణ’ గురించి ఎన్నో పుస్తకాలు రాసారు.
ఈనాటి తరానికి ఆయన నటజీవితం ఒక స్ఫూర్తి. ఇటువంటి మహనీయుల అనుభవాలే నాటక రంగానికి దిక్సూచి.

పి.పాండురంగ
మాజీ సంచాలకులు
ఆకాశవాణి.

SA: