కంచు కంఠం కొంగర జగ్గయ్య సినీ నటుడే కాదు ఒక మంచి రచయిత, సాహిత్యకారుడు, కళావాచస్పతి, చిత్రకారుడు, సంపాదకుడు, రాజకీయవేత్త. ధరించిన పాత్ర ఏదైనా తన విలక్షణమైన నటనతో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసి ఒక ప్రత్యేకతను, నిండుతనాన్ని, హుందాతనాన్ని సంతరింపజేసిన విశిష్ట వ్యక్తి జగ్గయ్య. సినీరంగ ప్రవేశానికి ముందే దశాబ్దంపాటు నాటకరంగంలో విశేషమైన అనుభవం గడించిన వ్యక్తి. ఎన్.టి. రామారావు, జమున, సావిత్రి, గుమ్మడి, ముక్కామల వంటి నటీనటులతో రంగస్థలం మీద నటించిన జగ్గయ్య ఎందరు నటులకో మార్గదర్శకుడు. నటి సావిత్రి నాట్యానికే పరిమితమైన ఆమె చిన్ననాటి రోజుల్లో తను రచించిన ‘బలిదానం’ అనే నాటకం ద్వారా ఆమెను రంగస్థలనటిగా మార్చిన ఘనత జగ్గయ్యకు దక్కుతుంది. సినిమాలో నటిస్తున్నప్పుడుకూడా కళాశాల విద్యార్ధుల సమావేశాలకు వెళ్లి ‘పారిజాతాపహరణం’ వంటి ప్రాచీన కావ్యాల గురించి ప్రసంగాలు చేసిన సాహితీమూర్తి జగ్గయ్య. హైస్కూలు రోజుల్లోనే సంస్కృత, ఆంధ్రసాహిత్యాన్ని మధించిన అనుభవశాలి. ‘కళావాచస్పతి’ అనేది జగ్గయ్యకు ప్రదానం చేసిన బిరుదుకాదు. అది ఢిల్లీ లోని అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆయనకు ఇచ్చిన గౌరవ డాక్టరేటు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక నటుడు జగ్గయ్య మాత్రమే. చిన్నతనం నుంచే జగ్గయ్య క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచిన తొలి దక్షినాది సినీ నటుడు ఆయనే. ఆయనకు చిత్రకళ, వాస్తుశాస్త్రం, సమ్మోహన విద్య (హిప్నాటిజం) మీద మంచి పట్టు వుంది. జగ్గయ్య ఇంటిలో ఉన్నంత పుస్తక భాండాగారం మరే ఇతర నటుల ఇండ్లలో కనిపించదు. “నాలో వున్న ఒకే ఒక గుణం ఆత్మవిశ్వాసం. అదే నాకు ఇంతకాలం ఆసరాగా నిలుస్తూ వచ్చింది. ఎంతటి దుర్బర జీవితాన్నైనా ఆత్మవిశ్వాసమొక్కటే రక్షించ గలదు” అని గట్టిగా నమ్మిన వ్యక్తి జగ్గయ్య. డిసెంబరు 31 న జగ్గయ్య జయంతి సందర్భంగా ఆ ‘కళావాచస్పతి’ని గుర్తుచేసుకుందాం…

బాల్యంలోనే కళలపై అనురక్తి…
జగ్గయ్యది గుంటూరు జిల్లా దుగ్గిరాలకు దగ్గరలో వున్న మోరంపూడి గ్రామం. ఆయన పుట్టింది డిసెంబర్ 31, 1926. జగ్గయ్య తల్లిదండ్రులు కొంగర సీతారామయ్య, రాజ్యలక్ష్మమ్మ. సీతారామయ్య తన తండ్రిగారి పేరును జగ్గయ్యకు పెట్టుకున్నారు. వారిది సంపన్న కుటుంబం. జగ్గయ్య తండ్రికి సంస్కృత, ఆంధ్రసాహిత్యంలో మంచి ప్రవేశం ఉండడమే కాకుండా కళల మీద కూడా ఆసక్తి వుండేది. అదే జగ్గయ్య కు కలిసివచ్చిన అంశం. జగ్గయ్య తండ్రి ‘సీతారామ విలాస నాట్యమండలి’ అనే నాటక సంస్థను నెలకొల్పి ఔత్సాహిక నటులను ప్రోత్సహిస్తూ మంచిమంచి నాటకాలను ప్రదర్శింపజేస్తూవుండేవారు. ఈ నాటక ప్రదర్శనలకోసం ప్రత్యేకంగా తెనాలిలో ‘శ్రీకృష్ణ సౌందర్య భవనం’ అనే నాటక శాలను కూడా ఆయన నిర్మించారు. అందులో పండిత సభలను నిర్వహించేవారు. తరవాతిరోజుల్లో దానినే ‘రత్నా టాకీసు’గా ఆధునీకరించారు. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమపోరాటంలో పాల్గొంటూ అజ్ఞాతవాసంలో తలదాల్చుకునేందుకు వచ్చిన అంతర్రాష్ట్ర సమర యోధులకు తన ఇంటిలో ఆవాసం కల్పించి దేశభక్తిని చాటుకున్న మహనీయుడు జగ్గయ్య తండ్రి. అందుకు త్రికరణశుద్ధిగా సహకరించినవారు జగ్గయ్య తల్లి. సీతారామయ్య గారి ఇంటిలో నౌకర్లు వుండేవారు. చిన్నతనంలో జగ్గయ్య వారి భుజమెక్కి తెనాలికి వెళ్లి తండ్రి ఆధ్వర్యంలో ప్రదర్శితమయ్యే నాటకాలను చూసేవారు. జగ్గయ్య ప్రాధమిక విద్యాభ్యాసం మోరంపూడిలో, ఉన్నత పాఠశాల విద్య దుగ్గిరాలలో కొనసాగింది. హైస్కూలు లో ఉంటుండగా వారి హిందీ మాస్టారు గారి ప్రోత్సాహంతో ‘లవకుశ’ అనే హిందీ నాటకాన్ని ప్రదర్శిస్తే అందులో జగ్గయ్య లవకుమారుడుగా నటించారు. డ్రాయింగ్ మాస్టారు ద్వారా జగ్గయ్యకు చిత్రకళ అబ్బింది. విద్యార్థి దశలోనే స్థానిక ‘కాంగ్రెస్ సోషలిస్టు పార్టి’లో క్రియాశీలక సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. తరవాత ఈ పార్టీ ప్రజా సోషలిస్టు పార్టీగా మార్పుచెందింది. దళితవాడల్లోకి వెళ్లి వయోజనవిద్యా కార్యక్రమాలు నిర్వహించేవారు.

సాహిత్యం, నాటకాలే ప్రాణంగా …
1942లో గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజిలో చేరిన జగ్గయ్య ఎక్కువగా సాహిత్యం మీద, చిత్రకళ మీద కృషి చేశారు. ఆ చిత్రకళ మీద ఆసక్తిని పెంచుకుంటూ అడవి బాపిరాజు నిర్వహిస్తున్న చిత్రకళా శిక్షణా సంస్థలో తన కౌశల్యాన్ని పెంపుచేసుకున్నారు. ఇంటర్మీడియట్ చదువుకుంటూనే కవిత్వం కూడా రాశారు. ఆయన రాసిన కవితలు వివిధ పత్రికల్లో ప్రచురించబడుతూవుండేవి. అప్పట్లో గుంటూరులో ‘నవ్య సాహిత్య పరిషత్తు’ అనే సంస్థ సాహిత్య సేవ చేస్తూ వుండేది. జగ్గయ్య ఆ సంస్థలోచేరి చురుకైన పాత్ర పోషించారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే ‘అభ్యుదయ రచయితల సంఘం’ గుంటూరు శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాకుండా ‘శోభ’ అనే లిఖిత పత్రిక కూడా నడిపారు. దానికి సంపాదకుడిగా జగ్గయ్య, ప్రముఖ రచయిత బెల్లంకొండ రామదాసు క్రియాశీలక పాత్ర పోషించారు. 1944లో ఇంటర్మీడియట్ పూర్తిచేశాక సంవత్సరంపాటు ‘దేశాభిమాని’ అనే స్థానిక పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేశారు. సమాంతరంగా ‘ఆంధ్రా రిపబ్లిక్’ అనే ఇంగ్లీషు పత్రికకు సంపాదకుడిగా కూడా జగ్గయ్య పనిచేశారు. తరవాత 1945లో బి.ఎ డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టుగా తీసుకొని చదువు కొనసాగించారు. అప్పట్లో ఎన్.టి. రామారావు కూడా అంధ్రా క్రిస్టియన్ కాలేజిలోనే బి.ఎ చదువుతూ వుండేవారు. ఇద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. జగ్గయ్య ముఖ్యంగా షేక్స్ పియర్ ఇంగ్లీషు నాటకాలను ఎక్కువగా ప్రదర్శిస్తూ వచ్చారు. అదే కాలీజీలో ఫిజిక్స్ విభాగంలో వల్లభజోస్యుల శివరాం పనిచేస్తూ వుండేవారు. తదనంతర కాలంలో ఆయన సినీ నటుడిగా, వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజనీరు గా రాణించాడు. ఎన్టీఆర్, జగ్గయ్యలతోబాటు శివరాం కూడా నాటకాల్లో పాల్గొనేవాడు. ఆరోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీకి కె.వి. గోపాలస్వామి నాయుడు రిజిస్ట్రార్ గా వుండేవారు. ఆయనకు కళలమీద, నాటకాల మీద ఆసక్తి మెండుగా వుండేది. ఆయన అంతర్ కళాశాల నాటకపోటీలల నిర్వహణకు నాంది పలికితే, వాటిల్లో జగ్గయ్య ప్రదర్శించే నాటకానికి తప్పకుండా బహుమతి దక్కేది. ఉత్తమనటుడిగా కూడా అనేక బహుమతులు అందుకునేవారు. స్థానికంగా ముక్కామల కృష్ణమూర్తి (సినీ నటుడు) స్థాపించిన ‘నవజ్యోతి ఆర్టిస్ట్స్’ సంస్థ నిర్వహించే నాటకాల్లో కూడా జగ్గయ్య ప్రధాన పాత్ర పోషిస్తూ వుండేవారు. ముక్కామల తోబాటు కె.వి.ఎస్. శర్మ (సినీ నటుడు) కూడా జగ్గయ్యతో కలిసి నాటకాలు ప్రదర్శించేవారు. అలాగే ప్రజా నాట్యమండలి వారి నాటకాల్లో కూడా జగ్గయ్య పాల్గొంటూ వుండేవారు. ఇలావుండగా ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ తో జగ్గయ్యకు పరిచయమైంది. సినిమాల్లో ప్రయత్నించకూడదా అని గోపీచంద్ అడిగినా జగ్గయ్య పెద్దగా సుముఖత చూపలేదు. కాలేజీ రోజుల్లోనే ఎన్.టి. రామారావు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్.ఎ.టి) అనే నాటక సంస్థను స్థాపించినప్పుడు జగ్గయ్య కూడా అందులో సభ్యుడుగా వున్నారు. ఈ సంస్థ పేరుమీదే వారిద్దరూ అనేక నాటకాలు ప్రదర్శించారు. 1948లో బి.ఎ పట్టా పుచ్చుకున్న తరవాత దుగ్గిరాల హైస్కూలులో హిస్టరీ అధ్యాపకుడిగా ఉద్యోగంలోచేరి నాటక ప్రదర్శనలను కొనసాగించారు. మరోవైపు ఎన్.టి.ఆర్ విజయవాడలో ఎన్.ఎ.టి తరఫున నాటకాలు వేస్తుంటే దుగ్గిరాల నుంచి జగ్గయ్య వెళ్లి వాటిలో పాల్గొంటూ వుండేవారు. అప్పట్లో ‘ఆంధ్ర నాటక కళాపరిషత్’ అనే సంస్థ నాటక పోటీలను విజయవాడలో నిర్వహించింది. అందులో ఎన్టీఆర్, జగ్గయ్య కలిసి నటించిన ‘చేసిన పాపం’ అనే నాటికకు ప్రధమ బహుమతి లభించింది. మరోనాటకం ‘తెలంగాణా’లో నటించిన జగ్గయ్యకు ప్రత్యేక బహుమతి కూడా లభించింది. అదేరోజుల్లో విజయవాడలోనే సుంకర కనకారావు ‘అరుణోదయ నాట్యమండలి’ అనే నాటక సంస్థను నడిపేవారు. విశ్వకవి రవీంద్రనాథ టాగూరు రచించిన ‘బలిదానం’ అనే నాటకాన్ని జగ్గయ్య అనువదించి ప్రదర్శించేదుకు వుద్యుక్తుడైనప్పుడు సుంకర కనకారావు ఒక స్త్రీ పాత్రకు సావిత్రిని సిఫార్సు చేశారు. అప్పట్లో సావిత్రి కనకారావు సంస్థలో చిన్నచిన్న ప్రదర్శనలలో నాట్యం చేస్తూ వుండేది. నటిగా సావిత్రికి అదే తొలి ప్రదర్శన. తెనాలి కి సమీపంలో వున్న ‘ముండూరు’ అనే గ్రామంలో ‘ఖిల్జీ రాజ్యపతనం’ అనే నాటకం వేసేందుకు జగ్గయ్య గుమ్మడి వెంకటేశ్వర రావు (సినీనటుడు) తో రిహార్సల్స్ పూర్తిచేశారు. అందులో రాజుగారి ముందు నాట్యంచేసే సన్నివేశముంది. ఆ నాట్యంచేసే అమ్మాయికోసం ప్రయత్నిస్తే ఎవరూ దొరకలేదు. దుగ్గిరాల స్కూలులోనే చదువుకునే ఒక అమ్మాయి తల్లిదండ్రులతో జగ్గయ్య మాట్లాడి ఆ అమ్మాయిని తీసుకొని నాటక బృందంతో తెనాలి వరకు రైలులో వెళ్లి, ఒక ఎడ్లబండిలో ముండూరు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఆ బండి చెడిపోవడంతో, పంటపొలాలవెంట నడిచి వెళ్ళాల్సి వచ్చింది. ఆ అమ్మాయి నడవలేక ఏడవడం మొదలెట్టింది. దాంతో జగ్గయ్య ఆ అమ్మాయిని చంకనెత్తుకొని ముండూరు వరకూ మోశారు. అక్కడ ఆ అమ్మాయికి ముందుగా నాట్యం ఎలాచెయ్యాలో నేర్పి ప్రదర్శన ఇప్పించారు. ఆ అమ్మాయే తదనంతర కాలంలో ఒక అద్భుత నటిగా రూపుదిద్దుకున్న నిప్పాణి జమున.

ఆకాశవాణి లో వాచకుడుగా…
బి.ఎ కోర్సు పూర్చి చెయ్యగానే జగ్గయ్య ఆకాశవాణిలో అనౌన్సర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. దుగ్గిరాల హైస్కూలులో అధ్యాపకుడిగా పనిచేస్తూ, నాటక ప్రదర్శనలతో బిజీగా వుండగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో అనౌన్సర్ గా వుద్యోగం వచ్చింది. “ఆకాశవాణి… వార్తలు చదువుతుంది కొంగర జగ్గయ్య” అంటూ కంచు కంఠంతో ఆయన వార్తలు చదివిన సంగతి ఆనాటి శ్రోతలకు విదితమే. అలా ఆకాశవాణిలో వాచకుడిగా 1951 సంవత్సరాంతం వరకూ మూడేళ్ళపాటు జగ్గయ్య పనిచేశారు. ఢిల్లీలో కూడా తెలుగు సంస్థలలో చేరి వారితోబాటు నాటకాలలో నటిస్తూవుండేవారు. అంతేకాకుండా అక్కడి విదేశీ రాయబార కార్యాలయాలకు వెళ్లి వారితో కలిసి ఇంగ్లీషు నాటకాలు ఎన్నో ప్రదర్శించారు. ఇంతకాలంగా జగ్గయ్య నాటకాలు వేస్తున్నా ఆయనకు సినిమాల్లో నటించాలనే ధ్యాసలేదు. అయితే విచిత్రంగా ఒకరోజు జగ్గయ్యకు మద్రాసులోని త్రిపురనేని గోపీచంద్ నుంచి వుత్తరం వచ్చింది. తను తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్న ‘పేరంటాలు’ అనే చిత్రంలో నటించేందుకు మద్రాసు రమ్మని ఆ వుత్తరం సారాంశం. అప్పటిదాకా సినిమా నటనమీద పెద్దగా ఆసక్తి చూపని జగ్గయ్య గోపీచంద్ మాటను త్రోసిరాజనలేక మద్రాసు ప్రయాణం కట్టారు. అక్కడ జగ్గయ్యకు స్కీన్ టెస్ట్ చేశారు. వారం రోజులు వున్నతరవాత, మరలా పిలుస్తామని చెప్పడంతో జగ్గయ్య ఢిల్లీ తిరిగి వెళ్ళారు. అయితే ‘పేరంటాలు’ సినిమాలో జగ్గయ్య హీరోగా నటిస్తాడనుకున్న పాత్ర చదలవాడ నారాయణరావు (సి.హెచ్.నారాయణరావు) కు దక్కింది. 1951 లో విడుదలైన ఈ సినిమాకు కథ, మాటలు సమకూర్చిన గోపీచందే దర్శకత్వం వహించారు.

‘ప్రియురాలు’ లో హీరోగా…
‘పేరంటాలు’ చిత్రం విడుదలైన కొంతకాలానికి మరలా గోపీచంద్ నుంచి జగ్గయ్యకు వుత్తరం వచ్చింది. “అనివార్య కారణాలచేత ‘పేరంటాలు’ చిత్రంలో మీకు అవకాశం కల్పించలేక పోయాను. ఇప్పుడు భారతలక్ష్మి ప్రొడక్షన్స్ నిర్మాత దోనేపూడి కృష్ణమూర్తి నిర్మించబోతున్న ‘ప్రియురాలు’ చిత్రంలో మిమ్మల్ని హీరోగా తీసుకుంటున్నాను. మీరు దీర్ఘకారం సెలవు పెట్టి మద్రాసు రావలసింది” అనేది ఆ వుత్తరం సారాంశం. గోపీచంద్ మాటను కాదనలేక ఆకాశవాణి ఉద్యోగానికి దీర్ఘకాల సెలవుపెట్టి జగ్గయ్య మద్రాసు చేరుకున్నారు. మాట ఇచ్చినప్రకారమే గోపీచంద్ జగ్గయ్యను హీరోగా నిర్మాత దోనేపూడికి పరిచయం చేసి నిర్మాణం మొదలు పెట్టారు. ఈ సినిమాకు కథ, మాటలు, దర్శకత్వం గోపీచంద్ నిర్వహించగా సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఇందులో జగ్గయ్య(శ్యామ్)కు జోడీగా కృష్ణకుమారి(పద్మిని), లక్ష్మీకాంత(మోహిని) నటించగా రేలంగి (కోదండం) కూతురుగా సావిత్రి (సరోజ) నటించింది. అనివార్యకారణాల చేత చిత్రనిర్మాణం సంవత్సరం పాటు సాగటంతో జగయ్య సెలవు పొడిగించమని ఆకాశవాణికి దరఖాస్తు పెట్టుకున్నా వారు అంగీకరించలేదు. ఈలోగా జగ్గయ్యకు శుభోదయా వారి ‘ఆదర్శం’, మరో చిత్రం ‘పాలేరు’ (నిర్మాణం కాలేదు) అనే సినిమాల్లో నటించే అవకాశం రావడంతో ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. 20-02-1952న విడుదలైన జగ్గయ్య తొలిచిత్రం ‘ప్రియురాలు’ సరిగ్గా ఆడలేదు. తరవాత విడుదలైన ‘ఆదర్శం’లో జానకి, సావిత్రి నటించగా. అది కూడా విజయం సాధించలేదు. పరాజయాలతో మొదలైన వెండితెర ప్రస్థానం జగ్గయ్యను సందిగ్ధంలో పడేసింది. ఈ సమయంలో ప్రసిద్ధ దర్శక నిర్మాత హెచ్. ఎం. రెడ్డి జగ్గయ్యకు కబురెట్టి ‘బీదలఆస్తి’ అనే సినిమా ను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నానని, అందులో వేషమిస్తానని చెప్పారు. జగ్గయ్య అందులో నటిస్తూ వుండగా 1954లో ఆయన నటజీవితం కొత్త మలుపు తిరిగింది. అదే ప్రముఖ దర్శకనిర్మాత బి.ఎన్. రెడ్డి వాహినీ పిక్చర్స్ పతాకం మీద నిర్మించిన ‘బంగారు పాప’ (19-03-1955)లో జగ్గయ్య హీరో(మనోహర్)గా నటించారు. జార్జి ఇలియట్ నవల ‘సైలాస్ మార్నర్’ ఆధారంగా పాలగుమ్మి పద్మరాజు రచనచేసిన ఈ చిత్రంలో ఎస్.వి. రంగారావుది ప్రధానపాత్ర. జమున జగ్గయ్యకు జంటగా నటించింది. ఈచిత్రాన్ని చూసిన ప్రసిద్ధ బెంగాలి దర్శకుడు దేవకీబోస్ ఈ చిత్రాన్ని బెంగాలీ భాషలో పునర్నిర్మించారు. జాతీయస్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘బంగారుపాప’కు బహుమతి లభించింది. ఇక వరసగా జగ్గయ్యకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. రాగిణీ పిక్చర్స్ వారి ‘అర్థాంగి’(1955), అన్నపూర్ణా వారి తొలిచిత్రం ‘దొంగరాముడు’(1955), సినిమాలలో ప్రతినాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావుతో నటించారు. అర్ధాంగి చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ బహుమతిగా జాతీయ పురస్కారం లభించింది. ఈ సమయంలోనే జగ్గయ్యకు ఎవరికీరాని మహత్తర అవకాశం మరొకటి వచ్చింది. 1954లో తమిళంలో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ నటించిన ‘మనోహర’ చిత్రం విడుదలై విజయవంతంకాగా, దానిని తెలుగులోకి డబ్ చేశారు. అందులో శివాజీ గణేశన్ కు గంభీరమైన గొంతుతో జగ్గయ్య డబ్బింగ్ చెప్పారు. తమిళ చిత్రంలో శివాజీ గణేశన్ దీటుగా జగ్గయ్య డబ్బింగ్ చెప్పడంతో ఆ సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది. జగ్గయ్య కంఠస్వరం తెలుగు ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుంది. తదనంతరకాలంలో శివాజీ గణేశన్ నటించిన చిత్రాలు తెలుగులోకి అనువదించిన అన్ని సందర్భాల్లో జగ్గయ్యే అతనికి కంఠం అరువిచ్చారు.

విభిన్న భూమికల్లో…
జగ్గయ్య దాదాపు వంద సినిమాల్లో హీరోగా నటించారు. మరో వంద సినిమాల్లో సహకథానాయకుడిగా నటించారు. రెండు వందల చిత్రాల్లో క్యారక్టర్ నటుడుగా రాణించారు. ఆరోజుల్లో అగ్రశ్రేణి నటులు ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర రంగంలో దూసుకుపోతుండగా జగ్గయ్య మాత్రం తనదైన శైలిలో, స్థిరమైన వేగంతో నటజీవితాన్ని సాగించారు. ఎక్కువగా నాగేశ్వరరావు చిత్రాల్లో సహ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించారు. ఆయన ఏ హేరో ప్రక్కన నటించినా హీరోకన్నా జగ్గయ్యకే ఎక్కువ పేరువచ్చేది. నాగేశ్వరరావు-సావిత్రి-జగ్గయ్య కలిసి నటించిన చిత్రాలు బాగా విజయవంతమయ్యాయి. వాటిలో తోడికోడళ్ళు, వెలుగునీడలు, ఆరాధన, పూజాఫలం, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, మనుషులు మమతలు, మనసే మందిరం సినిమాలను ముందుగా చెప్పుకోవాలి. ఈ సినిమాలన్నింటిలోనూ జగ్గయ్య పోషించిన భూమికలు వేటికవే సాటి. ఇక నాగేశ్వరరావువుతో నటించిన జగపతి వారి చిత్రాలు ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు లో జగ్గయ్య నటించిన పాత్రలు ప్రతినాయక లక్షణాలతో వున్న ప్రత్యేక పాత్రలు. అక్కినేని కాంబినేషన్ లోనే నటించిన ప్రేమించిచూడులో జగ్గయ్యది సరదా పాత్ర, బందిపోటు దొంగలు లో విలన్ పాత్ర, మేఘసందేశంలో సాత్వికమైన పాత్ర. ఇలాంటి విభిన్న పాత్రలు జగ్గయ్యకు దొరకడం ఆయన చేసుకున్న అదృష్టం. నందమూరి తారక రామునితో కూడా జగ్గయ్య సహాయక, ప్రతినాయక పాత్రలతోబాటు క్యారక్టర్ నటుడిగా కూడా నటించారు. అప్పుచేసిపప్పుకూడు, కలసివుంటే కలదు సుఖం, ఇంటికి దీపం ఇల్లాలే, మంచిమనిషి, గుడిగంటలు, బడిపంతులు, అడవిరాముడు, బొబ్బిలిపులి సినిమాల్లో రామారావు తో కలిసి వైవిధ్య పాత్రల్లో నటించారు. ఇక హీరోగా పదండి ముందుకు, ఎం.ఎల్.ఎ, ఈడూ జోడూ, ఉయ్యాల జంపాల, అన్నపూర్ణ, ఆమె ఎవరు, అర్ధరాత్రి, రామాలయం చిత్రాల్లో అద్భుతంగా నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. రిచర్డ్ అటెన్బరో దర్శకత్వంలో ఆస్కార్ బహుమతులు గెలుచుకున్న చిత్రం ‘గాంధి’ తెలుగు డబ్బింగ్ వర్షన్ లో అటెన్బరో పాత్రకు గాత్రదానం చేశారు. జురాసిక్ పార్క్ డబ్బింగ్ వర్షన్ లో కూడా జగ్గయ్య గాత్రదానం చేశారు. అనుపమ చిత్ర దర్శక నిర్మాత కె.బి. తిలక్, రామవిజేతా నిర్మాతలు ప్రభాకర్, బాబురావు లకు అభిమాన హీరో జగ్గయ్య. మోహన్ బాబు నిర్మించిన ‘కుంతీపుత్రుడు’ లో జగ్గయ్య చివరిసారిగా నటించారు.

మరిన్ని విశేషాలు…
విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరు రచించిన నోబెల్ బహుమతి కవితాగ్రంధం ‘గీతాంజలి’ ని తెలుగులోకి తర్జుమా చేసిన ఘనత జగ్గయ్యదే. అలాగే టాగూరు నాటకం ‘శాక్రిఫైస్’ ని ‘బలిదానం’ పేరుతోన అనువదించడమే కాకుండా రంగస్థలం మీద ఆ నాటికను ప్రదర్శించారు. ‘మనస్విని’ పేరుతొ ఒక స్వచ్చంద సంస్థను నెలకొల్పి ఆచార్య ఆత్రేయ వంటి కవులను సత్కరించడమే కాకుండా, ఆత్రేయ సంపూర్ణ రచనలను ఏడు సంపుటాలుగా ప్రచురించి తన సాహిత్య సేవను చాటుకున్నారు. 1967లో ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. పార్లమెంటుకు ఎన్నికైన తొలి దక్షినాది భారతీయ నటుడు జగ్గయ్య కావడం విశేషం. భారత ప్రభుత్వం 1992లో జగ్గయ్యను ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు ప్రదానం చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్ ను, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్ ను ప్రదానం చేశాయి. జాగృతి చిత్ర పతాకం మీద జగ్గయ్య సొంతంగా నిర్మించిన ‘పదండిముందుకు’ (1962) ఉత్తమ తెలుగు చిత్రంగా బహుమతి అందుకుంది. తొంటి నొప్పితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న జగ్గయ్య చికిత్సానంతర ఇబ్బందులు తలెత్తడంతో 2004 మార్చి 5 న చెన్నైలో మరణించారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)